ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు..? ఏ తప్పు చేస్తే పందికొక్కుగా జన్మ.. మహాభారతంలో ఏముందంటే..

ABN , First Publish Date - 2021-12-08T21:51:27+05:30 IST

ఎలాంటి పాపాలు చేస్తే.. ఎలాంటి జన్మలు ప్రాప్తిస్తాయి, ఏ తప్పు చేస్తే వచ్చే జన్మలో ఏ జంతువుగా పుడతారు.. తదితర విషయాల్లో చాలా మందికి సందేహం ఉంటుంది. ఇలాంటి సందేహమే మహాభారతంలో ధర్మరాజుకూ వచ్చింది...

ఎలాంటి పాపాలు చేస్తే ఎలాంటి జన్మలు..? ఏ తప్పు చేస్తే పందికొక్కుగా జన్మ.. మహాభారతంలో ఏముందంటే..

హిందూ పురాణాల్లో కర్మ సిద్ధాంతానికి ప్రత్యేక స్థానం ఉంది. మనిషి చేసే కర్మలను బట్టే ప్రతిఫలం ఉంటుందనేది దాని సారాంశం. చేసిన కర్మల ఆధారంగా.. మానవుడు మంచి చేస్తే మంచి, చెడు చేస్తే.. చెడు ప్రతిఫలాన్ని పొందుతారనే విషయాన్ని పురాణాల ద్వారా తెలుసుకోవచ్చు. హిందు పురాణాల ప్రకారం.. మంచి చేయాలో లేక చెడు చేయాలో మానవుడే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. అయితే ఎలాంటి పాపాలు చేస్తే.. ఎలాంటి జన్మలు ప్రాప్తిస్తాయి, ఏ తప్పు చేస్తే వచ్చే జన్మలో ఏ జంతువుగా పుడతారు.. తదితర అంశాలపై చాలా మందికి సందేహం ఉంటుంది. ఇలాంటి సందేహమే మహాభారతంలో ధర్మరాజుకూ వచ్చింది...

యుద్ధంలో విజయం పాండవులదే అని నాకు తెలుసు.. అయినా దుర్యోధనుడితోనే ఉంటా.. భీష్ముడితో కర్ణుడి మాటలివి..


మహాభారత కురుక్షేత్ర యుద్ధం అనంతరం.. ధర్మ సందేహాలను నివృత్తి చేసుకునేందుకు, అంపశయ్యపై ఉన్న భీష్ముడి వద్దకు పాండవులను శ్రీకృష్ణుడు పిలుచుకుని వెళ్తాడు. ఈ సందర్భంగా తనకున్న వివిధ సందేహాలను ధర్మరాజు భీష్ముడి వద్ద ప్రస్తావిస్తాడు. ఆ సమయంలో ధర్మారాజు ఇలా అడుగుతాడు.. 


‘‘పితామహా! ఎలాంటి నడవడిక వల్ల ఉత్తమపదం లభిస్తుంది? శరీరాన్ని విసర్జించిన తర్వాత మానవునికి తోడ్పడేదేది? దయచేసి ఆ వివరాలు తెలియజేయండి.’’ అని అడిగాడు ధర్మరాజు. సన్నగా నవ్వి, ఇలా అన్నాడు భీష్ముడు. ‘‘దీనికి సరైన సమాధానాన్ని ఆ దేవగురువు ఒక్కడే ఈయగలడు. ఆ మహాబుద్ధిశాలి ఇప్పుడు ఇక్కడకి రానున్నాడు. నీ సంశయాన్ని అతనే తొలగిస్తాడు. వేచి ఉండు.’’ అన్నాడు భీష్ముడు. అంతలో అక్కడ బృహస్పతి ప్రత్యక్షమయ్యాడు. ధర్మరాజు తమ్ములతో పాటు నమస్కరించాడతనికి. శ్రీకృష్ణుడు గౌరవసూచకంగా కొద్దిగా తలొంచాడతని ముందు. సుఖాసీనుడయినాడు బృహస్పతి. అప్పుడు ధర్మరాజు అడిగిన సందేహాలకు సమాధానంగా బృహస్పతి ఇలా బదులిస్తాడు..

మహాభారతం.. సరళ వ్యావహారికంలో చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.


‘‘తల్లిదండ్రుల పట్లా, గురువు పట్లా చేసిన తప్పొప్పులే సుఖదుఃఖాలు. ధాన్యం దొంగిలించిన మనిషి ఎలుకగా, పందికొక్కుగా జన్మిస్తాడు. అయినా చేసిన పాపం నశించలేదనుకో, అప్పుడు కుక్కలా పుడుతాడు. అలాగే పరస్త్రీని ఆశించడం వల్ల తోడేలు, రాబందు, గద్దగా జన్మిస్తాడు. శవాల్ని పీక్కుతింటాడు. తర్వాత పురుగులా పుడతాడు. అన్నను కావాలనే తప్పుబట్టి, నిందించిన తమ్ముడు కొంగై పుడతాడు. కృతఘ్నతకు పాల్పడిన వ్యక్తిని యమకింకరులు అత్యంత దారుణంగా వేధిస్తారు. అన్నం, పాలు, పెరుగు, నేయి, అప్పాలను దొంగిలిస్తే దోమలు, ఈగలుగా పుడతారు. పండు, ఇనుము, వెండి, బంగారాలను దొంగిలిస్తే కోతి, కాకి, గువ్వ, పేడపురుగల్లా జన్మిస్తారు.


‘‘వస్త్రాలు దొంగిలిస్తే కుందేలుగా పుడతారు. నమ్మి డబ్బు అప్పజెబితే, తనదంటూ ఎదురు తిరిగిన వ్యక్తి చేపగా పుడతాడు. సుగంధద్రవ్యాలు దొంగిలించిన వాడు చుంచుగా జన్మిస్తాడు. ఈ పాపాలకు పూనుకున్న స్త్రీలు కూడా ఇవే జన్మలను పొందుతారు. పాపాత్ములకు భార్యలుగా ఉంటారు.’’ చెప్పాడు బృహస్పతి. ‘‘గురుదేవా! పాప నివారణోపాయాలు చెప్పండి.’’ అడిగాడు ధర్మరాజు. ‘‘ధర్మరాజా! దానాలు అన్నిటి వల్లా పాపాలు తొలగిపోతాయి. అయితే పాపనివారకశక్తి కలిగిన దానానికి అత్యధిక ఫలితం ఉంటుంది. న్యాయార్జితం అయిన డబ్బుతో వేయిమందికి అన్నదానం చేస్తే ఎలాంటి పాపమయినా రూపుమాసిపోగలదు. నిరతాన్నదానం కన్నా గొప్పది మరొకటి లేదు. అన్ని ధర్మాలకన్నా అన్నదానం గొప్పది.’’ చెప్పాడు బృహస్పతి.

Updated Date - 2021-12-08T21:51:27+05:30 IST