Advertisement
Advertisement
Abn logo
Advertisement

పాటకు గౌరవం తెచ్చారు

  • నచ్చేలా పాటలు రాయడంలో సిరివెన్నెల సిద్ధస్తులు: ఉపరాష్ట్రపతి వెంకయ్య
  • నన్నెంతో బాధించింది: ప్రధాని మోదీ
  • తెలుగుపాటకు ఊపిరి: జస్టిస్‌ ఎన్వీ రమణ 
  • ఓ గొప్ప రచయితను కోల్పోయాం: తమిళిసై
  • పండిత, పామరుల మనసు గెలిచారు: కేసీఆర్‌ 
  • తెలుగు సినీ చరిత్రలో విలువల శిఖరం: జగన్‌


న్యూఢిల్లీ, హైదరాబాద్‌, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామ శాస్త్రి మరణం పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తెలుగు మాటలను పాటలుగా కూర్చి తెలుగు పాటకు అందాన్నేగాక, గౌరవాన్ని కూడా తీసుకొచ్చారని వెంకయ్య కొనియాడారు. తెలుగు పాటకు విలువలను అద్ది, పది మంది మెచ్చే విధంగా రాయడంలో సిరివెన్నెల సిద్ధహస్తులని ప్రస్తుతించారు. సిరివెన్నెల అస్వస్థతకు గురైనట్లు తెలిసినప్పటి నుంచి తాను కిమ్స్‌ వైద్యులతో ఎప్పటికప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఆయన ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నానని తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యం కుదుటపడుతుందని, త్వరలోనే కోలుకుంటారని భావించానని, ఇంతలోనే ఇలాంటి దుర్వార్త వినాల్సి రావడం విచారకరమని తన సందేశంలో పేర్కొన్నారు. సీతారామశాస్త్రి మరణం తననెంతో బాధించిందని ప్రఽధాని నరేంద్ర మోదీ అన్నారు. ఆయన రచనల్లో కవితా పటిమ, బహుముఖ ప్రజ్ఞ గోచరిస్తుందని.. తెలుగు భాషా ప్రాచుర్యానికి ఎంతగానో కృషిచేశారని తెలుగులో ట్వీట్‌ చేశారు. సినీ నేపథ్యగీతాల్లో సాహిత్యం పాళ్లు తగ్గుతున్న తరుణంలో సిరివెన్నెల ప్రవేశం పాటకు ఊపిరిలూదిందని సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ పేర్కొన్నారు. అజరామరమైన పాటలతో తెలుగు సినీ సాహిత్యాన్ని సిరివెన్నెల సుసంపన్నం చేశారని కొనియాడారు. సిరివెన్నెల ఇకలేరు అని తెలిసి తానెంతో విచారించానని చెప్పారు. సీతారామశాస్త్రి మరణంతో తెలుగు చిత్ర పరిశ్రమ ఒక గొప్ప రచయితను కోల్పోయిందని  గవర్నర్‌ తమిళిసై  పేర్కొన్నారు. ఆయన రాసిన పాటలు అజరామరం అని కొనియాడారు. సిరివెన్నెల మరణం పట్ల సీఎం కేసీఆర్‌ సంతాపాన్ని వ్యక్తం చేశారు.  


ఎలాంటి సంగీత ప్రక్రియలతోనైనా పెనవేసుకుపోయే అద్భుత సాహిత్యాన్ని సిరివెన్నెల సృష్టించారని పేర్కొన్నారు. తన పాటలతో పండిత, పామరుల హృదయాలను గెలిచారని తెలిపారు. సిరివెన్నెల ఎన్నో భావగర్భితమైన పాటలు రాసి, సినీ వినీలాకాశంలో ఒక వెలుగు వెలిగారని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తన పాటల ద్వారా సిరివెన్నెల సమాజంలో చైతన్యాన్ని నింపి, కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారని  మరో మంత్రి కేటీఆర్‌ అన్నారు. సిరివెన్నెల చిరకాలం గుర్తుండిపోయే పాటలు రాశారని, గేయ రచయితగా ప్రజల హృదయాలను దోచుకున్నారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఎన్నో మధురగీతాలు, స్ఫూర్తి నింపే పాటలు రాసిన సిరివెన్నెల అభిమానుల హృదయాల్లో నిలిచివుంటారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. పాటల రూపంలో సిరివెన్నెల, మన హృదయాల్లో ఎప్పుడూ ఉంటారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పేర్కొన్నారు. సిరివెన్నెల కలం నుంచి అణిముత్యాల వంటి గీతాలు జాలువారాయని ఏపీ గవర్నర్‌ విశ్వ భూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు.  తెలుగు సినీ గేయ ప్రపంచంలో సిరివెన్నెల విలువల శిఖరం అని ఏపీ సీఎం జగన్‌ పేర్కొన్నారు. సిరివెన్నెల మరణం తనను దిగ్ర్భాంతి కలిగించిందని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. తన పాటలతో ఆయన తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని చెప్పారు. బలమైన భావాన్ని, మానవత్వాన్ని, ఆశావాదాన్ని చిన్న చిన్న మాటల్లో పొదిగి.. జన సామాన్యం గుండెల్లో నిక్షిప్తం చేసిన గీత రచయిత సిరివెన్నెల అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. సిరివెన్నెల మృతిపట్ల పలువురు తెలంగాణ మంత్రులు, ఏపీ టీడీపీ నేతలు, మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌రావు, నారా భువనేశ్వరి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement