Advertisement
Advertisement
Abn logo
Advertisement
Aug 28 2021 @ 17:28PM

వచ్చే నెల 7 నుంచి మాయావతి ఎన్నికల ప్రచారం!

లక్నో : వచ్చే ఏడాది జరిగే ఉత్తర ప్రదేశ్ శాసన సభ ఎన్నికల ప్రచారాన్ని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్‌పీ) అధినేత్రి మాయావతి సెప్టెంబరు 7 నుంచి ప్రారంభించబోతున్నారు.  బ్రాహ్మణులను సమైక్యపరిచేందుకు బీఎస్‌పీ జాతీయ ప్రధాన కార్యదర్శి సతీశ్ చంద్ర మిశ్రా జూలై 23 నుంచి ప్రబుద్ధ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. మిశ్రా ఈ సమ్మేళనాలను ఇప్పటి వరకు 62 జిల్లాల్లో నిర్వహించారు. సెప్టెంబరు 4 నాటికి 74 జిల్లాల్లో ఈ సమ్మేళనాలను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. లక్నోలో సెప్టెంబరు 7న జరిగే చివరి సమ్మేళనానికి మాయావతి కూడా హాజరవుతారని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ఇక్కడి నుంచే ఆమె శాసన సభ ఎన్నికల శంఖారావాన్ని పూరిస్తారని తెలుస్తోంది. 


సతీశ్ చంద్ర మిశ్రా శనివారం మీడియాతో మాట్లాడుతూ, ఉత్తర ప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రభుత్వంలో బ్రాహ్మణులు తీవ్రమైన అణచివేతకు గురవుతున్నారన్నారు. ప్రస్తుత యోగి ప్రభుత్వంలో తీవ్రంగా వేధింపులకు గురైన వర్గం ఏదైనా ఉందీ అంటే అది బ్రాహ్మణ సమాజమేనని చెప్పారు. అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ పరిపాలనలో బ్రాహ్మణులకు జరిగినట్లుగానే యోగి ప్రభుత్వంలో కూడా జరుగుతోందన్నారు. 


అఖిలేశ్ యాదవ్ పరిపాలనా కాలంలో బ్రాహ్మణులు అణచివేతకు గురయ్యారన్నారు. ఉత్తర ప్రదేశ్ జనాభాలో బ్రాహ్మణులు 13 శాతం ఉన్నారన్నారు. బ్రాహ్మణులు ఐకమత్యంగా నిలవవలసిన సమయం వచ్చిందని చెప్పారు. బ్రాహ్మణులు, దళితుల ఓట్లకు ఇతర వర్గాల ఓట్లు జతకూడితే, ఓట్ల శాతం 45 నుంచి 50 శాతానికి పెరుగుతుందన్నారు. అదే జరిగితే బ్రాహ్మణులు 2007లో పరిస్థితులను పునరావృతం చేస్తారని, మాయావతి ప్రభుత్వం ఏర్పడకుండా ఎవరూ ఆపలేరని చెప్పారు. 


Advertisement
Advertisement