పెళ్లి బడ్జెట్ పెంచుతారా? లేచిపొమ్మంటారా?.. తల్లిదండ్రులకు యువతి బెదిరింపులు!

ABN , First Publish Date - 2021-06-16T14:51:11+05:30 IST

ఆ యువతి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెళ్లి ఖర్చు కూడా తమదే అన్నారు. మొత్తం పెళ్లికి 20 వేల డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.14.65 లక్షలపైన ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ఒక్కగానొక్క కూతురి వివాహానికి ఇంత తక్కువ బడ్జెట్టా అంటూ అగ్గిమీదగుగ్గిలం అయింది.

పెళ్లి బడ్జెట్ పెంచుతారా? లేచిపొమ్మంటారా?.. తల్లిదండ్రులకు యువతి బెదిరింపులు!

ఆ యువతి ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు. పెళ్లి ఖర్చు కూడా తమదే అన్నారు. మొత్తం పెళ్లికి 20 వేల డాలర్లు అంటే మన లెక్కల్లో రూ.14.65 లక్షలపైన ఖర్చు పెట్టడానికి సిద్ధపడ్డారు. కానీ ఆ అమ్మాయికి కోపం వచ్చింది. ఒక్కగానొక్క కూతురి వివాహానికి ఇంత తక్కువ బడ్జెట్టా అంటూ అగ్గిమీదగుగ్గిలం అయింది. పెళ్లి బడ్జెట్ పెంచుతారా? లేక ప్రేమించిన వాడితో లేచిపొమ్మంటారా? అంటూ వారిని బెదిరిస్తోంది. ఇదంతా అమెరికాలో వెలుగు చూసిన వింత ఉదంతం. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాకు చెందని ఒక యువతి తను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకోబోతోంది. దాని కోసం బడ్జెట్ లెక్కలు వేసుకుంటోంది. మొత్తం తన పెళ్లిని 25 వేల డాలర్లు (రూ. 18 లక్షలపైన) బడ్జెట్‌లో పూర్తి చేయాలని ఆమె ప్లాన్.


కుమార్తె పెళ్లి ఖర్చు మొత్తం తల్లిదండ్రులే పెట్టుకుంటామని చెప్పారట. అందుకే ఈ లెక్కల్లో ఆమె తండ్రి తల దూర్చాడు. ‘‘ఏం ఫర్వాలేదు. నీ పెళ్లికి 40 వేల డాలర్లు(సుమారు రూ.30 లక్షలు) బడ్జెట్ ఇస్తాను. టెన్షన్ పడకుండా బాగా ప్లాన్ చేసుకో’’ అని చెప్పాడు. పెళ్లిరోజును ఎంజాయ్ చేయాలని, బడ్జెట్ గురించి బెంగ వద్దని అన్నారు. దీంతో సంతోషంతో ఎగిరి గంతులేసిన కుమార్తె.. పెళ్లిరోజు కోసం సన్నాహాలు మొదలుపెట్టింది. అన్నీ అద్భుతంగా చేయాలని ప్లాన్లు వేసుకోవడం ప్రారంభించింది. ఆ ఇంట్లో ఆమె ఒక్కతే కూతురు కావడంతో తల్లిదండ్రులు ఇలా చేస్తున్నారని అనుకుంది. కానీ ఆమె తల్లి వచ్చి.. పెళ్లి బడ్జెట్‌ను తగ్గించుకుంటే అద్భుతమై బహుమతి ఇస్తానని చెప్పింది. అయితే తమకు బహుమతి కన్నా పెళ్లి అందంగా జరగడమే కావాలని కాబోయే వధూవరులు కరాఖండీగా చెప్పేశారు.




అప్పుడు ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయిన తల్లి సడెన్‌గా.. సగానికి తగ్గించేస్తున్నానంటూ బాంబు పేల్చింది. ఇచ్చిన మాట వెనక్కు తీసుకున్న తల్లిదండ్రులిద్దరూ కలిసి 20 వేల డాలర్లు (రూ.14.65 లక్షలు) బడ్జెట్‌లో పెళ్లి పూర్తి చేసుకోవాలని చెప్పారు. అలాగే కుమార్తె పెళ్లి డ్రెస్‌ కోసం 3 వేల డాలర్లు ఖర్చు పెట్టింది కూడా దీనిలోనే లెక్క వేశారట వాళ్లు. దీంతో ఇక మిగిలింది 17 వేల డాలర్లే. దీంతో ఆ యువతికి చిర్రెత్తుకొచ్చింది. తనకు ఇస్తానన్న బడ్జెట్ ఇవ్వకపోతే ప్రేమించిన వాడితో లేచిపోతానని చెప్పేసిందట. దీనికి ఆమె తల్లి అడ్డుపడుతోందని ఈ కాబోయే పెళ్లి కూతురు సోషల్ మీడియాలో తన గోడు వెళ్లబోసుకుంది. ఇలా పెళ్లి బడ్జెట్ కోసం గొడవపడటం తనకు ఇష్టం లేదని, ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకుంటే చాలని చెప్పిన ఆమె.. మొదటి నుంచి పెళ్లి బడ్జెట్ 20 వేల డాలర్లే అంటే తాను అసలు ప్రశ్నించేదాన్నే కాదని వివరించింది. వాళ్లే వచ్చి బడ్జెట్‌ను రెండింతలు చేసి, మళ్లీ వాళ్లే సడెన్‌గా సగానికి తగ్గించేయడం ఏమీ బాగోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘‘జూనియర్ కాలేజీలో చదువుకుంటున్న మా తమ్ముడికి కారు కొనిచ్చారు. బేస్‌బాల్ మ్యాచ్ టికెట్లు ఒక్కొక్కటి 200 డాలర్లు పెట్టి కొంటారు. వారంలో నాలుగైదుసార్లు 100 డాలర్లపైగా ఖర్చుపెట్టి డిన్నర్లు చేస్తారు. ఒక్కగానొక్క కూతురి పెళ్లికి ఇస్తానన్న బడ్జెట్ కూడా ఇవ్వకుండా చివరి నిమిషంలో ఇలా చేస్తారా?’’ అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసింది. 



Updated Date - 2021-06-16T14:51:11+05:30 IST