Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jan 14 2022 @ 02:42AM

ప్రాజెక్టులకు బ్రేక్‌?

  • అనుమతుల్లేని వాటికి కష్టకాలం
  • గెజిట్‌ జారీతో ఆగిన రుణాలు.. 
  • నేటితో డీపీఆర్‌ గడువు ఆఖరు
  • ఇప్పటికే ఎన్జీటీ ఆదేశాలతో పాలమూరు, డిండి నిలిపివేత
  • ‘గోదావరి’లో డీపీఆర్‌లు దాఖలు చేసినా రాని అనుమతులు


హైదరాబాద్‌, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): అనుమతి లేని ప్రాజెక్టులకు కష్టకాలం మొదలైంది. కృష్ణా, గోదావరి బేసిన్‌లో అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాను గత జూలై 15న కేంద్ర ప్రభుత్వం గెజిట్‌ నోటిఫికేషన్‌లో వెల్లడించడంతో కేంద్ర సంస్థలైన రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌, పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ రుణాలను నిలిపివేశాయి. ఈనెల 14వ తేదీ లోపు అనుమతులు తెచ్చుకుంటామంటూ వివిధ బ్యాంకులకు స్పష్టం చేసిన గడువు కూడా రెండ్రోజుల్లో ముగియనుంది. ఈ లోగా ప్రాజెక్టులకు అనుమతులు వచ్చే అవకాశాలు లేవు.  తెలంగాణ, ఏపీలో కృష్ణా, గోదావరి ప్రాజెక్టులను బోర్డులకు అప్పగిస్తూ కేంద్రం గెజిట్‌ విడుదల చేసిన విషయం విదితమే. ఆ రోజు నుంచి ఆర్నెల్లలోపు అంటే... ఈనెల 14వ తేదీలోపు డీపీఆర్‌లను దాఖలు చేసి, అనుమతి లేని ప్రాజెక్టులకు పర్మిషన్లు తీసుకోవాలని డెడ్‌లైన్‌ విధించింది. ఇది శుక్రవారంతో ముగియనుంది! కృష్ణా బేసిన్‌లో ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలపై కేసులు దాఖలు కావడంతో ఈ ప్రాజెక్టుల పనులను ఇప్పటికే నిలుపుదల చేశారు. గోదావరిలో తెలంగాణ నుంచి అనుమతులు లేని జాబితాలో 11 ప్రాజెక్టులు ఉండగా అందులో 5 ప్రాజెక్టులను జాబితా నుంచి తొలగించాలని  కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ విజ్ఞప్తి చేయడమే కాకుండా స్వయంగా సీఎం కేసీఆర్‌ కూడా కేంద్ర జలశక్తి శాఖ మంత్రికి వినతిపత్రాన్ని అందించి వివరాలు సమర్పించారు. వీటి తొలగింపులో సాంకేతిక పరిశీలన బాధ్యతను గోదావరి బోర్డుకే కేంద్రం అప్పగించింది. 


ఇక మిగిలిన ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లు నిరుడు సెప్టెంబరులో కేంద్ర జలవనరుల సంఘం(సీడ బ్ల్యూసీ), గోదావరి నదీ యాజమాన్య బోర్డు(జీఆర్‌ఎంబీ)లో తెలంగాణ ప్రభుత్వం సమర్పించింది. దాంతో ఆయా డీపీఆర్‌లకు సీడబ్ల్యూసీలో క్లియరెన్స్‌ ఇచ్చే ప్రక్రియలో ఏపీ అభ్యంతరాలతో ప్రతిబంధకాలు ఎదురవుతున్నాయి. తెలంగాణలో పాలమూరు-రంగారెడ్డి, శ్రీశైలం ఎడమకాలువ(ఎ్‌సఎల్‌బీసీ), ఎస్‌ఎల్‌బీసీ అదనంగా 10 టీఎంసీల తరలింపు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల అదనంగా 10 టీఎంసీల తరలింపు, డిండి (నక్కలగండి) ఎత్తిపోతల పథకం, నెట్టెంపాడు ఎత్తిపోతల అదనంగా 3.4 టీఎంసీల తరలింపు, దబ్బావాగు, తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం, సీతారామమూడో పంప్‌హౌ్‌సలను కృష్ణా బేసిన్‌లో అనుమతుల్లేని ప్రాజెక్టుల జాబితాలో కేంద్రం చేర్చింది. ఇవన్నీ కూడా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులే. ఇక ఎలిమినేటి మాధవరెడ్డి ఎత్తిపోతల, భక్త రామదాసు ఎత్తిపోతలు, నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాలు ఇదివరకే నిర్మాణం పూర్తిచేసుకున్నందున వీటికి ఇబ్బందుల్లేవు. దాంతో కృష్ణాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు అటకెక్కినట్లే. 


