టీబీజీకేఎస్‌ అధికారాలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-10-28T03:22:13+05:30 IST

సింగరేణిలో ఇంతకాలం గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) అధికారాలకు బ్రేక్‌ పడింది. ఈ మేరకు సెంట్రల్‌ రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ వీటీ థామస్‌ బుధవారం సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌కు లేఖ రాశారు.

టీబీజీకేఎస్‌ అధికారాలకు బ్రేక్‌
లోగో..

- సింగరేణిలో గుర్తింపు సంఘం రద్దుకు సిఫారసు
- సీఎండీకి సెంట్రల్‌ ఆర్‌ఎల్‌సీ లేఖ
- ఇకపై చర్చలకు అన్ని సంఘాలకు అర్హత

మంచిర్యాల, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): సింగరేణిలో ఇంతకాలం గుర్తింపు సంఘంగా ఉన్న టీబీజీకేఎస్‌ (తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం) అధికారాలకు బ్రేక్‌ పడింది. ఈ మేరకు సెంట్రల్‌ రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌ వీటీ థామస్‌ బుధవారం సింగరేణి చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎన్‌ శ్రీధర్‌కు లేఖ రాశారు. గుర్తింపు సంఘంగా టీబీజీకేఎస్‌ కాల పరిమితి ముగియడంతో ఇతర గుర్తింపు పొందిన సంఘాల విజ్ఞప్తి మేర కు లేబర్‌ కమిషనర్‌ దీనిపై నిర్ణయం తీసుకున్నారు. అధికార టీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న టీబీజీకేఎస్‌ 2017 అక్టోబర్‌ 5వ తేదీన జరిగిన ఎన్నికల్లో సింగరేణి గుర్తింపు సంఘంగా ఎన్నికైంది. రెండేళ్ల కాలపరిమి తితో బాధ్యతలు చేపట్టిన టీబీజీకేఎస్‌ కాలపరిమితి పూర్తయి మరో రెండేళ్లు అదనంగా గడిచింది. దీంతో కోల్‌బెల్ట్‌ ప్రాంతంలోని మంచిర్యాల, ఆసిఫాబాద్‌, పెద్దపెల్లి, ఖమ్మం, భూపాలపల్లి జిల్లాల్లో విస్తరించిన సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మిక సంఘాలైన ఏఐటీయూసీ, ఐఎన్టీయూ సీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ, బీఎంఎస్‌లు ఎన్నికల కోసం పట్టు బడు తున్నాయి. అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలను ఇంతకాలం వాయిదా వేస్తూ వస్తోంది.

పదవీ కాలం ముగిసినప్పటికీ..
టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా కాల పరిమితి ముగిసినప్పటికీ ఎన్నికలకు వెళ్లేందుకు జాప్యం చేస్తోంది. నాలుగేళ్ల కాలపరిమితి అంటూ కాలయాపన చేస్తోంది. వాస్తవానికి 2017 అక్టోబర్‌ 5వ తేదీన సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అనుబంధ సంఘం టీబీజీకేఎస్‌ గెలుపొందింది. 2019 అక్టోబర్‌ 5 నాటికే కాల పరిమితి పూర్తయింది. అయితే మొదట నాలుగేళ్ల కాలపరిమితికి ఎన్నికలు జరిపేందుకు అన్ని సంఘాలు మొగ్గు చూపాయి. కాగా కేంద్ర కార్మికశాఖ మాత్రం టీబీజీకేఎస్‌కు రెండేళ్లకే ఽద్రువీకరణ పత్రం అంద జేసింది. అయితే కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన అధికార పత్రంలో రెండేళ్లుగా పేర్కొనడంతో ఎన్నికలు పూర్తయిన ఆరు నెలల తర్వాత తాము ధ్రువీకరణ పత్రం అందుకున్నామని, 2020 ఏప్రిల్‌ వరకు కాలపరిమితి ఉందంటూ నాయకులు చెబుతూ వచ్చారు. ఈ లోగా కరోనా వైరస్‌ ప్రభావం చూపడంతో  ఎన్నికల నిర్వహణలో జాప్యం జరిగింది.  

ఆర్‌ఎల్‌సీకి ఫిర్యాదుతో..
టీబీజీకేఎస్‌ పదవీ కాలం ముగిసినప్పటికీ ఇంకా అధికారాలు చెలా యిస్తుండటంతో జాతీయ సంఘాలయిన ఏఐటీయూసీ, ఐఎన్టీ యూసీ, హెచ్‌ఎంఎస్‌, సీఐటీయూ ప్రధాన కార్యదర్శులు వాసిరెడ్డి సీతారామయ్య, జనక్‌ప్రసాద్‌, రియాజ్‌ అహ్మద్‌, నర్సింహారావు రీజనల్‌ లేబర్‌ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. 2019 లోనే టీబీజీకేఎస్‌ పదవీ కాలం పూర్తయిందని, అదనంగా మరో రెండేళ్లు గడిచినా గుర్తింపు ఎన్నికలకు వెళ్లడం లేదంటూ తెలిపారు.  కాలపరిమితి ముగిసినందున సింగరేణిలో ప్రస్తుతం గుర్తింపు సంఘం ఏదీ లేదని, ఇకపై కార్మికులకు సంబంధించి చర్చలు, సమాలోచనలు, సంప్రదింపుల సందర్భంగా ప్రాతినిథ్యం వహించే బాధ్యత అన్ని గుర్తింపు పొందిన సంఘాలకు కల్పించాలని కోరారు. ఆయా సందర్భాల్లో మిగతా అన్ని రిజిష్టర్డ్‌ సంఘాలను అనుమ తించాలని సీఎండీ శ్రీధర్‌కు ఆర్‌ఎల్‌సీ  లేఖ రాయడంతో టీబీజీకేఎస్‌కు ప్రత్యేక గుర్తింపు హోదా లేకుండా పోయింది.

ఇక గుర్తింపు ఎన్నికలు అనివార్యం..
కేంద్ర కార్మికశాఖ సిఫారసు మేరకు టీబీజీకేఎస్‌కు ఇంతకాలం ఉన్న గుర్తింపు సంఘం హోదా రద్దు కానుండటంతో తిరిగి ఎన్నికల నిర్వహణ అనివార్యం కానుంది. మిగతా సంఘాల మాదిరిగానే టీబీజీకేఎస్‌ కూడా ఇక ఎన్నికల బాట పట్టక తప్పని పరిస్థితులు నెలకొంటాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహిస్తే టీబీజీకేఎస్‌కు నష్టం కలుగనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. టీబీజీకేఎస్‌ గుర్తింపు సంఘంగా గెలుపొందిన నాటి నుంచి నాయకుల్లో వర్గ పోరు మొదలైం దని కార్మికులు చెబుతున్నారు. వర్గపోరుతో అనేకసార్లు రోడ్డున పడడం తప్ప, కార్మికులకు చేసిందేమీ లేదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతు న్నాయి. ఇటీవల గోదావరిఖనిలో జరిగిన ఓ సమావేశంలో టీబీజీకేఎస్‌ రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రావ్‌ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయిన విషయం కూడా చర్చనీయాంశం అవుతోంది. సింగరేణిలో ఉద్యోగాలు మొదలుకొని, అత్యంత కీలకమైన  మెడికల్‌ అన్‌ఫిట్‌, మెడికల్‌ బోర్డులో, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకాల్లో కొందరు టీబీజీకేఎస్‌ నాయకుల జోక్యం పెరిగిందని మిగతా సంఘాల నాయకులు ఆరోపి స్తున్నారు. కార్మికుల సమస్యల పట్ల వివక్ష, అధికారులను గుప్పిట్లో పెట్టుకున్నారన్న ఆరోపణలు మూట గట్టుకున్న నేపథ్యంలో ఎన్నికలకు వెళితే టీబీజీకేఎస్‌కు నష్టం తప్ప లాభం ఉండదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2021-10-28T03:22:13+05:30 IST