గొడ్డలితో అన్నపై తమ్ముడి దాడి

ABN , First Publish Date - 2022-01-17T06:01:13+05:30 IST

ఆస్తి తగాదాల నేపథ్యంలో అన్నపై గొడ్డలితో తమ్ముడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో చోటుచేసుకుంది.

గొడ్డలితో అన్నపై తమ్ముడి దాడి
తీవ్ర గాయాలపాలైన బాబు

ఆపేందుకు ప్రయత్నించిన అన్న కుమార్తెకూ గాయాలు 

భూతగాదాల నేపథ్యంలో పంచాయితీ

హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలింపు

నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో ఘటన 


దేవరకొండ, జనవరి 16: ఆస్తి  తగాదాల నేపథ్యంలో అన్నపై గొడ్డలితో తమ్ముడు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన ఆదివారం ఉదయం నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం కొండభీమనపల్లిలో చోటుచేసుకుంది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొండభీమనపల్లికి చెందిన ఎర్ర చిన్నరామయ్య లక్ష్మమ్మ దంపతులకు ఎర్రబాబు, మల్లేష్‌, రమేష్‌, వెంకటయ్య నలుగురు కుమారులు. అందరికీ వివాహాలయ్యాయి. కాగా పెద్దకుమారుడైన ఎర్రబాబు, రెండో కుమారుడు మల్లేష్‌ మధ్య కొంత కాలంగా భూపంచాయితీతో పాటు కుటుంబకలహాలు ఉన్నాయి. సంక్రాంతి పండగ శనివారం సాయంత్రం బాబు భార్య సుజాత, మల్లేష్‌ భార్య సునీత గొడవపడ్డారు. దీంతో తన భార్యపై గొడవపడిందని ఆగ్రహం పెంచుకున్న మల్లేష్‌ ఆదివారం ఉదయం పక్కనే ఉన్న బాబు ఇంట్లోకి గొడ్డలి తీసుకొని వెళ్లి అతడిపై దాడి చేశాడు. దీంతో బాబుకు తీవ్రగాయాలయ్యాయి. అడ్డుకోబోయిన బాబు పెద్దకుమార్తె నవనీతకు కూడా గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన బాబు, ఆయన కుమార్తె నవనీతలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు తీవ్రంగా గాయపడిన బాబును హైదరాబాద్‌ ఆసుపత్రికి తరలించారు. కూతురు నవనీత దేవరకొండ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితుడు బాబు భార్య సుజాత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు దేవరకొండ సీఐ బీసన్న తెలిపారు.

Updated Date - 2022-01-17T06:01:13+05:30 IST