అమానుషం

ABN , First Publish Date - 2021-08-18T06:55:23+05:30 IST

స్వాతంత్ర్యదినోత్సవం నాడు గుంటూరులో జరిగిన నల్లపు రమ్య హత్య ఘటన అత్యంత విషాదకరమైనది..

అమానుషం

స్వాతంత్ర్యదినోత్సవం నాడు గుంటూరులో జరిగిన నల్లపు రమ్య హత్య ఘటన అత్యంత విషాదకరమైనది. ప్రేమించాల్సిందిగా వెంటపడుతున్న ఓ వ్యక్తిని నిరాకరించినందుకు అతనిచేతిలోనే ఈ ఇంజనీరింగ్‌ విద్యార్థిని నడిరోడ్డుమీద హత్యకు గురైంది. వాడవాడలా వేడుకలు జరుగుతున్న క్షణాల్లోనే ఈ దళిత విద్యార్థిని వరుస కత్తిపోట్లకు గురై, ఆస్పత్రికి తరలిన కొద్దిక్షణాల్లోనే కన్నుమూసింది. శశికృష్ణ అనే ఒక జులాయితో సామాజిక మాధ్యమాల ద్వారా మొదలైన పరిచయం ఆమె మరణానికి కారణమైంది.


నడిరోడ్డుమీద, నలుగురూ చూస్తుండగా ఒక యువతిని ఓ యువకుడు ప్రేమపేరుతో చేసిన ఈ హత్య సమాజంలో కలకలం సృష్టించింది. ప్రభుత్వం తక్షణం స్పందించాలనీ, నిందితుడిని వాయువేగంతో పట్టుకోవాలనీ, బాధితకుటుంబాన్ని బాగా ఆదుకొని వారి ఆవేదన ఉపశమింపచేయాలన్న డిమాండ్లతో ప్రభుత్వంమీద ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. అధికారంలో ఉన్నవారు ఇటువంటి సందర్భాల్లో మరింత సంయమనంతో వ్యవహరించాలి. తాము దిశ చట్టం తెచ్చిన తరువాత రాష్ట్రంలో నేరాలూ ఘోరాలూ బాగా తగ్గిపోయాయనీ, నిందితుల అరెస్టులు, చార్జిషీట్ల దాఖలు రోజుల్లోనూ గంటల్లోనూ జరిగిపోతున్నదని ప్రభుత్వ పెద్దలు ఎలాగైతే తమకు నచ్చిన, నోటికివచ్చిన లెక్కలు చెప్పుకుంటున్నారో, జగన్మోహన్‌రెడ్డి పాలనలో పరిస్థితులు ఇంకా దిగజారాయని ప్రతిపక్షాలు ఆరోపించడమూ సహజమే. అధికారంలో ఉన్నవారు ఈ ఫేస్‌బుక్‌ ప్రేమని రాజకీయం చేయవద్దని చెప్పడం ద్వారా ఈ ఘటనకు అంతప్రాధాన్యం లేనట్టుగా చిత్రీకరిస్తున్నారు. వరుసగా ఇటువంటి ఘోరాలు జరుగుతుంటే రాష్ట్రంలో దిశచట్టం ఎక్కడుందనీ, అసలు ఆ చట్టం కింద ఇప్పటివరకూ ఒక్కరికైనా శిక్షపడిందా అని ప్రశ్నిస్తున్నవారికి రాక్షసత్వాన్ని అంటకడుతున్నారు. చంద్రబాబును, లోకేష్‌ను విమర్శించే పేరిట కొందరుమంత్రులు వాడిన భాష అత్యంత జుగుప్సాకరం. రమ్య మృతదేహానికి నివాళులర్పించేందుకు, కుటుంబీకులను పరామర్శించేందుకు వచ్చిన తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌తో ప్రభుత్వం వ్యవహరించిన తీరు సరైనది కాదు. ఆయన వచ్చేలోగా శవాన్ని తరలించేయాలని పోలీసులు తెగతాపత్రయపడ్డారు. లోకేష్‌ అరెస్టు, పోలీసుస్టేషన్‌లో ఆరుగంటల నిర్బంధం వంటివి ప్రభుత్వపెద్దలే ఈ వ్యవహారాన్ని మరింత రాజకీయం చేశారన్న అప్రదిష్టకు వీలుకల్పిస్తోంది. 


మహిళలు మరీ ముఖ్యంగా దళితులకు జగన్మోహనరెడ్డి పాలనలో భద్రత కరువైందన్న విమర్శలో అతిశయోక్తి ఏమీ లేదు. ఏ విధమైన రక్షణ సదుపాయాలూ లేకుండానే తామంతా కరోనాసోకిన వారికి వైద్యం చేయవలసివస్తున్నదంటూ ప్రభుత్వాసుపత్రుల స్థితిగతులను తొలిసారిగా బయటకు చెప్పిన డాక్టర్‌ సుధాకర్‌ విషయంలో ప్రభుత్వం ఎంత అమానవీయంగా వ్యవహరించిందో అందరికీ తెలిసిందే. ఆ తరువాత దళితుల శిరోముండనాలు, వారిపై దాడులు, అక్రమనిర్బంధాల వంటివి అనేకం. రమ్యఘటన వంటివి జరిగినప్పుడు కూడా దళితసంఘాలు నిరసనలు వ్యక్తంచేయకూడదనీ, విమర్శలు చేయకూడదనీ ప్రభుత్వం భావిస్తున్నట్టు కనిపిస్తున్నది. 


రమ్య హత్య జరిగినప్పుడు చుట్టూచేరినవారు అనేకమంది ఉన్నా, ఎవరూ నిందితుడిని నిలువరించడానికి ప్రయత్నించకపోవడం విచిత్రం, విషాదం. రద్దీగా ఉన్న ఆ ప్రాంతంలో రోడ్డుమీద వాహనాల రాకపోకలు కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి. నిందితుడు ఆమెను కొడుతున్నప్పుడు కానీ, ఆమె పెనుగులాడుతున్నప్పుడు కానీ స్థానికులు అడ్డుకొనేందుకు ప్రయత్నించివుంటే అతడు వెనక్కుతగ్గేవాడే. ఆమెను అంతకసిగా వరుసపెట్టి పొడిచేంత అవకాశం నిందితుడికి దక్కవు కనుక ఆమె బతికివుండేదేమో. స్తంభాల మీద అమర్చిన సీసీ టీవీల మాదిరిగా ప్రజలు కూడా ఇటువంటి ఘోరాలను కళ్ళప్పగించి చూస్తూండటం విషాదం. జరిగిన ఘోరం యావత్తూ సీసీ కెమెరాల్లో రికార్డు కావడం, బాధితురాలికీ నిందితుడికీ ఉన్న పరిచయం కారణంగా ఆమె ఫోన్‌లో అతడి వివరాలన్నీ లభ్యం కావడంతో నిందితుడిని పోలీసులు వేగంగానే పట్టుకోగలిగారు. ప్రభుత్వం మిగతాప్రక్రియను వేగవంతం చేయడం, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడటం ముఖ్యం.

Updated Date - 2021-08-18T06:55:23+05:30 IST