కారు బానెట్‌పై కూర్చుని మరీ ఎంట్రీ ఇచ్చిన వధువు.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ABN , First Publish Date - 2021-07-14T21:11:45+05:30 IST

ఓ వధువు కూడా ఊహించని రీతిలో పెళ్లి వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. చివరకు అదే ఆమెను చిక్కుల్లోకి నెట్టింది.

కారు బానెట్‌పై కూర్చుని మరీ ఎంట్రీ ఇచ్చిన వధువు.. చివరకు ఊహించని ట్విస్ట్..!

ఈ మధ్య పెళ్లిళ్లలో జరుగుతున్న వింత విచిత్ర సంఘటనలు తెగ వైరల్ అవుతున్నాయి. మటన్ లేదని పెళ్లిని రద్దు చేసుకున్న వరుడి నుంచి రెండో ఎక్కం చెప్పలేనందుకు పెళ్లికి నో చెప్పిన వధువు సంఘటన వరకు అన్నీ ఇటీవల నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లంటే జీవితంలో ఒకేసారి జరిగే మధుర ఘట్టం కదా. అందుకే ఆ పెళ్లిని అంగరంగ వైభంగా చేసుకోవాలని యూత్ అంతా కలలు కంటుంటారు. ఎలాంటి దండలు వాడాలి.. స్టేజ్‌ను ఎలా అలంకరించాలి..? ఏఏ యాంగిల్స్‌లో ఫొటోలు ఉండాలి.. వంటివి అన్నీ వధూవరులే డిసైడ్ చేస్తున్నారు. తమకు నచ్చిన సాంగ్స్‌తో డాన్స్ చేస్తూనే పెళ్లి వేదిక మీదకు ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా ఓ వధువు కూడా ఊహించని రీతిలో పెళ్లి వేదిక వద్దకు ఎంట్రీ ఇచ్చింది. దానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. చివరకు అదే ఆమెను చిక్కుల్లోకి నెట్టింది. మహారాష్ట్రలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 


మహారాష్ట్రలోని సస్వాద్ పట్టణంలో జూలై 13వ తారీఖున పెళ్లి జరిగింది. ఈ పెళ్లి వేదిక వద్దకు వధువు వినూత్న రీతిలో ఎంట్రీ ఇచ్చింది. పూణె-సస్వాద్ హైవే రోడ్డుకు ఆనుకుని ఉన్న ఫంక్షన్ హాల్ వద్దకు ఆమె ఓ కారు ద్వారా వచ్చింది. అదేంటీ కారులో వస్తే సమస్య ఏంటనే కదా మీ డౌటు.. ఆమె వచ్చింది కారు లోపల కూర్చుని కాదు.. కారు ముందు భాగంలో బానెట్‌పై కూర్చుని వచ్చింది. కారును మంచిగా అలంకరించి ఆమెను కారు ముందు భాగంలో కూర్చో బెట్టి.. కార్లో మరికొందరు కూర్చుకున్నారు. కాస్త తక్కువ వేగంతోనే ఆ కారు హైవేపే దూసుకెళ్లింది. ఆ కారు కంటే వీడియో గ్రాఫర్లు ఉండి.. ఆమెను వీడియో తీయండం, ఫొటోలు తీయడం చేశారు. అలా ఆమె తనకు నచ్చిన రీతిలో పెళ్లి వేదిక వద్దకు చేరుకుంది. 


అయితే ఆమె చేసిన ఈ అరుదైన సాహసానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అయింది. అది కాస్తా పూణె పోలీసుల దృష్టికి చేరింది. దీంతో పోలీసులు ఆ వీడియోను చూసి అవాక్కయ్యారు. మోటార్ వెహికిల్ యాక్ట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, మహారాష్ట్ర కొవిడ్ రెగ్యులేషన్ యాక్ట్ ప్రకారం అలా ప్రయాణించడం నేరం. కాబట్టి ఆ వధువుపైనే కాకుండా ఆ కారును నడిపిన డ్రైవర్‌పై, ఆ కారులో ఉన్న బంధువులపై, వీడియో గ్రాఫర్‌పై కూడా కేసును నమోదు చేశారు. 

Updated Date - 2021-07-14T21:11:45+05:30 IST