మిత్రుడు మోదీతో చర్చించబోయేది దాని గురించే : బ్రిటన్ ప్రధాని జాన్సన్

ABN , First Publish Date - 2021-03-18T01:06:32+05:30 IST

సుస్థిర భవిష్యత్తు కోసం భారత్-బ్రిటన్ మధ్య ఉమ్మడి దార్శనికత

మిత్రుడు మోదీతో చర్చించబోయేది దాని గురించే : బ్రిటన్ ప్రధాని జాన్సన్

న్యూఢిల్లీ : సుస్థిర భవిష్యత్తు కోసం భారత్-బ్రిటన్ మధ్య ఉమ్మడి దార్శనికత ఉందని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ చెప్పారు. ఏప్రిల్‌లో భారత్ పర్యటన సందర్భంగా తాను తన మిత్రుడు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈ ఉమ్మడి దార్శనికతపైనే ప్రధానంగా చర్చిస్తానని తెలిపారు. 


ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ డిజాస్టర్ రెజిలియెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ (ఐసీడీఆర్ఐ) వర్చువల్ సమావేశంలో జాన్సన్ బుధవారం మాట్లాడుతూ, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు. వాతావరణ మార్పులపై అంతర్జాతీయ పోరాటంలో భాగంగా పునరుద్ధరణీయ ఇంధనం వంటి రంగాల్లో మోదీ అద్భుతమైన నాయకత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. 


‘‘ఈ గొప్ప కార్యక్రమం కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తున్న నా మిత్రుడు ప్రధాన మంత్రి మోదీని ప్రశంసిస్తున్నాను. దీనికి సహాధ్యక్ష బాధ్యతలను నిర్వహించడం బ్రిటన్‌కు గర్వకారణం. 28 దేశాలు, సంస్థలతో ఈ కార్యక్రమం ప్రారంభమవడం సంతోషకరం’’ అని బోరిస్ జాన్సన్ పేర్కొన్నారు. భారత్, బ్రిటన్ సహా అంతర్జాతీయ సమాజపు సుస్థిర భవిష్యత్తు కోసం తమకు ఉమ్మడి దార్శనికత ఉందన్నారు. తాను త్వరలో భారత దేశంలో పర్యటించబోతున్నానని, ఈ విషయాలను ప్రధాని మోదీతో చర్చిస్తానని చెప్పారు.


బుధవారం నుంచి శుక్రవారం వరకు జరిగే ఈ సమావేశానికి భారత దేశం ఆతిథ్యమిస్తోంది. దీనిని ప్రధాని మోదీ ప్రారంభించారు. వాతావరణ మార్పులు, విపత్తు భయాల నిరోధం కోసం, సుస్థిర అభివృద్ధికి మద్దతుగా నూతన, ప్రస్తుత మౌలిక సదుపాయాల వ్యవస్థల సామర్థ్యం పెంపు కోసం భాగస్వామ్య దేశాలు, సంస్థలను ఏకతాటిపైకి తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యం. 


Updated Date - 2021-03-18T01:06:32+05:30 IST