సంక్షోభంలో ఇటుకల పరిశ్రమ

ABN , First Publish Date - 2020-05-25T09:30:15+05:30 IST

కరోనా దెబ్బకు ఇటుక పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఇటుక పరిశ్రమలో వేసవి కాలంలో పనులు జోరుగా సాగుతాయి.

సంక్షోభంలో ఇటుకల పరిశ్రమ

తరలిపోయిన ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ వలస కూలీలు

గగ్గోలు పెడుతున్న యజమానులు

రూ.లక్షలు అడ్వాన్సులు ఇచ్చి నష్టపోయామని ఆవేదన


ఇల్లెందు, మే 24: కరోనా దెబ్బకు ఇటుక పరిశ్రమ సంక్షోభంలో పడింది. ఇటుక పరిశ్రమలో వేసవి కాలంలో పనులు జోరుగా సాగుతాయి. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల వ్యాప్తంగా కోట్లాది రూపాయల అమ్మకాలు జరుగుతాయి. వందలాది మంది వలస కూలీలకు ఉపాధి లభిస్తుంది. ప్రతి ఏటా ఒడిశా, ఛత్తీ్‌సఘడ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ర్టాల నుండి వేలాది మంది వలస కూలీలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు తరలి వచ్చి ఇటుకలు తయారు చేస్తూ ఉపాధి పొందేవారు. అయితే ఐదు నెలలుగా కుటుంబాలతో సహా తరలి వచ్చి అటవీ ప్రాం తాల్లో, ఇటుకబట్టీల తయారీ ప్రాంతాలలో చాలీచాలని పూరీగుడిసెల్లో నివసిస్తూ ఇటుకలు తయారీ చేస్తూ వేలాది మంది వలస కూలీలు ఉపాధి పొందారు. ప్రధానంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు ఒడిశా కలహండి, నగరంపూర్‌ జిల్లాలకు చెందిన వారితోపాటు కాత్‌మీరా, అంగజార్‌, ధర్మగర్‌, ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రంలోని నవరంగపూర్‌, జగదల్‌పూర్‌, రాయిపూర్‌, గరియాబాద్‌ జిల్లాల నుంచి ప్రతి ఏటా వేలాది మంది వలస కూలీలు తరలి వచ్చి ఇటుకలు తయారీ చేస్తుంటారు.


కరోనా మహమ్మారి మూలంగా పనులు నిలిచిపోవడంతో కూలీలను అధికారులు స్వగ్రామాలకు తరలించడంతో ఇటుకబట్టీల యజమానులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి ఏటా వలస కూలీల స్వగ్రామాలకు ఇటుకబట్టిల యజమానులు కూలీలను కాంట్రాక్టు పద్ధతిలో ఒప్పందాలు చేసుకుని వారితో ఇటుకలు తయారు చేయిస్తూ వ్యాపారాలు సాగిస్తుంటారు. ఈ క్రమంలో వలస కూలీలకు లక్షలాది రూపాయలు ముందస్తుగా వారి స్వగ్రామాల్లోని చెల్లించి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. ఇదేక్రమంలో నవంబర్‌, డిసెంబర్‌ మాసాల్లోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఇటుక బట్టీల యజమానులు పెద్ద మొత్తాల్లో వలస కూలీలకు అడ్వాన్స్‌లు చెల్లించి కూలీలను తీసుకొచ్చి పనులు చేయిస్తున్న తరుణంలో అనూహ్యంగా కరోనా విజృంభించడం.. దాని వ్యాప్తిని అడ్డుకునేందుకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించడంతో ఇటుకబట్టీల యజమానులు నష్టపోయారు. అధికార యంత్రాంగాలు కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునే చర్యల్లో భాగంగా వివిధ రాష్ర్టాలకు చెందిన వలస కూలీలను స్వగ్రామాలకు తరలిపోవాలని అదేశించడం, స్వయంగా పర్యవేక్షిస్తూ కూలీలను పంపించడంతో ఇటుకల తయారీలు నిలిచిపోయాయి. అటు ఇటుకలు తయారు కాకపోవడం, ఇటు కూలీలకు చెల్లించిన అడ్వాన్స్‌ సొమ్ములు తిరిగి వచ్చే అవకాశాలు కోల్పోయామని యజమానులు గగ్గోలు పెడుతున్నారు.


వలస కూలీలు స్వగ్రామాలకు తరలిపోవడంతో ఇటు క బట్టీల ప్రాంతాలు బోసిపోయాయి. వర్షాలు, ఈదురు గాలులతో కొంత మేర తయారైన ఇటుకలు సైతం వినియోగానికి పనికి రాకుండా పోయింది. నిజానికి ఇటుకబట్టీల ప్రాంతాల్లో నివసిస్తున్న వలస కూలీలు తమ స్వగ్రామాలకు వెళ్ళి పనులు చేసేందుకు, ఉపాధి పొందేందుకు ఎలాంటి అవకాశాలు లేవని అధికారులకు మొరపెట్టుకు న్నప్పటికి కరోనాను కట్టడి చేయాలన్న పట్టుదలతోవున్న అధికారులు వలస కూలీలందరిని వివిధ రాష్ర్టాల్లోని స్వగ్రామాలకు తరలించడంతో ఉభయ జిల్లాల్లో ఇటుకల పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోయింది.


రూ.లక్షలు నష్టపోయాం: మహ్మద్‌ సలీం, ఇటుక బట్టీల యజమాని

వలస కూలీలకు దాదాపు రూ.ఐదు లక్షలు ఆడ్వాన్స్‌లు చెల్లించి తీసుకవచ్చాం. ఇటుక బట్టీలు ఇ ప్పుడిప్పుడే పుంజుకుంటున్న తరుణంలో కరోనా మూలంగా తీవ్రంగా నష్టపోయాం. ఛత్తీ్‌సగఢ్‌ నుంచి వచ్చిన వలస కూలీలంతా స్వగ్రామాలకు వెళ్లిపోయారు. ఇటుకల తయారీ నిలిపోయింది. రూ.లక్షల నష్టం వాటిల్లింది. ప్రతి ఏటా వేసవి కాలంలోనే ఇటుకల తయారీ ఊపందుకుంటుంది. రెండు నెలలుగా పనులు సక్రమంగా జరగకపోవడంతో తీవ్రంగా నష్టపోయాం.


వలస కూలీలు వెళ్ళిపోవడంతో గడ్డుపరిస్థితి.. పెద్దబోయిన ఉమాశంకర్‌, ఇటుకబట్టీల యజమాని

ప్రతి ఏటా ఇటుకల తయారీకి వలస కూలీలే ప్రధాన ఆధారం. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా రాష్ర్టాలకు వెళ్లి కూలీలకు అడ్వాన్స్‌లు చెల్లించి కూలీలను తీసుకవచ్చి ఇటుకలు తయారు చేయిస్తాం. కరోనా కట్టడితో అఽధికారుల ఆదేశాల మూలంగా వలస కూలీలు స్వగ్రామాలకు వెళ్లడం మూలంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఒక వైపు అడ్వాన్స్‌లు చెల్లించడం, మరో వైపు ఇటుకలు తయారు చేసే పనులు నిలిచిపోవడంతో రెంటికి చెడ్డ రేవడిలా మారింది.

Updated Date - 2020-05-25T09:30:15+05:30 IST