సాహసి మోదీ!

ABN , First Publish Date - 2020-07-04T06:23:03+05:30 IST

లద్దాఖ్‌లో శుక్రవారం తెల్లవారుజామునే ప్రధాని ప్రత్యక్షం కావడం దేశాన్నే కాదు, మిగతా ప్రపంచాన్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఆర్మీ చీఫ్‌లు చెరోవైపు వెంటనడవగా...

సాహసి మోదీ!

లద్దాఖ్‌లో శుక్రవారం తెల్లవారుజామునే ప్రధాని ప్రత్యక్షం కావడం దేశాన్నే కాదు, మిగతా ప్రపంచాన్నీ సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తింది. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌, ఆర్మీ చీఫ్‌లు చెరోవైపు వెంటనడవగా సముద్రమట్టానికి పదకొండువేల అడుగుల ఎత్తులో ప్రధాని మన సైనికుల్లో ఉత్తేజాన్ని నింపారు, శత్రువుకు ఘాటైన హెచ్చరికలు చేశారు. నిప్పులు వెదజల్లుతున్న రెండు వజ్రాయుధాలు చిహ్నంగా ఉన్న ‘14 కార్ప్స్‌’ టోపీతో, మిలటరీ జాకెట్‌తో తానే ఓ సైనికుడిలాగా దర్శనమిచ్చారు. ప్రపంచంలో అత్యంత ఎత్తయిన యుద్ధక్షేత్రం సియాచిన్‌ తన పరిధిలోకి వచ్చే ఈ సైనిక బలగాన్ని ‘ఫైర్‌ అండ్‌ ఫ్యూరీ’ కార్ప్స్‌ అని కూడా పిలుచుకుంటారు. పాకిస్థాన్‌ చైనాలకు ప్రత్యక్షంగా ఎదురొడ్డి నిలుస్తున్న ఈ ప్రత్యేక బలగం కార్గిల్‌ యుద్ధానంతరం ఆవిర్భవించింది. గాల్వాన్‌ ఘటనలో గాయపడిన సైనికుల పరామర్శ, క్షేత్రస్థాయి పరిస్థితుల సమీక్షతో పాటు, మోదీ చేసిన ప్రసంగం సైనికులకే కాదు, దేశ ప్రజలకు కూడా ఎంతో ఉత్తేజాన్ని ఇచ్చింది. 


మోదీ పర్యటనపై ప్రశంసలతో పాటు, విమర్శలూ సహజం. ప్రతీ సంక్షోభాన్నీ తనకు అనుగుణంగా మలుచుకోవడంలో ఆయన నిష్ణాతుడు అన్నారొకరు. గాల్వాన్‌ పరిస్థితులపై జూన్‌ 19న తాను చేసిన వ్యాఖ్యలను ఆయన ఇలా సరిదిద్దుకున్నారని మరొకరన్నారు. గాల్వాన్‌, పాంగాంగ్‌లు మన భూభాగంలోనివి కావా, అక్కడకు పోకుండా పర్యాటక క్షేత్రమైన నిమ్మూకు పోవడమేమిటని కొందరు తప్పుబట్టారు. తన సుదీర్ఘ ప్రసంగంలో ఆయన చైనా పేరు ఎత్తకపోవడం ముసుగులో గుద్దులాటలాగా అనిపించింది మరికొందరికి. నెలన్నరగా సరిహద్దు వివాదం సాగుతూ, పొరుగుదేశం తన బలాన్నీ, బలగాన్నీ పోగుచేసుకుంటూపోతుంటే చొరబాటుదారుడి పేరు ప్రస్తావించడానికి ప్రధాని ఎందుకు వెనకడుగువేస్తున్నారని కొందరి బాధ. జూన్‌ 15–16 తేదీల్లో జరిగిందేమిటో దేశప్రజలకు నిజం చెప్పకుండా, ఎవరూ చొరబడలేదు, ఇంచీ భూమి పోలేదని తేల్చేసిన ప్రధాని ఇప్పుడు తన ప్రసంగంలో పలుమార్లు శత్రువు శత్రువంటూ వల్లించడం, చొరబాటుదారుడని దూషించడం ఎవరిని సంతృప్తిపరచడానికని కాంగ్రెస్‌ నేతలు ప్రశ్నిస్తున్నారు. శత్రువు ఎవరో ప్రధాని ప్రస్తావించకపోయినా, ఈ ప్రసంగం సూటిగా ఘాటుగా ఎవరికి తగలాలో వారికే తగిలింది. ఉద్రిక్తతలను చర్చలతో చల్లార్చి, వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించాలన్న సదుద్దేశంతో తాము వ్యవహరిస్తుండగా, ఈ పర్యటన ఏమిటి, రెచ్చగొట్టే ఆ ప్రసంగాలు ఏమిటి అంటూ చైనా అధికారులు, రాయబారులు ఘాటుగా స్పందించారు. 


రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ పర్యటనను రద్దుచేసి, తానే అక్కడ ప్రత్యక్షం కావడం ద్వారా ఇన్నాళ్ళూ గాల్వాన్‌ ఘటనపై నోరు విప్పలేదనీ, చైనా విషయంలో నీళ్ళు నములుతున్నారని విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిరగొట్టారు. దేశ సైనికుల ధైర్యసాహసాలను, త్యాగాలనూ ఘనంగా కీర్తిస్తూ, వీరత్వంతోనే శాంతి లభిస్తుందనీ, బలహీనులు శాంతి సాధించలేరనీ అంటూ ఎదుటివారి బలహీనతనూ, మన సన్నద్ధతనూ తెలియపరిచారు ఆయన. పిల్లనగ్రోవినీ, సుదర్శన చక్రాన్నీ గుర్తుచేస్తూ, త్రివిధబలాల్లోనే కాదు, అంతరిక్షంలోనూ శక్తివంతంగా ఉన్న భారత్‌ దేనికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ఇది అభివృద్ధి యుగం, నీ విస్తరణ కాంక్షకు తలొగ్గేది లేదని పొరుగుదేశానికి విస్పష్టమైన హెచ్చరికలు చేశారు. ఆరునూరైనా లద్దాఖ్‌ భారత్‌దేననీ, మారోమాటకు తావులేదనీ తేల్చేశారు. ఇలాంటి వీరంగాలెన్నింటినో భారత్‌ చూసిందనీ, విస్తరణ కాంక్ష ఉన్నవారు అంతిమంగా మట్టికరవడం ఖాయమని హెచ్చరించారు. భారత్‌–చైనా మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న తీవ్ర ఉద్రిక్తతల నడుమ మోదీ పర్యటన ఓ పెద్ద సాహసం. రష్యా, ఫ్రాన్స్‌లనుంచి తొలివిడతగా కొన్ని మిసైళ్ళు, యుద్ధవిమానాలు వేగంగా రప్పిస్తుండటం, నలభైవేల కోట్లతో కొత్తగా యుద్ధవిమానాలు, క్షిపణులు, ఇతర ఆయుధాల కొనుగోలుకు సిద్ధపడటంతో పాటు, అమీతుమీ తేల్చుకొనేందుకు భారత్‌ సన్నద్ధంగా ఉన్నదన్న విస్పష్టమైన సందేశాన్ని ఈ పర్యటన ప్రపంచానికి ఇచ్చింది. ఇరుదేశాలూ ఇకనైనా బలప్రదర్శనల ఘట్టానికి స్వస్తిచెప్పి దౌత్యంతో ముందుకు కదలడం శ్రేయస్కరం.

Updated Date - 2020-07-04T06:23:03+05:30 IST