Abn logo
Mar 2 2021 @ 02:56AM

బాబు పర్యటనకు బ్రేక్‌

చిత్తూరు, తిరుపతి వెళ్లకుండా నిర్బంధం

విమానం దిగగానే అడ్డుకుని నోటీస్‌

ధర్నాలకు అనుమతి లేదని వెల్లడి

వెనక్కి వెళ్లిపోవాలని హుకుం

సెల్‌ఫోన్లు లాక్కొనే ప్రయత్నం

మీడియాతో మాట్లాడేందుకూ ‘నో’

కలెక్టర్‌, ఎస్పీలను కలిసేందుకూ

ససేమిరా అన్న అధికారులు

చంద్రబాబు తీవ్ర ఆగ్రహం

లాంజ్‌లో నేలపై కూర్చుని నిరసన

పదిగంటలపాటు బైఠాయింపు

ఎట్టకేలకు హైదరాబాద్‌కు..

భగ్గుమన్న శ్రేణులు.. నిరసనలు


తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్‌ ఎన్నికల్లో నామినేషన్ల ‘బలవంతపు ఉపసంహరణ’లపై ధర్నాకు దిగాలని భావించిన  టీడీపీ అధ్యక్షుడు, విపక్షనేత చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. తిరుపతి విమానాశ్రయం నుంచి అడుగు బయట పెట్టకుండా నిలువరించారు. అట్నుంచి అటే విజయవాడ లేదా హైదరాబాద్‌కు వెళ్లిపోవాలని హుకుం జారీ చేశారు. అధికారుల తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విమానాశ్రయం లాంజ్‌లోనే సుమారు పది గంటలపాటు నేలపైనే కూర్చుని... ఆహారం కూడా తీసుకోకుండా  నిరసన తెలిపారు. చివరికి పోలీసు అధికారులు పదేపదే నచ్చజెప్పడంతో... రాత్రి 7 గంటలకు తిరుపతి నుంచి హైదరాబాద్‌కు బయలుదేరారు. ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇవి... చిత్తూరు, తిరుపతి మునిసిపల్‌ ఎన్నికల బరిలో నిలిచిన తమ అభ్యర్థులను బెదిరిస్తున్నారని...


బలవంతంగా నామినేషన్లను వెనక్కి తీసుకునేలా చేసేందుకు అధికారులనూ వాడుకుంటున్నారని చంద్రబాబు ఆగ్రహించారు. దీనిపై సోమవారం తిరుపతిలో గాంధీ విగ్రహంవద్ద, చిత్తూరు గాంధీ సెంటర్‌లో ధర్నాకు దిగాలని నిర్ణయించారు. సోమవారం ఉదయం 9.30కు తిరుపతి విమానాశ్రయం చేరుకున్నారు. వెంటనే పోలీసు అధికారులు ఆయనను చుట్టుముట్టారు. వీఐపీ లాంజ్‌కి తీసుకెళ్లారు. ‘‘ఎన్నికల నిబంధనలు, కొవిడ్‌ ఆంక్షల కారణంగా చిత్తూరు, తిరుపతిలో పర్యటించడానికి, ధర్నాలకు అనుమతి లేదు’’ అని ఆయనకు నోటీసు అందించారు. వెనుదిరిగి హైదరాబాద్‌ లేదా విజయవాడ వెళ్లాలని కోరారు. దీనిపై చంద్రబాబు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను చిత్తూరు, తిరుపతి పర్యటనకు అనుమతించాల్సిందేనని పట్టుపట్టారు. దీంతో పోలీసు అధికారులు ఆయన్ను అక్కడే నిర్బంధించారు. ఆయనతోపాటు పీఏ, వ్యక్తిగత వైద్యుడి మొబైల్‌ ఫోన్లను బలవంతంగా లాక్కునేందుకు యత్నించారు. అసలు ఏ అధికారంతో, ఎందుకు తనను అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రశ్నించారు. ‘‘తిరుపతికి  రోజూ 50 వేలమందికి పైగా భక్తులు వచ్చి వెళ్తున్నారు. వైసీపీ సమావేశాలు, కార్యక్రమాలన్నీ వేలమందితో జరుగుతున్నాయి. నా పర్యటనకు మాత్రమే నిబంధనలు ఎలా అడ్డొస్తున్నాయి?’’ అని నిలదీశారు.


