Advertisement
Advertisement
Abn logo
Advertisement
Jul 17 2021 @ 19:05PM

Punjab CMపై మాయావతి ఆగ్రహం

లక్నో : పంజాబ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్‌పై బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) చీఫ్ మాయావతి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కెప్టెన్ సింగ్ రైతుల ఉద్యమంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాయడాన్ని తప్పుబట్టారు. రైతు ఉద్యమాన్ని కెప్టెన్ సింగ్ అపఖ్యాతిపాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. 


మాయావతి శనివారం ఇచ్చిన ఓ ట్వీట్‌లో, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఓ లేఖ రాశారన్నారు. రైతుల ఉద్యమం గురించి అనేక భయాలను వ్యక్తం చేశారన్నారు. ఇదంతా రైతుల ఉద్యమాన్ని అపఖ్యాతిపాలు చేయడానికి జరుగుతున్న కుట్ర అని ఆరోపించారు. కొత్త  సాగు చట్టాల రద్దు కోసం రైతులు తమ జీవితాలను త్యాగం చేస్తున్నారన్నారు. మోదీకి లేఖ ముసుగులో ఎన్నికల రాజకీయాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. ఇది చాలా అన్యాయమని స్పష్టం చేశారు. ఓ సరిహద్దు రాష్ట్రంలో ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకోవడం అసమంజసమైనదేమీ కాదన్నారు. అయితే ఈ ముసుగులో స్వార్థపూరిత ఎన్నికల రాజకీయాలకు పాల్పడటం, రైతుల ఉద్యమాన్ని అపఖ్యాతిపాలు చేయడం వంటివాటిని ప్రజలు బాగా అర్థం చేసుకుంటారన్నారు. ఇలా చేయడం వల్ల కాంగ్రెస్‌కు ఒరిగేదేమీ ఉండదని తెలిపారు. 


ముఖ్యమంత్రి కెప్టెన్ సింగ్ శుక్రవారం ప్రధాని మోదీకి ఓ లేఖ రాశారు. ఉద్యమిస్తున్న రైతులతో తక్షణమే చర్చలను పునరుద్ధరించాలని కోరారు. పంజాబ్ శాసన సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో సరిహద్దుల ఆవలి నుంచి ఐఎస్ఐ మద్దతుగల శక్తుల నుంచి ముప్పు ఎదురవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కొందరు రైతు నేతలను ఖలిస్థాన్ అనుకూల సంస్థలు లక్ష్యంగా చేసుకున్నాయన్నారు. ఇటీవలి కాలంలో సరిహద్దుల ఆవలి నుంచి డ్రోన్లు చొరబడుతున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘మనకు గర్వకారణమైన, నిజాయితీపరులైన, శ్రమించే తత్వంగల రైతుల భావోద్వేగాలతో ఆడుకోవడానికి సరిహద్దుల ఆవలి శక్తులు ప్రయత్నించే అవకాశం ఉంది’’ అని మోదీని హెచ్చరించారు. 


Advertisement
Advertisement