ఆ BSF jawan చనిపోయిన అయిదు రోజుల తర్వాత.. అంత్యక్రియలు జరిగిన చోట అరుదైన దృశ్యం

ABN , First Publish Date - 2021-08-23T19:03:49+05:30 IST

రాజస్థాన్‌లోని నాగౌర్ నగరానికి చెందిన చిరంజిలాల్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. అతడి సోదరికి చాలా కాలం క్రితమే పెళ్లయింది. అయితే కొన్నాళ్లుగా కుటుంబ కలతల కారణంగా

ఆ BSF jawan చనిపోయిన అయిదు రోజుల తర్వాత.. అంత్యక్రియలు జరిగిన చోట అరుదైన దృశ్యం

‘అక్కా.. నువ్వు నాలుగేళ్లుగా నాకు రాఖీ కట్టడం లేదు. ఏవేవో కుటుంబ సమస్యలు ఉన్నాయని అస్సలు రావడం లేదు. ఈ సారి మాత్రం నువ్వు తప్పకుండా రావాల్సిందే. నాకు రాఖీ కట్టాల్సిందే. నువ్వు ప్రత్యేకంగా చేసే స్వీట్‌ను నేను తినాల్సిందే.’... ఇదీ ఓ నెల రోజుల క్రితం ఓ బీఎస్ఎఫ్ జవాను తన అక్కయ్య వాళ్లింటికి వెళ్లినప్పుడు చెప్పిన మాటలు. వస్తానని ఆ అక్క ఆ రోజు ఆ తమ్ముడికి మాటిచ్చింది. కానీ ఇంతలోపే ఘోరం జరిగింది. ఆ బీఎస్ఎఫ్ జవాను గుండెపోటుతో మరణించాడు. అతడి అంత్యక్రియలు జరిగిన ఐదు రోజుల తర్వాత రాఖీ పండగ రోజు ఆ సోదరి చేసిన పనికి బంధువులంతా కంటతడి పెట్టుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..


రాజస్థాన్‌లోని నాగౌర్ నగరానికి చెందిన చిరంజిలాల్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్ జవానుగా పనిచేస్తున్నాడు. అతడి సోదరికి చాలా కాలం క్రితమే పెళ్లయింది. అయితే కొన్నాళ్లుగా కుటుంబ కలతల కారణంగా ఆ సోదరి చిరంజిలాల్‌కు రాఖీ కట్టేందుకు పుట్టింటికి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆగస్టు నెల మొదటి వారంలో పనిమీద సోదరి ఇంటికి వెళ్లిన చిరంజిలాల్ రాఖీ పండుగ విషయమై మాట్లాడాడు. పండక్కు తప్పకుండా రావాలనీ, నాలుగేళ్లుగా తనకు రాఖీ కట్టడం లేదని గుర్తు చేశాడు. ఆ సమయంలో సోదరి తప్పకుండా వస్తానని మాటిచ్చింది. ఈ క్రమంలోనే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు చిరంజిలాల్ ఢిల్లీకి వెళ్లాడు. ఆ వేడుకల్లో జరిగిన పరేడ్‌లో పాల్గొన్నాడు. అయితే అనుకోకుండా ఆగస్టు 17న గుండెపోటు రావడంతో మరణించాడు. 


అతడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చిన తర్వాత ఆగస్టు 18వ తారీఖున అంత్యక్రియలు నిర్వహించారు. చిరంజిలాల్ కుల ఆచారం ప్రకారం అతడి అంత్యక్రియలు జరిగిన తర్వాత మూడో రోజు చితాభస్మంపై మూడు కర్రల ఆధారంతో ఓ పీటను తయారు చేసి, దానిపై ఓ కుండను పెడతారు. ఆ కుండలో పసుపు నీళ్లను పోసి తెల్లటి వస్త్రంతో కప్పివేస్తారు. 12 రోజుల పాటు ఆ కుండ అలాగే ఉండాలి. పెదకర్మ జరిగిన రోజు ఆ కుండను తొలగిస్తారు. అతడి పెదరక్మ త్వరలోనే జరగాల్సి ఉంది. ఇంతలోనే ఆగస్టు 22వ తారీఖున రాఖీ పండుగ వచ్చింది. సోదరుడు ప్రాణాలతో లేకున్నా.. అతడికి ఇచ్చిన మాటను మాత్రం ఆ సోదరి మర్చిపోలేదు. రాఖీ పండుగ రోజు నేరుగా తమ్ముడికి అంత్యక్రియలు జరిగిన వద్దకు వెళ్లింది. అక్కడ ఏర్పాటు చేసిన కుండకు ఆసరాగా ఉన్న ఓ కర్రకు రాఖీని కట్టింది. తన సోదరుడిని గుర్తుకు తెచ్చుకుని కన్నీరుమున్నీరుగా విలపించింది. రాఖీ పండుగ రోజు ఆమె చేసిన పనిని చూసి బంధువులంతా కంటతడి పెట్టుకున్నారు.

Updated Date - 2021-08-23T19:03:49+05:30 IST