కరోనా సమయంలో వేలాదిమందితో అధికార పార్టీ రోడ్‌షోలు, సమావేశాలు, పాదయాత్రలు చేసినప్పుడు వారిని ఎందుకు ఆపలేదని ప్రశ్నించారు. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన తనతో వ్యవహరించేది ఇలాగేనా అని ప్రశ్నించారు. తన పర్యటనకు ఆటంకం కలిగించిన తీరుపై కలెక్టర్‌తో పాటు తిరుపతి, చిత్తూరు ఎస్పీలకు  ఫిర్యాదు చేస్తానని... వారిని కలవడానికి అనుమతించాలని కోరారు. దానికి కూడా పోలీసులు అనుమతించలేదు. మీడియాను కలవడానికి కూడా అంగీకరించలేదు. అట్నుంచి అటే వెనక్కి వెళ్లిపోవాలని తేల్చి చెప్పారు. ఆగ్రహించిన చంద్రబాబు వీఐపీ లాంజ్‌లో సోఫా నుంచి లేచి నేలపైనే కూర్చుని నిరసనకు దిగారు. తనకు ఎస్పీ, కలెక్టర్లను కలవడానికి హక్కులేదా అంటూ పోలీసులపై మండిపడ్డారు. కలెక్టర్‌, ఎస్పీలను కలవడానికి అనుమతించేవరకూ ఒకట్రెండురోజులైనా కదలబోనని తేల్చిచెప్పారు. ఆహారం తీసుకునేందుకూ నిరాకరించారు.


ఒక్కొక్కరుగా అధికారులు...

మధ్యాహ్నం 1.15కు తిరుపతి అర్బన్‌ ఎస్పీ వెంకట అప్పలనాయుడు, ఆర్డీవో కనక నరసారెడ్డి విమానాశ్రయం చేరుకుని చంద్రబాబును కలిశారు. చిత్తూరు, తిరుపతిలో పర్యటిస్తే శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందని, ఎన్నికల నిబంధనల దృష్ట్యా వెనుదిరిగి వెళ్లాలని విజ్ఞప్తి చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ విమానంలో పంపేందుకు టికెట్లు తీశారు. కానీ చంద్రబాబు  పట్టు వీడలేదు. సాయంత్రం 4 గంటలకు మరో విమానానికి టికెట్‌ తీశారు. ఆ విమానమూ వచ్చి, వెళ్లిపోయింది. ఇక హైదరాబాద్‌కు రాత్రి 7.15 గంటల విమానం మాత్రమే ఉంది. విజయవాడకు మరేవీ లేవు. దీంతో... సాయంత్రం  6 గంటల సమయంలో చిత్తూరు ఎస్పీ సెంథిల్‌ కుమార్‌, జాయింట్‌ కలెక్టర్‌ వీరబ్రహ్మం రంగంలోకి దిగారు. లాంజ్‌లోనే నేలపైనే కట్టుకదలకుండా కూర్చుని ఉన్న చంద్రబాబుతో మాట్లాడారు.  గతంలో బాబు సీఎంగా ఉన్నప్పుడు ఆయన వద్ద సెంథిల్‌కుమార్‌ మూడేళ్లు చీఫ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పని చేశారు. ఆ సాన్నిహిత్యంతో ఆయన చంద్రబాబుతో గంటపాటు మాట్లాడి... హైదరాబాద్‌కు వెళ్లేలా ఒప్పించారు. ఎట్టకేలకు 7.15కు చివరి ఇండిగో విమానంలో చంద్రబాబు హైదరాబాద్‌కు బయలుదేరారు. దీంతో ఉదయం నుంచి కొనసాగుతున్న ఉత్కంఠ, ఉద్రిక్తతలకు తెరపడింది.

ఎయిర్‌ పోర్టులోకి  నల్లారి కిశోర్‌

చిత్తూరు జిల్లావ్యాప్తంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ గృహ నిర్బంధాల పేరుతో కదలకుండా కట్టడి చేసినా... టీడీపీ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్‌ కుమార్‌ రెడ్డి మాత్రం వ్యూహాత్మకంగా తిరుపతి విమానాశ్రయం  చేరుకున్నారు. ఆయన ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌ వెళ్లే విమానానికి టికెట్‌ తీసుకుని... 8 గంటలకే విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో ఆయన్ను పోలీసులు అడ్డుకోలేదు. 9.30కు చంద్రబాబు విమానంలో తిరుపతి వచ్చారు. ఆయనను కలుసుకోవడానికి కిశోర్‌ను పోలీసులు అనుమతించలేదు.  ఈలోగా 11 గంటలకు ఆయన ఎక్కవలసిన విమానం వెళ్లిపోయింది. అయితే, ఆయన అప్పటికే సాయంత్రం 3 గంటల విమానానికి మరో టికెట్‌ కొన్నారు. చంద్రబాబు దిగ్బంధం కొనసాగుతుండగానే ఆ విమానం కూడా వెళ్లిపోయింది. దీంతో కిశోర్‌ రాత్రి 7 గంటల విమానానికి మరో టికెట్టు సిద్ధం చేసుకోవడంతో పోలీసులు కిశోర్‌ను ఎయిర్‌పోర్టు నుంచి బయటకు తీసుకురాలేకపోయారు. చంద్రబాబును నేరుగా కలవనివ్వకపోయినా... ఎప్పటికప్పుడు ఫోన్‌లో సంభాషిస్తూ ఉన్నారు. తర్వాత 7.15కు చంద్రబాబు వెళ్లిన విమానంలోనే కిశోర్‌ కూడా హైదరాబాద్‌కు వెళ్లారు.

Advertisement
Advertisement
Advertisement