టీఆర్‌ఎస్‌ మైనారిటీ నేత బుడాన్‌బేగ్‌ కన్నుమూత

ABN , First Publish Date - 2021-05-18T05:45:07+05:30 IST

టీఆర్‌ఎస్‌ మైనారిటీ నేత బుడాన్‌బేగ్‌ కన్నుమూత

టీఆర్‌ఎస్‌ మైనారిటీ నేత బుడాన్‌బేగ్‌ కన్నుమూత

బలిగొన్న కరోనా, బ్లాక్‌ఫంగస్‌ 

బెంగళూరులో తుదిశ్వాస విడిచిన టీఎస్‌ఐడీసీ మాజీ చైర్మన్‌ 

ఖమ్మం (ఆంధ్రజ్యోతిప్రతినిధి)/వైరా, మే 17: తెలం గాణ పారిశ్రామిక అభివృద్ధి సంస్థ (టీఎస్‌ఐడీసీ) మాజీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ ఖమ్మం జిల్లా మైనారిటీ నేత ఎస్‌కే బుడాన్‌బేగ్‌ (59)సోమవారం మధ్యాహ్నం కన్నుమూ శారు. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. ఇటీవల కరోనా బారిన పడిన ఆయన్ను బెంగళూరులో వైద్యుడిగా స్థిరపడిన కుమారుడు వైద్యం కోసం బెంగళూరు తీసు కెళ్లగా అక్కడ చికిత్సపొంది కోలుకుంటుండగా బ్లాక్‌ ఫంగస్‌ సోకింది. నాలుగురోజుల క్రితం శస్త్రచికిత్స చేసినా ప్రాణాలు దక్కలేదు. ఎంపీ నామా నాగేశ్వరరావు అత్యవసర మందులు బెంగళూరుకు పంపించినా.. ఆయన కోలుకోలేక పోయారు. ఖమ్మం జిల్లా వైరా మునిసిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లికి చెందిన స్వాతంత్ర సమర యోధుడైన ఉద్దండు సాహెబ్‌ అలియాస్‌ మైకుబాబు, మహబూబీ దంపతుల మూడో సంతానమైన బేగ్‌కు ఐదుగురు అన్న దమ్ములు, నలుగురు అక్కచెల్లెళ్లు కాగా విద్యార్థి దశ నుంచే వామపక్ష భావజాలాన్ని పునికిపుచ్చుకున్న బేగ్‌ వరంగల్‌ ఆర్‌ఈసీలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఆసమయంలో కొండపల్లి సీతారామయ్య అనుచరుడిగా రాడికల్‌ స్టూడెంట్‌ యూనియన్‌లో కీలకంగా వ్యవహరించారు. ఆ యూనియన్‌ తరపున ఆర్‌ఈసీ సెక్రటరీగా కూడా పనిచేశారు. అనంతరం సీపీఐ నాయకుడిగా కొనసాగి.. ముస్లిం మైనార్టీ నాయకుడిగా మంచి గుర్తింపు పొందారు. ఇక తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బేగ్‌ 2014లో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఉమ్మడి ఖమ్మం జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆయన్ను టీఎస్‌ఐడీసీ చైర్మన్‌గా నియమించారు. కానీ గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బేగ్‌ టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసి.. నామా నాగేశ్వరరావు నేతృత్వంలో టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో పసుపుకండువా కప్పుకొన్నారు. అనంతరం రాజకీయపరిణామాలతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్న ఆయన ఇటీవలి కార్పొరేషన్‌ ఎన్నికల సమ యంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బేగ్‌ ఆతర్వాత కరోనా బారిన పడి కోలుకున్నా.. బ్లాక్‌ ఫంగస్‌ బారినపడి కన్నుమూశారు. బేగ్‌ మృతికి రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు,  ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ గుండాల కృష్ణ, టీఆర్‌ఎస్‌, ఇతర పార్టీల నాయకులు సంతాపం తెలిపారు. 

Updated Date - 2021-05-18T05:45:07+05:30 IST