మరో దేశంలోని ఖైదీతో ప్రేమ.. అతడిని కలిసేందుకు 7 వేల కిలోమీటర్ల ప్రయాణం.. నెటిజన్లను మురిపిస్తున్న లవ్ జర్నీ

ABN , First Publish Date - 2021-12-15T02:50:56+05:30 IST

ఎప్పుడు, ఎవరితో ప్రేమలో పడతామనేది మన చేతుల్లో ఉండదని చాలా మంది చెబుతుంటారు. ఇందులోని నిజానిజాలు పక్కనపెడితే.. ఓ బ్రిటన్ మహిళ ప్రేమ కథ మాత్రం సరిగ్గా ఇలాంటిదే.

మరో దేశంలోని ఖైదీతో ప్రేమ.. అతడిని కలిసేందుకు 7 వేల కిలోమీటర్ల ప్రయాణం.. నెటిజన్లను మురిపిస్తున్న లవ్ జర్నీ

ఇంటర్నెట్ డెస్క్: ఎప్పుడు, ఎవరితో ప్రేమలో పడతామో చెప్పడం అసాధ్యమని చాలా మంది చెబుతుంటారు. ఇందులోని నిజానిజాలు పక్కనపెడితే.. ఓ బ్రిటన్ మహిళ ప్రేమ కథ మాత్రం సరిగ్గా ఇలాంటిదే. అమెరికాలో ఉన్న ఖైదీతో ఆమె ప్రేమలోపడింది. అంతేకాదు..  అతడిని కలుసుకునేందుకు ఏకంగా 7 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఇలాంటి సుదీర్ఘ ప్రేమయాత్ర చేసిన వనిత పేరు కేటీ..


కేటీ ప్రియుడు డానీ ప్రస్తుతం అమెరికాలోని ఓ జైల్లో ఉన్నాడు. అక్రమ ఆయుధాలు కలిగి ఉన్న నేరంపై అతడికి ఎనిమిదేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పటికే ఐదేళ్లు పూర్తయ్యాయి. కాగా..  ఖైదీలకు ఉత్తరాలు రాయాలంటూ ప్రజలను ప్రోత్సహించే ఓ వెబ్‌సైట్ ద్వారా కేటీ డానీలకు పరిచయం ఏర్పడింది. తొలుత వారి పరిచయం ఉత్తరాలకే పరిమితమయ్యింది. ఆ తరువాత.. వీడియో కాల్స్ కూడా చేసుకోవడం మొదలెట్టారు. ఈ క్రమంలో డానీపై కేటీ మనసు పారేసుకుంది. పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయింది.


డానీని ఎట్టాగైన కలుసుకోవాలని ఓ నిర్ణయానికి వచ్చిన కేటీ ఇటీవలే దాదాపు 7 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి డానీని కలుసుకుంది. జైల్లో వారు దాదాపు 4 గంటల పాటు మనసు విప్పి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో ఆమె డానీనే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. తన జర్నీ వివరాలన్నీ కేటీ టిక్‌టాక్‌లో షేర్ చేసింది. ఇక నెటిజన్లు కూడా ఈ ప్రేమపక్షుల స్టోరీ విని మురిసిపోతున్నారు. వారికి ఆల్ ది బెస్ట్ అని చెబుతున్నారు. డానీ జైలు నుంచి ఎప్పుడు విడుదల అవుతాడా అనుకుంటూ కేటీ  ప్రస్తుతం అతడి కోసం ఎదురుచూస్తోంది. 

Updated Date - 2021-12-15T02:50:56+05:30 IST