పంచాయతీ’కి బ్రేక్

ABN , First Publish Date - 2021-01-12T08:07:09+05:30 IST

పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

పంచాయతీ’కి బ్రేక్

  • ప్రొసీడింగ్స్‌ను సస్పెండ్‌ చేసిన హైకోర్టు
  • ఎస్‌ఈసీ నిర్ణయం వ్యాక్సినేషన్‌కు ఆటంకం
  • రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో విఫలం
  • హైకోర్టు, సుప్రీం ఆదేశాల ప్రకారం నిర్ణయం తీసుకోలేదు
  • ప్రజారోగ్యం దృష్ట్యా ఉత్తర్వులు రద్దు
  • న్యాయమూర్తి జస్టిస్‌ గంగారావు వెల్లడి
  • ప్రతివాదులకు నోటీసులు జారీ 
  • విచారణ ఫిబ్రవరి 15కి వాయిదా

అమరావతి, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఈనెల 8న రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇచ్చిన ప్రొసీడింగ్స్‌ను హైకోర్టు సస్పెండ్‌ చేసింది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. కొవిడ్‌ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భారీఎత్తున చేపట్టిన వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ఎన్నికల ప్రక్రియ ఆటంకం కలిగిస్తుందని అభిప్రాయపడింది. సంప్రదింపుల ప్రక్రియలో భాగంగా రాష్ట్రప్రభుత్వం అందజేసిన వివరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఎస్‌ఈసీ విఫలమైందని పేర్కొంది. ఈ విషయంలో సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఎస్‌ఈసీ నిర్ణయం తీసుకోలేదని అభిప్రాయపడింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను ఫిబ్రవరి 15కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు సోమవారం తీర్పు వెలువరించారు. పంచాయతీ ఎన్నికల ప్రొసీడింగ్స్‌ను రద్దు చేయాలని, ఎన్నికల విషయంలో ముందుకెళ్లకుండా ఎస్‌ఈసీని నిలువరించాలని కోరుతూ పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై జస్టిస్‌ గంగారావు సోమవారం విచారణ జరిపారు.


కంటితుడుపుగా సంప్రదింపులు: ఏజీ

రాష్ట్రప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరాం వాదనలు వినిపించారు. ‘కరోనా విషయంలో రాష్ట్రప్రభుత్వం అందజేసిన వివరాలను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోలేదు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ చేపట్టేందుకు కేంద్రం భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఎస్‌ఈసీ సంప్రదింపుల ప్రక్రియ చేపట్టలేదు. సంప్రదింపుల ప్రక్రియను కంటితుడుపుగా నిర్వహించారు. ముందుగానే నిర్ణయించిన మేరకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ చేశారు. ఎన్నికల నిర్వహణ కోసం 2018 నవంబరులో ఉమ్మడి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత ఎన్నికల నిర్వహణపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ధర్మాసనం ఆదేశాల మేరకు గత ఏడాది మార్చి 7న జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది. కరోనా వ్యాప్తిని కారణంగా చూపి రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఎస్‌ఈసీ ఎన్నికలను నిలిపివేసింది. ఈ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు..


ఈ వ్యవహారంపై ముందుకుసాగాలంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరపాలని ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు నిరుడు నవంబరు 17న ఎస్‌ఈసీ ప్రొసీడింగ్స్‌ ఇచ్చింది. వాటిని సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం హైకోర్టుకు వచ్చింది. సంప్రదింపుల ప్రక్రియ ద్వారా సమస్యకు సామరస్యపూర్వకంగా పరిష్కారం కనుగొనాలని గత డిసెంబరు 29న హైకోర్టు ఆదేశాలిచ్చింది. జనవరి 5న కోర్టు ఆదేశాలు అందాక ప్రభుత్వ అధికారుల బృందం ఎస్‌ఈసీతో సమావేశమైంది. కరోనా సెకండ్‌ వేవ్‌ ముప్పుందని తెలిపాం. వ్యాక్సినేషన్‌కు సంబంధించి కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను ఎస్‌ఈసీ దృష్టికి తీసుకెళ్లాం. వాటి ప్రకారం ఆరోగ్య సిబ్బంది, పోలీసులు, 50 ఏళ్ల పైబడినవారు, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు మొదట వ్యాక్సినేషన్‌ ఇవ్వాలి. ఈ ప్రక్రియలో మొత్తం 23 శాఖలు సేవలు అందించాల్సి ఉంటుంది. కేంద్రం సూచించిన ప్రకారం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ సాధారణ ఎన్నికల విధానాన్ని పోలి ఉంటుంది. ఈ నెల 16 నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. ప్రభుత్వం యంత్రాంగమంతా ఇందులో పాల్గొనాల్సి ఉంటుంది. అధికార పార్టీకి చెందిన నాయకుడు ఏప్రిల్‌, మే నెలలో ఎన్నికలు ఉంటాయని చెప్పిన విషయాన్ని ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకోవలసిన అవసరం లేదు. ఆ వ్యాఖ్యల ఆధారంగా ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా లేదని భావించడం సరికాదు. ఈ నెల 8న ప్రభుత్వ అధికారులతో సంప్రదింపుల ప్రక్రియ ముగిసిన కొన్ని గంటలలోనే ఎస్‌ఈసీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసింది. వాస్తవానికి ఆగిపోయిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియను ప్రారంభించాలి. కానీ ఎస్‌ఈసీ పంచాయతీ ఎన్నికలు షెడ్యూల్‌ విడుదల చేసింది. ప్రజల ఆరోగ్యం కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు వ్యాక్సిన్‌ ఇస్తే సామాన్య ప్రజల్లో విశ్వాసం కలిగి ఓటింగ్‌ శాతం పెరుగుతుంది. తెలంగాణ, కేరళ, బిహార్‌ తదితర రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగాక కరోనా కేసుల సంఖ్య పెరిగింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకుని ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేయండి’ అని కోరారు.


ఎద్దుల పోట్లాటలో లేగదూడ బలికాకూడదు. దూడను కాపాడాల్సిన అవసరం ఉంది. ఈ నేపఽథ్యంలోనే ఎస్‌ఈసీ ఉత్తర్వులను సస్పెండ్‌ చేస్తున్నాం. ఎన్నికల నోటిఫికేషన్‌ రాజ్యాంగంలోని 14, 21వ అధికరణలను ఉల్లంఘించడమే.

 - హైకోర్టు


సంప్రదింపుల ప్రక్రియను కంటితుడుపుగా నిర్వహించారు. ముందుగానే నిర్ణయించిన మేరకు ఎన్నికల షెడ్యూల్‌ జారీ 

చేశారు. 

- ఏజీ శ్రీరాం

కరోనా  కారణంతో ఎన్నికలు నిలిపివేయాలని రాజస్థాన్‌, కర్ణాటక, కేరళ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లను ఆ రాష్ట్రాల హైకోర్టులు తోసిపుచ్చాయి. ఎన్నికల ప్రక్రియలో జోక్యానికి నిరాకరించాయి. సుప్రీంకోర్టు కూడా వాటి తీర్పులను సమర్థించింది. 

- ఎస్‌ఈసీ న్యాయవాది

Updated Date - 2021-01-12T08:07:09+05:30 IST