Abn logo
Sep 24 2021 @ 17:20PM

యడియూరప్పకు కర్ణాటక ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప 2020-21 సంవత్సరానికి కర్ణాటక లెజిస్టేటివ్ అసెంబ్లీలో ఉత్తమ శాసనసభ్యుడుగా ఎంపికయ్యారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా చేతుల మీదుగా ఒక మెమెంటోను యడియూరప్ప శుక్రవారంనాడు అందుకున్నారు. ఈ సందర్భంగా సభలో ఓం బిర్లా మాట్లాడుతూ, రాజ్యాంగ రూపకల్పన సమయంలో శాసనసభ్యలు మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా, నిజాయితీగా, కర్తవ్యబద్ధులై ఉండాలని నిపుణుల కమిటీ ఆశించిందని, తద్వారా ప్రజల సామాజిక, ఆర్థిక అభ్యున్నతకి మార్గం సుగమం అవుతుందని భావించిందని అన్నారు. ''మనం రూపొందించే చట్టాలపై విస్తృతంగా చర్చ జరపాల్సిన బాధ్యత మనపై ఉంది. ఎమ్మెల్యేలంతా చురుకుగా వీటిల్లో పాల్గొనాలి. అప్పుడే మనం రూపొందించే చట్టాలపై ఎలాంటి ప్రశ్నలకు తావుండదు'' అని ఓం బిర్లా పేర్కొన్నారు.

దీనికి ముందు, కర్ణాటక స్పీకర్ విశ్వేశ్వర హెగ్డే కగెరి ఒక ప్రకటన చేస్తూ, లోక్‌సభ, రాజ్యసభల్లో ఏటా ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ప్రకటిస్తుంటారని, అదే తరహాలో ఈ ఏడాది కర్ణాటక లెజిస్లేటివ్ అసెంబ్లీ నుంచి ఉత్తమ లెజిస్లేటర్ అవార్డు కర్ణాటకకు దక్కిందని అన్నారు. ఏటా ఒక లిజిస్లేటర్‌ను ఎంపిక చేసి, వారికి ఒక సర్టిఫికెట్, సిల్వర్ మెడల్ ప్రదానం జరుగుతుంది.