కూరగాయల సాగు బాగు

ABN , First Publish Date - 2021-06-23T04:46:43+05:30 IST

గ్రామాల్లో రైతులు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేపట్టారు.

కూరగాయల సాగు బాగు
సాగు చేస్తున్న గోరు చిక్కుడు

మండలంలోని నాలుగు గ్రామాల్లో 25 ఎకరాల్లో సాగు

నగరంలోని పూర్ణామార్కెట్‌, రైతుబజార్లకు తరలించి విక్రయం

ఆదాయం బాగుందంటున్న రైతులు

పెందుర్తి, జూన్‌ 22: వ్యవసాయమే జీవనాఽధారమైన మండలంలోని జెర్రిపోతులపాలెం, నందవరపువానిపాలెం, చింతగట్ల, ఇప్పిలివానిపాలెంలో గల రైతులు తమ వ్యవసాయ భూముల్లో ప్రధాన పంటగా వరిని సాగు చేసేవారు. వర్షం కురిస్తేనే సాగు సజావుగా సాగేది. దీంతో ఇక్కడి రైతులు వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటలపై దృష్టి సారించారు. ఇంత వరకు అంతర్‌  పంటలుగా ప్రాధాన్యమిచ్చిన కూరగాయాల పెంపకం ఇప్పుడు తమ ప్రధాన వ్యాపకంగా మార్చుకున్నారు. దీంతో ఈ గ్రామాల్లో రైతులు సుమారు 25 ఎకరాల విస్తీర్ణంలో కూరగాయలు సాగు చేపట్టారు. వంగ, బెండ, గోరుచిక్కుడు, బరబాటీ, టమాటా, బీర, కాకరకాయలతో పాటుగా పలు రకాల ఆకుకూరలు పండిస్తున్నారు. పంట పొలాలను చిన్న చిన్న కమతాలుగా ఏర్పాటు చేసి కూరగాయలు పెంచుతున్నారు. నీటి సౌకర్యం కలిగేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. నీరు, ఇక్కడి  కొండ ప్రాంత వాతావరణం చక్కగా కుదరడంతో కూరగాయల సాగు సిరులు కురిపిస్తోంది. ఇక్కడ పండించిన కూరగాయలను నగరంలో గల పూర్ణా మార్కెట్‌, రైతుబజార్‌లకు తరలించి విక్రయాలు జరుపుతున్నారు. వేకువ జామునే రైతులు ఆటోల్లో  కూరగాయల బస్తాలను వేసుకుని నగరంలో హోల్‌సేల్‌గా విక్రయాలు చేపడతారు. ఎకరాకు రూ.5 వేలు నుంచి రూ.10 వేలు పెట్టుబడి అవుతుందని ఇక్కడి రైతులు తెలుపుతున్నారు. పెంపకం ఆరంభం నుంచి మూడు నెలల్లోనే  కూరగాయల పంట చేతికొస్తుంది. పెట్టుబడి, ఇతర ఖర్చులు తీసివేయగా ఆదాయం బాగానే ఉంటుందంటున్నారు. అయితే కొవిడ్‌  కారణంగా రవాణాకు ఇబ్బందులు తలెత్తాయని రైతులు అంటున్నారు. దీని వల్ల పండించిన పంట తక్కువ ధరకే విక్రయించామని తెలిపారు. కార్గో బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆటోలో సరకు తీసుకువెళుతుండడంతో ఖర్చులు పెరుగుతున్నాయని తెలిపారు. సరైన రవాణా సదుపాయం ఉంటే మరింత మంది రైతులు కూరగాయల సాగుపై దృష్టి పెడతారని చెబుతున్నారు.

Updated Date - 2021-06-23T04:46:43+05:30 IST