British Airways: భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు రెట్టింపు

ABN , First Publish Date - 2021-08-18T20:27:42+05:30 IST

భారత్ నుంచి బ్రిటన్‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులను పెంచింది. ఇంతకుముందు వారానికి కేవలం 10 సర్వీసులు మాత్రమే నడిచేవి. ఇప్పుడు వీటిని రెట్టింపు చేసింది.

British Airways: భారత్, బ్రిటన్ మధ్య విమాన సర్వీసులు రెట్టింపు

న్యూఢిల్లీ: భారత్ నుంచి బ్రిటన్‌కు బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమాన సర్వీసులను పెంచింది. ఇంతకుముందు వారానికి కేవలం 10 సర్వీసులు మాత్రమే నడిచేవి. ఇప్పుడు వీటిని రెట్టింపు చేసింది. ఆగస్టు 16 నుంచి భారత్, యూకే మధ్య వారానికి 20 విమాన సర్వీసులు నడుపుతున్నట్లు బ్రిటిష్ ఎయిర్‌వేస్ ప్రకటించింది. ఆగస్టు 8న భారత్‌ను రెడ్‌లిస్ట్ నుంచి అంబర్ జాబితాలోకి చేర్చుతూ యూకే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బ్రిటిష్ ఎయిర్‌వేస్ భారత్‌కు విమాన సర్వీసులు పెంచుతున్నట్లు వెల్లడించింది. "బ్రిటిష్ ఎయిర్‌వేస్  ఇప్పుడు భారత్‌లోని ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల నుంచి వీక్లీ 20 డైరెక్ట్ రిటర్న్ విమానాలు నడుపుతోంది. దీని ద్వారా లండన్, హీత్రో ప్రయాణించేవారికి చాలా సులువుగా విమానాలు అందుబాటులో ఉంటాయి" అని బ్రిటిష్ ఎయిర్‌వేస్ తన ప్రకటనలో పేర్కొంది. 


అలాగే భారత ప్రభుత్వం కూడా తమకు వారానికి 15 నుంచి 34 వరకు విమాన సర్వీసులు నడిపించుకునేందుకు అనుమతి ఇచ్చిందని తెలిపింది. "మహమ్మారి కారణంగా చాలా రోజులుగా ఇరుదేశాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడడంతో చాలా మంది తమవాళ్లకు దూరమయ్యారు. తాజాగా బ్రిటన్, భారత్ మధ్య విమాన సర్వీసుల సంఖ్యను పెంచడంతో స్వదేశంలో చిక్కుకుపోయిన భారతీయులకు ఇది చాలా హెల్ప్ అవుతుంది. అటు విద్యా సంవత్సరం కూడా ప్రారంభం కాబోతోంది. కనుక భారతీయ విద్యార్థులకు కలిసి వస్తుంది" అని బ్రిటిష్ ఎయిర్‌వేస్ దక్షిణ ఆసియా హెడ్ ఆఫ్ సేల్స్ మోరన్ బిర్గర్ చెప్పారు.     

Updated Date - 2021-08-18T20:27:42+05:30 IST