ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్‌

ABN , First Publish Date - 2020-08-14T11:15:23+05:30 IST

యరజర్ల, కొణిజేడు గ్రామాల పరిధిలోని కొండప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు స్టే విధించింది. ఆ మేరకు గురువా

ఇళ్ల పట్టాల పంపిణీకి బ్రేక్‌

స్టే విధించిన హైకోర్టు

కోర్టుకెక్కిన సర్వేరెడ్డిపాలెం వాసి 


(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

యరజర్ల, కొణిజేడు గ్రామాల పరిధిలోని కొండప్రాంతంలో పేదలకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనలపై హైకోర్టు స్టే విధించింది. ఆ మేరకు గురువారం ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి, మరో న్యాయమూర్తి కె.లలితకుమారిలతో కూడిన ధర్మాసనం స్టే ఉత్తర్వులు జారీచేసింది. ఒంగోలు రూరల్‌, టంగుటూరు మండలాల పరిధిలోని యరజర్ల, కొణిజేడు, కందులూరు గ్రామాల పరిధిలోని కొండ ప్రాంతంలో ఒంగోలు కార్పోరేషన్‌ పరిధిలోని 17వేల మంది పేదలకు ఇళ్లస్థల పట్టాలు ఇచ్చేందుకు ప్రభుత్వం భూములను సిద్ధం చేసింది. 1320ఎకరాల కొండప్రాంత భూమిలో 820 ఎకరాల్లో పట్టాలు ఇచ్చేందుకు ప్లాట్లు కూడా వేశారు. అయితే 1972 గెజిట్‌లోనే అదంతా మైనింగ్‌ భూమి కింద నమోదై ఉంది.


గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ భూమిలోనే ట్రిపుల్‌ ఐటీ నిర్మాణం, ఇళ్లపట్టాల పంపిణీకి ప్రయత్నాలు జరిగాయి. అప్పట్లోనే ఆ ప్రాంతంలో మైనింగ్‌ లీజు ఉన్న కంపెనీల అభ్యంతరంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదు. కాగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వంలో మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ విషయమై ఉన్నతస్థాయిలో మాట్లాడి ఆ భూమిలో పేదలకు పట్టాలు ఇచ్చేవిధంగా కొన్ని చర్యలు తీసుకున్నారు.


అందుకనుగుణంగా అప్పటికే మైనింగ్‌ లీజు పొందిన సంస్థ కోర్టులో వేసిన పిటిషన్‌ని ఉపసంహరించుకునే ఏర్పాటు చేశారు. అందుకుగాను ఆ సంస్థ యాజమాన్యానికి నష్టపరిహారం చెల్లిస్తామని ప్రభుత్వ పెద్దలు హామీ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఆ సంస్థ ప్రతినిధులు కోర్టులో కేసు ఉపసంహరించుకున్న తర్వాత ఆ భూమిలో పట్టాలు పంపిణీకి ప్రభుత్వం కదిలినప్పటికీ వారికి ఇస్తామన్న నష్టపరిహారం ఇవ్వలేదని తెలిసింది.


దీంతో ఆ సంస్థ ప్రతినిధులు మరోమారు కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఇదే సమయంలో సర్వేరెడ్డిపాలెం, కొణిజేడు తదితర గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు ఆ భూములను పేదలకు పట్టాలు ఇవ్వకూడదంటూ కోర్టులో దావా వేశారు. ముఖ్యంగా పశువుల మేతకు వినియోగించే బీడు భూములని ఆ భూములను నివాస స్థలాలుగా మారిస్తే పశువుల మేతకు ఇబ్బందవుతుందని పేర్కొన్నారు.


ఆ కేసు విచారణలో ఉంది. అటు మైనింగ్‌ లీజు పొందిన సంస్థ, ఇటు ప్రైవేటు వ్యక్తులు వేసిన కేసుల్లో కోర్టులో స్టే రాకపోవటంతో యంత్రాంగం పట్టాల పంపిణీ వైపు మరింత అడుగులు వేసింది. అందులోభాగంగా తాజాగా పిటిషన్‌ వేసిన మైనింగ్‌ సంస్థతో మరోసారి ప్రభుత్వ పెద్దలు మంతనాలు ప్రారంభించినట్లు తెలిసింది. గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం నష్టపరిహారం చెల్లిస్తామని కోర్టులో పిటిషన్‌ ఉపసంహరించుకోవాలని సూచించారు.


వారి మధ్య సానుకూల ఒప్పందం జరుగుతున్నట్లు కూడా ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో సర్వేరెడ్డిపాలెం గ్రామానికి చెందిన మక్కెన శ్రీనివాసరావు కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. 1972 గెజిట్‌లో మైనింగ్‌ భూమిగా కేంద్రప్రభుత్వం గుర్తించిన భూమిని మైనింగ్‌ కోసం కాకుండా నివాస స్థలాల కోసం ఎలా వినియోగిస్తారంటూ ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. దానిపై పిటిషనర్‌ తరపు న్యాయవాది వాదనలు విన్న ధర్మాసనం పట్టాల పంపిణీ జరగకుండా స్టే విధిస్తూ విచారణ కై కేసు వాయిదా వేసినట్లు తెలిసింది. దీంతో పట్టాల పంపిణీ సమస్య తిరిగి మొదటికి రాగా అధికార వైసీపీ, విపక్ష తెలుగుదేశం నేతల మధ్య రాజకీయ దుమారం కూడా ప్రారంభమైంది.


గతంలో మైనింగ్‌ లీజుకి ఇవ్వవద్దని కోరిన వారే ఇప్పుడు మైనింగ్‌ భూమిలో పట్టాలు ఎలా ఇస్తారంటూ పేదలకు పట్టాలు దక్కకుండా అడ్డుపడుతున్నారని వైసీపీ నాయకులు విమర్శలు ప్రారంభించారు. చట్టానికి విరుద్ధంగా స్వలాభాపేక్షతో అధికారపార్టీ నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకుని డ్రామాలు ఆడుతున్నారని టీడీపీ నాయకులు ప్రతి విమర్శ చేస్తున్నారు. 


Updated Date - 2020-08-14T11:15:23+05:30 IST