సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ నుంచి తప్పుకున్న బీఎస్ మాన్

ABN , First Publish Date - 2021-01-14T21:23:40+05:30 IST

వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులతో

సాగు చట్టాలపై సుప్రీంకోర్టు కమిటీ నుంచి తప్పుకున్న బీఎస్ మాన్

న్యూఢిల్లీ : వివాదాస్పద సాగు చట్టాలపై నిరసన తెలుపుతున్న రైతులతో చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ నుంచి భూపీందర్ సింగ్ మాన్ వైదొలగారు. తాను నిష్పక్షపాతంగా ఉండాలనుకుంటున్నట్లు తెలిపారు. తనను ఈ కమిటీలో నియమించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు తెలిపారు. రైతుల కోసం ఎలాంటి త్యాగమైనా చేస్తానని చెప్పారు. 


కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలపై రైతులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. సుప్రీంకోర్టు మంగళవారం ఈ చట్టాల అమలును నిలిపేస్తూ, నలుగురు వ్యవసాయ రంగ నిపుణులతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో అగ్రికల్చరల్ ఎకనమిస్ట్ అశోక్ గులాటీ, భారతీయ కిసాన్ యూనియన్-మాన్ అధ్యక్షుడు భూపీందర్ సింగ్ మాన్, షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు అనిల్ ఘన్వత్, ఇంటర్నేషనల్ ఫుడ్ పాలసీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన ప్రమోద్ కుమార్‌ జోషీలను సభ్యులుగా నియమించింది. 


త్యాగాలకు వెనుకాడను : మాన్ 

ఈ కమిటీ నుంచి భూపీందర్ సింగ్ మాన్ గురువారం వైదొలగారు. తాను నిష్పాక్షికంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వివాదాస్పద చట్టాలపై రైతులతో చర్చలు ప్రారంభించేందుకు ఏర్పాటు చేసిన కమిటీలో తనను నియమించినందుకు సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్తున్నానన్నారు. స్వయంగా తాను రైతునని, సంఘం నాయకుడినని చెప్పారు. రైతు సంఘాలు, ప్రజల్లో ఏర్పడిన భయాలు, మనోభావాలను దృష్టిలో ఉంచుకుని తాను ఈ కమిటీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పంజాబ్‌తోపాటు దేశంలోని రైతుల ప్రయోజనాలతో రాజీ పడబోనని చెప్పారు. తనకు ఇచ్చిన, ఇవ్వబోయే ఎలాంటి పదవినైనా త్యాగం చేయడానికి తాను సిద్ధమేనని చెప్పారు. ఈ కమిటీ నుంచి తాను వైదొలగుతున్నానని తెలిపారు. తాను ఎల్లప్పుడూ రైతులతోనూ, పంజాబ్‌తోనూ నిలుస్తానని పేర్కొన్నారు. 


రైతుల ఆందోళనకు కారణాలు...

సాగు చట్టాలపై చర్చించేందుకు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు ఈ చట్టాలను సమర్థిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ కమిటీతో పరిష్కారం లభించబోదని చెప్తున్నారు. రైతు సంఘాలు గుర్తు చేస్తున్న అంశాలేమిటంటే, భూపీందర్ సింగ్ మాన్ గత డిసెంబరులో వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌తో సమావేశమై, ఈ చట్టాలకు మద్దతు పలికారు. అదేవిధంగా అశోక్ గులాటీ కూడా ఈ చట్టాలను సమర్థిస్తూ, ఇవి 1991నాటి ఆర్థిక సంస్కరణల వంటివని పేర్కొన్నారు. ఈ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండ్‌ను షేట్కారీ సంఘటన్ అధ్యక్షుడు  ఘన్వత్ తప్పుబట్టారు. మార్కెటింగ్ కమిటీలు, ఎంఎస్‌పీ కొనసాగుతాయని, అందువల్ల ఆందోళన చేయడంలో అర్థం లేదని పేర్కొన్నారు. జోషీ ఓ పత్రికలో రాసిన వ్యాసంలో రైతులు ప్రతిసారీ చర్చలకు ముందు  లక్ష్యాలను మార్చుతుండటం దురదృష్టకరమన్నారు. ఈ కారణాల వల్ల ఈ కమిటీతో ప్రయోజనం లేదని రైతు సంఘాలు చెప్తున్నాయి.


Updated Date - 2021-01-14T21:23:40+05:30 IST