నిధుల్లేక పాలమూరు-రంగారెడ్డి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కి నడిచాయి. దీని అంచనా వ్యయం కూడా ఏకంగా రూ.52056 కోట్లకు చేరింది. రూ.35200 కోట్లతో ఈ ప్రాజెక్టును ప్రతిపాదించగా రూ.16856కోట్లు పెరిగి రూ.52 వేల కోట్లు దాటింది. ఈ ప్రాజెక్టులో ఎలకో్ట్రకాంపోనెంట్‌ పనులకు రూ.6160 కోట్లను పీఎ్‌ఫసీ మంజూరు చేసింది. ఇందులో రూ.3365 కోట్లు విడుదల కావాల్సిన పరిస్థితుల్లో గెజిట్‌ రావడంతో నిధుల విడుద లను ఆపేసింది. 2022 జనవరి 14వ తేదీకల్లా అనుమతులు తీసుకుంటే... ఇతర నిధులు ఇస్తామని పీఎ్‌ఫసీ మెలిక పెట్టింది. ఈ ప్రాజెక్టును 2024 మే దాకా పూర్తిచేస్తామని తెలంగాణ రుణ సంస్థలకు హామీ కూడా ఇచ్చింది. తాగునీటి అవసరాల కోసం ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడుతున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఎన్జీటీలో కేసులు, నిధుల కొరత కారణంగా పనులు ముందుకు కదలడం లేదు. ఐదు దశల్లో చేపట్టనున్న ప్రాజెక్టులో తొలిదశ 49 శాతం, రెండో దశలో 70 శాతం, మూడో దశలో 67 శాతం, నాలుగో దశలో 52 శాతం పనులు మాత్రమే జరిగాయి. ఐదో దశ రంగారెడ్డిలోని లక్ష్మిదేవీపల్లి రిజర్వాయర్‌ నిర్మాణం ప్రభుత్వం ఇంకా ముట్టుకోలేదు. రెండో దశ పర్యావరణ అనుమతి కోసం ఫైలు సిద్ధమైనా దాఖలు చేయలేని పరిస్థితి. ఇక డీపీఆర్‌ సిద్ధమైనప్పటికీ నీటి కేటాయింపులు లేకపోవడంతో పాలమూరు-రంగారెడ్డి డీపీఆర్‌ దాఖలుపై డైలమా కొనసాగుతోంది. 


బోర్డులు నివేదిస్తేనే 

ప్రాజెక్టులకు అనుమతులు తీసుకునే గడువు ఈనెల 14వ తేదీతో ముగియనుండటంతో మళ్లీ కృష్ణా, గోదావ రి బోర్డులు సమావేశమై... ఇరు రాష్ట్రాలతో ఏకాభిప్రాయంతో తీర్మానం చేసి, కేంద్రానికి పంపిస్తేనే సవరణ గెజిట్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే గెజిట్‌లో పలు సవరణలు కోరుతూ కేంద్రానికి, బోర్డులకు తెలుగు రాష్ట్రాలు లేఖ రాశాయి. తెలంగాణ కల్వకుర్తి, శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంకు కెనాల్‌పై లేఖలు రాయగా, అందులో తెలంగాణ వాదనతో ఏకీభవిస్తూ వాస్తవాలను కేంద్రానికి నివేదించాలని ఇప్పటికే కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది.


ఇప్పటికే అల్టిమేటం

గోదావరిలో ఆరు డీపీఆర్‌లు దాఖలు చేయగా అందులో సీతారామ, సమ్మక్కసాగర్‌ అనుమతులపై ప్రతిబంధకాలు ఏర్పడుతుండగా మిగిలిన నాలుగు ప్రాజెక్టులకు క్లియరెన్స్‌ లభించే అవకాశాలున్నాయని సమాచారం. కీలకమైన సీతారామ, తుపాకులగూడెం(సమ్మక్కసాగర్‌)కు మార్చి తర్వాతే అనుమతులు వచ్చే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో కృష్ణా జలాలపై కడుతున్న, ప్రతిపాదించిన, నిర్మాణం పూర్తయినవన్నీ వరద జలాలకు సంబంధించినవే. వరద జలాలు ప్రామాణికం చేసుకొని కడితే కేంద్ర జలవనరుల సంఘం(సీడబ్ల్యూసీ) అనుమతులు దొరికే అవకాశాల్లేవు. ఖమ్మం జిల్లాలో 6.74 లక్షల ఎకరాలకు నీరందించడానికి వీలుగా నిర్మిస్తున్న సీతమ్మసాగర్‌ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.13384 కోట్లు. ఇందులో 60 శాతం దాకే పనులు జరిగాయి. దీనికి కూడా రూ.3426.25 కోట్ల రుణాన్ని పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎఫ్‌సీ) నుంచి తీసుకోవాలని నిర్ణయించారు. ఇందుకు గాను తెలంగాణ స్టేట్‌ వాటర్‌ రిసోర్సెస్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీఎస్‌డబ్ల్యూఐడీసీఎల్‌)తో పీఎ్‌ఫసీకి ఒప్పందం జరగాల్సి ఉంది. గెజిట్‌ అమల్లోకి రావడంతో  అనుమతులు ఉంటేనే రుణాలు ఇస్తామని పీఎ్‌ఫసీ షరతు విధించింది. 

Advertisement
Advertisement