Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఒమైక్రాన్ గుబులు.. అమెరికా బాటలోనే బ్రిటన్.. ఇకపై బ్రిటన్‌కు వెళ్లేవారు తప్పనిసరిగా..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమైక్రాన్‌ ప్రభావం ఎలా ఉండబోతోందో తెలీక ప్రపంచ దేశాలన్నీ అలజడికి లోనవుతున్నాయి. వైరస్ కట్టడి కోసం ముందస్తు చర్యలకు దిగుతున్నాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం తమ దేశానికి రావాలనుకున్న వారు తప్పనిసరిగా కరోనా టెస్టులో నెగెటివ్ వచ్చినట్టు చూపించాలని ఆదేశాలు జారీ చేసింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం కూడా అగ్రరాజ్యం పంథానే ఎంచుకుంది. వివిధ దేశాల నుంచి బ్రిటన్‌కు వచ్చేవారందరికీ కరోనా నెగెటివ్ రిపోర్టులు తప్పనిసరి చేసింది. బ్రిటన్ వెళ్లేవారు తమ ప్రయాణానికి ఒకటి లేదా రెండు రోజుల లోపలే కరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్ రిపోర్టు చూపించాల్సి ఉంటుంది. అంతకుమునుపు చేయించుకున్న రిపోర్టులను అధికారులు అనుమతించరు. 

ఇక ఆఫ్రికా దేశం నైజీరియా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా బ్రిటన్‌లో క్వారంటైన్‌కు పరిమితమవ్వాలి. ఈ మేరకు ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్ జావిద్ కీలక ప్రకటన చేశారు. మరోవైపు.. ఒమైక్రాన్ వ్యాప్తి కట్టడికి ఆంక్షలు అవసరమని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ వ్యాఖ్యానించారు. తాజాగా లెక్కల ప్రకారం.. బ్రిటన్‌లో ఇప్పటివరకూ 160 ఒమైక్రాన్ కేసులు బయటపడ్డాయి. మరోవైపు..  ఈ వేరియంట్‌కున్న వ్యాప్తి సామర్థ్యం ఎంతో తెలుసుకునేందుకు... దీనిపై టీకా ప్రభావశీలతను అంచనా వేసేందుకు శాస్త్రవేత్తలు విస్తృత అధ్యయనం చేస్తున్నారు. కాగా.. బ్రిటన్ తాజా నిర్ణయంపై పర్యటక రంగంలోని వ్యాపారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తే బ్రిటన్‌కు వచ్చే పర్యాటకులపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement