బ్రహ్మాండనాయకి బ్రహ్మోత్సవం

ABN , First Publish Date - 2021-12-01T06:12:38+05:30 IST

తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజావరోహణంతో ప్రారంభమయ్యాయి.

బ్రహ్మాండనాయకి బ్రహ్మోత్సవం
ధ్వజారోహణంలో పాల్గొన్న అర్చకులు, అధికారులు

ఉదయం ధ్వజారోహణం.. సాయంత్రం చిన్నశేషవాహన సేవ 

తిరుచానూరు, నవంబరు 30: తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు మంగళవారం ఉదయం ధ్వజావరోహణంతో ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. తొలిరోజున నిత్యకైంకర్యాలు నిర్వహించాక ధ్వజస్తంభానికి అభిషేకం, ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా చూడాలని దేవతలను ప్రార్థిస్తూ రక్షాబంధనం చేశారు. రాగస్వర తాళాలతో దేవతలను, పంచాయుధాలను, కుముదాది గణాలను ఆహ్వానించారు. కుబేరుడి కోసం శ్రీరాగం, పరమేశ్వరుడి కోసం శంకరాభరణం, గజరాజు కోసం మాళవగౌళ, బ్రహ్మకోసం ఏకరంజని, వరుణుడి కోసం కానడ, వాయువుకోసం తక్కేసి రాగాలను మంగళవాయిద్యాలపై పలికించారు. ఉదయం 9.45నుంచి 10గంటల మధ్య ధనుర్లగ్నంలో సకల దేవతలను ఆహ్వానిస్తూ పాంచరాత్ర ఆగమ సలహాదారు, కంకణ భట్టర్‌ శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో ధ్వజస్తంభానికి గజపటాన్ని ఆరోహింపచేయడంతో ధ్వజారోహణం పూర్తయింది. ఉత్సవాలలో భాగంగా 4న రాత్రి గజవాహనం, 5న రాత్రి గరుడ, 8న పంచమితీర్థం, 9న పుష్పయాగం నిర్వహించనున్నట్టు జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సాయంత్రం అమ్మవారిని ఆలయం నుంచి వాహన మండపానికి తీసుకొచ్చి చిన్నశేష వాహనంపై కొలువుదీర్చారు. పట్టుపీతాంబర, వజ్రవైఢూర్యాలతో దర్బార్‌రాజ గోపాలుడి అలంకారంలో పిల్లనగ్రోవి, రాజదండం ధరించి గోవులను రక్షిస్తూ చిన్నశేషవాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7-8గంటల మధ్య మంగళ వాయిద్యం జియ్యర్‌ స్వాముల దివ్యప్రబంధ పారాయణం నడుమ అమ్మవారు చిన్నశేషవాహనంపై ఆసీనులై భక్తులను అనుగ్రహించారు. 

నేటి వాహనసేవలు

బుధవారం ఉదయం పెద్దశేష, రాత్రి హంస వాహనాలపై అమ్మవారు దర్శనమిస్తారు. 


పట్టువస్త్రాల సమర్పణ 

రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి సాయంత్రం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయానికి చేరుకున్న ఆమె టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, అర్చకులు, అధికారులు సంప్రదాయంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం ప్రసాదాలు, శేషవస్త్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆయా కార్యక్రమాల్లో ఆలయ డిప్యూటీఈవో కస్తూరిబాయి, ఏఈవో ప్రభాక్‌రెడ్డి, ఏవీఎస్వో వెంకటరమణ, అర్చకులు శ్రీనివాసాచార్యులు, బాబుస్వామి, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ జయకుమార్‌, రాజేష్‌, దాము, వీఐలు మహేష్‌, సురే్‌షరెడ్డి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-12-01T06:12:38+05:30 IST