బుద్ధుని బోధ: మన మధ్యనే తిరుగుతున్న మహనీయులు.. వారిని గుర్తిస్తే.. ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే..

ABN , First Publish Date - 2021-11-10T13:32:21+05:30 IST

ఒకరోజు బుద్ధుడు ఎడారి ప్రాంతానికి వెళ్లాడు.

బుద్ధుని బోధ: మన మధ్యనే తిరుగుతున్న మహనీయులు.. వారిని గుర్తిస్తే.. ఎటువంటి అనుభూతి కలుగుతుందంటే..

ఒకరోజు బుద్ధుడు ఎడారి ప్రాంతానికి వెళ్లాడు. బుద్ధుడిని చూడాలనే ఆసక్తితో ఆ ప్రాంతానికి చెందిన రాజు ఆ మహనీయుని దగ్గరకు వచ్చాడు. ఆ రాజు మనసులో చాలా రోజులుగా ఒక సందేహం వెంటాడుతోంది. రాజు ఆ ప్రశ్నను బుద్ధుని ముందు ఉంచాడు. ‘ఈ ప్రపంచంలోని సామాన్యులలోనూ చాలామంది అసామాన్యులు ఉన్నారు.. కానీ వారిని ఎవరూ ఎందుకు గుర్తించడం లేదు?’ అని అడిగాడు. దీనికి బుద్ధుడు సమాధానమిస్తూ ‘ఈ ప్రపంచంలో అసామాన్యులు చాలామంది ఉన్నారు. వారు మహనీయుల కన్నా ఉన్నతులు. అయితే వారి మహనీయత్వం గురించి ఎక్కడా ప్రచారం జరగదు.. దానిని మనమే గ్రహించాలి’ అని అన్నాడు. ఈ మాట వినగానే రాజు.. ‘ఉన్నత గుణాలు కలిగినవారిని ప్రజలు ఎందుకు గుర్తించడం లేదు? అంటే వారి విషయంలో ప్రజలు విముఖంగా ఉన్నారా? అని అడిగాడు. దీనికి బుధ్దుడు సమాధానం ఇవ్వలేదు. 


ఆ రాజును బుద్ధుడు తనతోపాటు ఒక గ్రామానికి తీసుకువెళ్లాడు. కొంతదూరం వెళ్లాక వారికి ఒక సామాన్య స్త్రీ కనిపించింది. ఆమె ఒక చెట్టుకింద నీటి కుండను పెట్టుకుని కూర్చుంది. వేసవితాపానికితోడు అలసటకు గురైన ఆ రాజు, బుద్ధుడు ఆమె దగ్గరకు వెళ్లి నీటిని తాగారు. దీంతో వారికి ఉపశమనం లభించింది. రాజు ఆమెకు డబ్బులు ఇవ్వబోగా ఆమె తీసుకునేందుకు నిరాకరించింది. తరువాత ఆమె మాట్లాడుతూ ‘రాజా, నేను వ్యాపారం చేయడంలేదు. మీరు ఈ విశాలమైన చెట్టును చూడండి. ఈ చెట్టు ఎవరినీ ఏమీ అడగదు. నిస్వార్థంగా అందరికీ నీడను అందిస్తోంది. వేసవిలో ఉపశమనాన్ని కలిగిస్తోంది. నేను చాలా దూరంలో ఉన్న నదిలోని నీటిని ఈ కుండలో నింపుకుని, ఉపశమనం కోసం ఇక్కడికి వచ్చి కూర్చుంటున్నాను. ఈ విధంగా ఈ చెట్టు నాకు నీడనిస్తుండగా, నేను కాస్త నీటిని దీనికి ఇవ్వగలుగుతున్నాను. అదేవిధంగా ఇటువైపుగా రాకపోకలు సాగించేవారికి కూడా తాగునీటిని అందించగలుగుతున్నాను. అని అనందంగా చెప్పింది. ఇప్పుడు ఈ ప్రాంతానికి రాజయిన మీకు తాగునీటిని అందించి.. మీకు సేవ చేసే భాగ్యాన్ని కలిగించారు. ఫలితంగా నాకు ఎంతో సంతృప్తి లభించిందని తెలిపింది. ఈ సమాధానం విన్న రాజుకు తన మదిని ఎప్పటి నుంచో తొలిచేస్తున్న ప్రశ్నకు సమాధానం దొరికింది.

Updated Date - 2021-11-10T13:32:21+05:30 IST