బుద్ధుని బోధ: మీ జీవితమనే తాడుకు సమస్యల చిక్కుముళ్లు బిగుసుకున్నాయా?.. ఇలా చేస్తే వాటికి చిటికెలో పరిష్కారం!

ABN , First Publish Date - 2021-11-16T13:38:02+05:30 IST

ఒకరోజు ఉదయం గౌతమ బుద్ధుని శిష్యులంతా ఆయన ప్రసంగాలు..

బుద్ధుని బోధ: మీ జీవితమనే తాడుకు సమస్యల చిక్కుముళ్లు బిగుసుకున్నాయా?.. ఇలా చేస్తే వాటికి చిటికెలో పరిష్కారం!

ఒకరోజు ఉదయం గౌతమ బుద్ధుని శిష్యులంతా ఆయన ప్రసంగాలు వినడానికి ఒకచోట కూర్చున్నారు. కొంతసేపటి తరువాత బుద్ధుడు ఒక తాడు తీసుకువచ్చాడు. తథాగతుని చేతిలోని తాడును చూసిన శిష్యులంతా ఆశ్చర్యపోయారు. బుద్ధుడు తన ఆసనంపై కూర్చుని.. తాడుకు ఒకదాని తర్వాత ఒకటిగా మూడు ముడులు వేశాడు. అనంతరం బుద్దుడు శిష్యులను అడిగాడు...‘‘ముడి వేయడానికి ముందు ఉన్న తాడు ఇదేనా?’’ ఈ ప్రశ్నకు ఒక శిష్యుడు స్పందిస్తూ.. ‘‘సమాధానం చెప్పడం కొంచెం కష్టం.. మనం చూసే విధానాన్ని బట్టి అది ఉంటుంది. ఒకరకంగా చెప్పాలంటే తాడు ఒకటే.. అందులో మార్పు లేదు’’ అని అన్నాడు. మరో శిష్యుడు లేచి నిలబడి.. ‘‘ఇంతకుముందు తాడులో లేని మూడు ముడులు ఇప్పుడు ఉన్నాయని.. దీనినే మార్పు అని అనవచ్చు’’ అన్నాడు. మరికొందరు శిష్యులు ‘‘వాస్తవానికి ఈ తాడు ఒకేలా ఉందని, అయితే అది మారినట్లు కనిపిస్తోందని, నిజానికి దాని అసలు రూపం మారలేదని’’ చెప్పారు. శిష్యుల సమాధానాలు విన్న బుద్ధుడు ‘‘బాగానే చెప్పారని’’ అన్నాడు. తరువాత.. ‘‘ఇప్పుడు నేను ఈ ముడులను విప్పుతాను’’.. అంటూ బుద్ధుడు తాడు రెండు చివరలను పట్టుకుని లాగడం మొదలుపెట్టాడు.. ‘‘ఈ విధంగా తాడు ముడులు విప్పుతారా?’’ అని బుద్ధుడు అడిగాడు. 


శిష్యులందరూ.. ‘‘వద్దు అలా చేయడం వల్ల ముడులు బిగుసుకుపోతాయి. వాటిని విడదీయడం మరింత కష్టం అవుతుందని’’ అన్నారు. దీనికి బుద్ధుడు ‘‘సరే.. ఇప్పుడు చివరి ప్రశ్న.. ఈ చిక్కు ముడులు విప్పడానికి మనం ఏమి చేయాలి?’’ అని అడిగాడు... ‘‘ఈ ముడులను మనం జాగ్రత్తగా గమనించాలి.. ఆ తరువాత వాటిని ఎలా విప్పవచ్చో తెలుసుకోవచ్చని’’ శిష్యులు చెప్పారు. బుద్ధుడు ఈ సమాధానంతో సంతృప్తి చెందాడు. ‘‘ఇదే సరైన విధానమని’’ బుద్ధుడు చెప్పాడు. సాధారణంగా మనం సమస్యల్లో కూరుకుపోయి, కారణం తెలియక, పరిష్కారాల కోసం వెతకడం ప్రారంభిస్తాం. అయితే దీనికన్నా ముందు మనం సమస్యల మూలాన్ని గ్రహించాలి. వాటిని అర్థం చేసుకున్నప్పుడు, పరిష్కరించడం చాలా సులభమని బుద్ధుడు ఈ ఉదాహరణ ద్వారా లోకానికి తెలియజెప్పాడు. 

Updated Date - 2021-11-16T13:38:02+05:30 IST