మహాత్మా గాంధీ స్మారక నాణెం విడుదలకు బ్రిటన్ యోచన

ABN , First Publish Date - 2020-08-02T23:48:56+05:30 IST

మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెం విడుదల చేసేందుకు బ్రిటన్ యోచిస్తోంది.

మహాత్మా గాంధీ స్మారక నాణెం విడుదలకు బ్రిటన్ యోచన

లండన్ : మహాత్మా గాంధీ జ్ఞాపకార్థం ఓ నాణెం విడుదల చేసేందుకు బ్రిటన్ యోచిస్తోంది. నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు వివిధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపుగా నాణేలను విడుదల చేయాలని ప్రయత్నిస్తోంది. బ్రిటన్ ట్రెజరీ ఈ వివరాలను తెలిపింది. 


నల్ల జాతీయులు, ఆసియన్లు, ఇతర మైనారిటీలు వివిధ రంగాల్లో చేసిన కృషికి గుర్తింపునిచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని బ్రిటిష్ ఆర్థిక మంత్రి రుషి శునక్ ఓ లేఖలో రాయల్ మింట్ అడ్వయిజరీ కమిటీ (ఆర్ఎంఏసీ)ని కోరారు. 


ట్రెజరీ విడుదల చేసిన ప్రకటనలో ఆర్ఎంఏసీ ప్రస్తుతం మహాత్మా గాంధీని స్మరించుకునేందుకు ఓ నాణెం విడుదల చేయడంపై పరిశీలిస్తోందని పేర్కొంది. 


మోహన్ దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబరు 2న జన్మించారు. ఆయన జీవితాంతం అహింసను ప్రబోధించారు. భారత దేశ స్వాతంత్ర్య పోరాటంలో ముఖ్య పాత్ర పోషించారు. ఏటా అక్టోబరు 2న అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా జరుపుకుంటారు. 


మహాత్మా గాంధీ 1948 జనవరి 30న మరణించారు. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన కొద్ది నెలలకే ఆయన కాలం చేశారు.


Updated Date - 2020-08-02T23:48:56+05:30 IST