తెలుగు, తమిళ సాహిత్యాలకు అనువాద వారధి

ABN , First Publish Date - 2021-06-07T05:49:57+05:30 IST

గౌరీ కృపానందన్‌ పేరు సాహిత్య లోకంలో చిరపరి చితం. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ఆమె అనువాద రచనలు చేస్తున్నారు. తెలుగు నుంచి తమిళంలోకి, తమిళం నుంచి తెలుగులోకి ఆమె చేసిన ఎన్నో అనువాదాలు రెండు.....

తెలుగు, తమిళ సాహిత్యాలకు అనువాద వారధి

గౌరీ కృపానందన్‌ పేరు సాహిత్య లోకంలో చిరపరి చితం. దాదాపు రెండున్నర దశాబ్దాలకు పైగా ఆమె అనువాద రచనలు చేస్తున్నారు. తెలుగు నుంచి తమిళంలోకి, తమిళం నుంచి తెలుగులోకి ఆమె చేసిన ఎన్నో అనువాదాలు రెండు భాషల సాహిత్యానికి మంచి వారధిగా నిలిచాయి. అనువాదం ఆమెకు వృత్తి కాదు. ప్రవృత్తి మాత్రమే. మనసుకి నచ్చితేనే అనువాదం చేస్తారు. ఆ విషయంలో ఆమె నిక్కచ్చి మనిషి. 


తమిళంలోకి మొదటి అనువాద కథను 1995లో చేశారు. యండమూరి నవల ‘అంతర్ముఖం’ అనువాదం 1996లో వెలువడింది. అప్పటి నుంచి ఇప్పటి దాకా యద్ధనపూడి, యండమూరి, ఓల్గా, డి. కామేశ్వరి, కొండపల్లి కోటేశ్వరమ్మ, సాయి బ్రహ్మానందం గొర్తి లాంటి రచయితల రచనలను ఎనభై దాకా తమిళంలోకి అనువాదం చేశారు. తెలుగు నుంచి ఎనభైకి పైగా నవలలు, ఎన్నో కథల్ని తమిళ సాహిత్యాభి మానులకు పరిచయం చేశారు. పెరుమాళ్‌ మురుగన్‌, శివశంకరి, జయకాంతన్‌, ఐరావతం, అశోక మిత్రన్‌, ఇందిరా పార్థసారధి, సుందర రామస్వామి, ప్రపంచన్‌ లాంటి ఎందరో రచయితల కథలను తెలుగు నుడికారంతో చదువు కోగలిగామంటే అందుకు గౌరీ కృపానందన్‌కి కృతజ్ఞత చెప్పుకోవాల్సిందే. 


ఓల్గా ‘విముక్త’ కథలకు చేసిన తమిళ అనువాదానికి గాను గౌరీ కృపానందన్‌కు సాహిత్య అకాడమీ అవార్డ్‌ లభించింది. సాహిత్య అకాడమీ వారి ప్రాజెక్ట్‌గా, కు. అళగిరి స్వామి ‘బహుమతి’, ప్రపంచన్‌ ‘ఆకాశం నా వశం’, సుందర రామసామి ‘ఒక చింతచెట్టు కథ’ త్వరలో ఆమె అనువాదంలో పుస్తకాలుగా వెలువడనున్నాయి. 


ఇటీవల కాలంలో పెరుమాళ్‌ మురుగన్‌ రాసిన ‘పూనాచ్చి’ నవలకి గౌరీ కృపానందన్‌ గారి తెలుగు అనువాదం తప్పక చదవాల్సిన రచన. కథలు మనిషిని సానబెడతాయని, అలాగే ఒక సమస్య వస్తే బెదిరిపోకుండా, పారిపోకుండా, ధైర్యంగా ఎదురునిలిచి పోరాడే శక్తిని సాహిత్యం అందిస్తుం దని ఆమె గాఢంగా నమ్ముతారు. రచయితకైనా, పాఠకుల కైనా ఉండాల్సింది ఆ నమ్మకమే కదా!


మీరు అనువాదానికి తమిళం నుంచి తెలుగుకి, లేదా తెలుగు నుంచి తమిళం లోకి రచనలను ఎలా ఎంపిక చేసుకుంటారు? మీకు నచ్చినవి చేస్తారా? లేక పబ్లిషర్స్‌ అడిగినవి చేస్తారా? 

తమిళం నుంచి తెలుగులో అనువదించినా, తెలుగు నుంచి తమిళంలోకి అనువాదించినా నాకు నచ్చిన కథలను, నవలలను నేనే ఎంపిక చేసుకుంటాను. మనసుకు నచ్చని కథలను అనువాదం చేయలేను. ‘నిర్జనవారధి’ పుస్తకాన్ని Kalachuvadu Publishers అడిగిన మేరకు తమిళంలో అనువాదం చేశాను. పెరుమాళ్‌ మురుగన్‌ నవల ‘పూనాచ్చి -ఒక మేకపిల్ల కథ’ Westland Publishers వారి ప్రాజెక్ట్‌గా అనువాదం చేశాను. పబ్లిషర్స్‌ కోరిక మేరకు అనువాదం చేసినా, ఆ నవలతో నేను ప్రయాణం చేయగలిగితేనే ఆ అనువాదం పరిపుష్టతను సంతరించుకుంటుంది.


మీకు బాగా ఇష్టమైన మీ అనువాదం ఏమిటి? 

