Feb 2 2020 @ 18:00PM

పాన్ ఇండియా చిత్రంగా బ్ర‌హ్మాస్త్ర... రిలీజ్ డేట్ ఖ‌రారు

దక్షిణాది చిత్రాల‌న్నీ పాన్ ఇండియా చిత్రాల కాన్సెప్ట్‌ల‌తో రూపొంది బాలీవుడ్ చిత్రాల‌కు గ‌ట్టిపోటీనే ఇస్తున్నాయి. బాహుబ‌లి, కెజియ‌ఫ్ చిత్రాల‌కు వీటికి ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు. దీంతో బాలీవుడ్ స్టార్స్ కూడా సౌత్ మార్కెట్‌పై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. ఇటీవ‌ల సల్మాన్ త‌న ద‌బాంగ్ 3 చిత్రాన్ని హిందీతో పాటు ద‌క్షిణాది భాష‌ల్లో విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు అదే బాట‌లో మ‌రో బాలీవుడ్ భారీ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుద‌ల కానుంది. ఆ చిత్ర‌మేదో కాదు ‘బ్ర‌హ్మాస్త‌’. అయాన్ ముఖ‌ర్జీ ద‌ర్శ‌క‌త్వంలో ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్స్‌, ఫాక్స్ స్టార్ స్టూడియోస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.


ర‌ణ‌భీర్ క‌పూర్‌, ఆలియా భ‌ట్ హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రంలో అమితాబ్ బ‌చ్చ‌న్‌, నాగార్జున‌, షారూక్‌ఖాన్ త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. మూడు భాగాలుగా విడుద‌ల‌వుతోన్న తొలి చిత్ర‌మిది. అందులో మొద‌టి భాగం డిసెంబ‌ర్ 4న హిందీ స‌హా, తెలుగు, త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో విడుద‌ల కానుంది.