భారత్‌ మీదుగా అఫ్ఘానిస్థాన్‌కు టెర్రరిస్టుల ప్రయాణం.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్

ABN , First Publish Date - 2021-08-23T02:21:00+05:30 IST

బాంగ్లాదేశీ యువత కొందరు భారత్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌లో ప్రవేశించి తాలిబన్లలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని బాంగ్లాదేశ్ పోలీసు ఉన్నతాధికారి తాజాగా హెచ్చరించారు.

భారత్‌ మీదుగా అఫ్ఘానిస్థాన్‌కు టెర్రరిస్టుల ప్రయాణం.. అప్రమత్తమైన బీఎస్ఎఫ్

న్యూఢిల్లీ: బంగ్లాదేశీ యువత కొందరు భారత్ మీదుగా అఫ్ఘానిస్థాన్‌లో ప్రవేశించి తాలిబన్లలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని బంగ్లాదేశ్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తాజాగా హెచ్చరించారు. వీరు సరిహద్దు గుండా భారత్‌లోకి ప్రవేశించే అవకాశం ఉందని ఢాకా పోలీస్ కమిషనర్ షఫీకుల్ ఇస్లామ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో బోర్డర్ సెక్యురిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్) అప్రమత్తమైంది. ‘‘మా దళాలు అన్నీ హై అలర్ట్‌లో ఉన్నాయి. అయితే..ఇప్పటివరకూ ఎవరినీ అదుపులోకి తీసుకోలేదు’’ అని బీఎస్ఎఫ్ దక్షిణ బెంగాల్ ఫ్రాంటియర్‌కు చెందిన డీఐజీ ఎస్ఎస్ గులేరియా శనివారం నాడు పేర్కొన్నారు. కాగా.. అఫ్ఘానిస్థాన్‌కు రావాలంటూ బంగ్లాదేశ్ యువతకు తాలిబన్లు పిలుపునిచ్చినట్టు కూడా తెలుస్తోంది. ఈ క్రమంలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి బీఎస్ఎఫ్ గస్తీని మరింత కట్టుదిట్టం చేసింది. అఫ్ఘానిస్థాన్‌లో తాలిబన్లు అధికారంలోకి రావడంతో బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు క్రియాశీలకంగా మారారని బీఎస్ఎఫ్ అధికారి ఒకరు తెలిపారు. 

Updated Date - 2021-08-23T02:21:00+05:30 IST