నేను తెలుగు నుంచి తమిళంలో అనువాదం చేసినవి సంఖ్యాపరంగా ఎక్కువ. దాదాపు 80 నవలలు వెలువడి ఉన్నాయి. పాతికేళ్ళ క్రితం యండమూరి వీరేంద్రనాథ్‌ గారి ‘అంతర్ముఖం’ నవలను అదే పేరుతో తమిళంలో అనువాదం చేశాను. తమిళంలో నేను అనువాదం చేసిన తొలి నవల ఇది. నాకు చాలా ఇష్టమైన నవల కూడా ఇదే. కారణం, నవలలో మానవ సంబంధాలు పలు కోణాలలో కళ్ళ ముందు సాక్షాత్కరిస్తాయి.


అలాగే తెలుగులో నేను అనువాదం చేసిన తొలి నవల పెరుమాళ్‌ మురుగన్‌ ‘పూనాచ్చి - ఒక మేకపిల్ల కఽథ’. ఇది కూడా మానవ సంబంధాల గురించిన విశ్లేషణలతో నిండి నదే. పెరుమాళ్‌ మురుగన్‌ గారి మాండలికాన్ని, శిల్పాన్ని తెలుగులో అనువదించేటప్పుడు ఆస్వాదించగలిగాను.


పెరుమాళ్‌ మురుగన్‌ రచనల్లో మీకు అనువాదానికి లొంగని భాషకానీ భావంకానీ ఎప్పుడైనా ఎదురైందా? 

పెరుమాళ్‌ మురుగన్‌ గారి ‘పూనాచ్చి’ అనువాదం కోసం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. వారి మాండలీకం ఆస్వా దించడం ఒక ఎత్తు అయితే, అనువాదం చేయడం మరో ఎత్తు. ఈ నవలలో నాకు సందేహం ఉన్న పదప్రయోగాల గురించి పెరుమాళ్‌ మురుగన్‌ గారిని మెయిల్‌లో సంప్ర దించేదాన్ని. వెంటనే విశదీకరిస్తూ జవాబు వచ్చేది. ఏ పదమైనా అర్థం తెలియనంత వరకు ఇబ్బంది పెడుతుంది. తెలిసిన తరువాత మనకు లొంగిపోతుంది. ఈ పరిణామ క్రమంలో భాష గురించిన అవగాహన ఇనుమడిస్తూ ఉంటుంది.


తెలుగు సాహిత్యానికి, తమిళ సాహిత్యానికి మీరు గమనిస్తున్న మార్పులు ఏమిటి?

తమిళ నవలా సాహిత్యంగానీ, కథా సాహిత్యంగానీ వేరే స్థాయిలో ముందంజ వేస్తూ ఉంది. భూమిని ఒక పాత్రగా మలిచి, ఆ మట్టి వాసనతో కూడిన రచనలు వస్తున్నాయి."Kaaval Kottam' సాహిత్య అకాడమి అవార్డ్‌ పొందిన నవల. వెయ్యి పేజీలకు పైగా ఉంటుంది. మధురై నగరం గురించి, అప్పటి సమాజపు తీరు తెన్నుల గురించి, జరిగిన యుద్ధాల గురించి, ఆచార వ్యవహారాల గురించి సవిస్తా రంగా చర్చించబడిన నవల. చదువరిని తనతో తీసుకు వెళ్లిపోతుంది. తమిళ రచయిత ప్రపంచన్‌ రాసిన "Vaanam Vasappadum'  నవల ఫ్రెంచ్‌ వారి ఆధీనంలో ఉన్న పాండిచ్చేరి గురించి వివరిస్తుంది. అప్పటి ఆహారపు అలవాట్లు, కులాల మధ్య అంతరాలు అన్నింటినీ కళ్ళ ముందు కదలాడిస్తుంది. ఈ నవలను సాహిత్య అకాడమి వారి ప్రాజెక్ట్‌గా తెలుగులో అనువాదం చేసే అవకాశం నాకు లభించింది. ‘ఆకాశం నా వశం’ అన్న పేరుతో త్వరలో వెలువడుతుంది. తెలుగు సాహిత్యంలో నవలల కన్నా కవితలకి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నట్లు అనిపిస్తోంది.


మీకిష్టమైన తమిళ రచయితలు ఎవరు?

అశోకమిత్రన్‌, ఇందిరా పార్థసారది, జయకాంతన్‌, సుజాత, వాసంతి, అనూరాధా రమణన్‌


అనువాద సాహిత్యానికి తమిళంలో ఎలాంటి పరిసి ్థతులు ఉన్నాయి? తెలుగు రచనలు తమిళంలోకి అనువాదమైనప్పుడు ఎలాంటి టాక్‌ నడుస్తోంది?

అనువాద సాహిత్యానికి తమిళ పాఠకుల మధ్య మంచి స్పందన ఉంది. బెంగాలీ, మరాఠీ, హిందీ, తెలుగు భాషల నంచి నేరుగా తమిళంలో అనువాదాలు వస్తున్నాయి. అయితే కాలక్రమంలో అవి నిలబడి ఉంటాయా లేదా అన్నది ఆయా అనువాదకుల స్థాయి మీద, మూల రచన చిక్కదనం మీద ఆధారపడి ఉంటుంది. ఓల్గాగారి ‘విముక్త’ తమిళ అనువాదానికి సాహిత్య అకాడమి అనువాదం అవార్డ్‌ లభించిన సంగతి అందరికీ తెలిసే ఉంటుంది తమిళ స్త్రీవాద రచయిత్రుల మధ్య ఓల్గా గారి స్వరం విభిన్నంగా ఉంటుంది. 


కల్పనా రెంటాల

kalpana.rentala@gmail.com

Updated Date - 2021-06-07T05:49:57+05:30 IST