రాత్రయినా ఇంటికి రాకపోవడంతో.. తమ్ముడి కోసం వెతకగా.. అన్నకు ఎదురైన షాకింగ్ ఘటన!

ABN , First Publish Date - 2021-09-14T04:50:19+05:30 IST

మండలంలోని విలాసాగర్‌లో..

రాత్రయినా ఇంటికి రాకపోవడంతో.. తమ్ముడి కోసం వెతకగా.. అన్నకు ఎదురైన షాకింగ్ ఘటన!
మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న సీపీ సత్యనారాయణ

విలాసాగర్‌లో దారుణ హత్య 

హత్య చేసి, పెట్రోల్‌ పోసి నిప్పంటించిన గుర్తు తెలియని వ్యక్తులు


జమ్మికుంట రూరల్‌: మండలంలోని విలాసాగర్‌లో దారుణ హత్య జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తిని హత్య చేసి పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. విలాసాగర్‌ గ్రామానికి చెందిన సిరిశేటి సంతోష్‌ (40) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం ఆరు గంటలకు ఫోన్‌ రావడంతో ఇంటి నుంచి తన ద్విచక్ర వాహనంపై జమ్మికుంటకు వెళ్లాడు. రాత్రి 9.30కు సంతోష్‌కుమార్‌ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. దీంతో కుటుంబసభ్యులు ఆందోళన చెందారు. రాత్రయినా ఇంటికి రాకపోవడంతో సంతోష్‌ కోసం వెతికారు. సోమవారం తెల్లవారుజామున విలాసాగర్‌ శివారులోని రోడ్డు సమీపంలో మంటలు రావడాన్ని సంతోష్‌ సోదరుడు గమనించాడు. అక్కడి వెళ్లి  చూసేసరికి మంటల్లో ఓ మృతదేహం కాలిపోవడాన్ని గమనించాడు.


దుస్తుల ఆధారంగా అది తన తమ్ముడి మృతదేహం అని గమినించి మంటలు ఆర్పి వేసి పోలీసులకు, గ్రామస్థులకు సమాచారం అందించాడు. హుజూరాబాద్‌ ఏసీపీ వెంకట్‌రెడ్డి, జమ్మికుంట టౌన్‌ సీఐ కె రామ్‌చందర్‌రావు, టాస్క్‌ఫోర్స్‌ సీఐ సృజన్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. మృతదేహం వద్ద ఉన్న సెల్‌ ఫోన్‌, పక్కన హెల్మెట్‌ (సంతోష్‌ది కాదు), సమీపంలో ఉన్న మృతుడి ద్విచక్ర వాహనం, రక్తం మరకలతో ఉన్న బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. గుర్తు తెలియని వ్యక్తులు సంతోష్‌ను హత్య చేసి ఆపై పెట్రోల్‌ పోసి నిప్పంటించినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. 


కరీంనగర్‌ నుంచి వచ్చిన డాగ్‌ స్క్వాడ్‌ మృతదేహం పరిసర ప్రాంతాల్లో తిరిగింది. ఫింగర్‌ ప్రింట్స్‌ నిపుణులు సంఘటన స్థలంలో వేలి ముద్రలు సేకరించారు. హత్యకు పాల్పడిన వ్యక్తుల్లో ఇద్దరిని పోలీస్‌లు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. మృతదేహం సగం కాలి ఉండటంతో వైద్యులు సంఘటన స్థలంలోనే పోస్ట్‌మార్టం నిర్వహించారు. 


పథకం ప్రకారమే..

రాత్రి 9.30 గంటలకు సంతోష్‌ సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావడంతో కంగారు పడ్డ కుటుంబ సభ్యులు, సన్నిహితులు హత్య జరిగిన సమీప ప్రాంతంలో రాత్రి తిరిగారు. ఆ ప్రాంతంలో సంతోష్‌ నిత్యం స్నేహితులతో కలిసి ఉంటాడు. రాత్రి ద్విచక్ర వాహనం కనిపించ లేదు. హంతకులు తెల్లవారు జామున ద్విచక్ర వాహనాన్ని అక్కడ పెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. కుటుంబసభ్యులు మృతదేహాన్ని గమనించే సమయానికి ద్విచక్ర వాహనం ఇంజన్‌ వేడిగా ఉంది. ఇగ్నిషన్‌ కీ ఆన్‌లో ఉంది. వీటన్నింటి బట్టి చూస్తే పక్క పథకం ప్రకారమే హత్య చేసి ఉంటారని తెలుస్తోంది.  సంతోష్‌ భార్య కోమల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తూ చేస్తున్నట్లు పోలీస్‌లు తెలిపారు.


ఆరు బృందాలు ఏర్పాటు చేశాం: సత్యనారాయణ, సీపీ

సంతోష్‌ హత్య కేసును ఛేదించేందుకు ఆరు టెక్నికల్‌ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు. హత్య జరిగిన ప్రదేశాన్ని సీపీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హత్య కేసును 24 గంటల్లో ఛేదిస్తామని, అదే పనిలో తాము నియమించిన బృందాలు పని చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహం కాలిపోవడం వల్ల ఇక్కడికే ఫోరెన్సిక్‌ బృందాలను రప్పించి ఆధారాలు సేకరించామన్నారు.


Updated Date - 2021-09-14T04:50:19+05:30 IST