బుద్ధ వచనం... ఉక్కు కవచం

ABN , First Publish Date - 2020-07-31T04:49:25+05:30 IST

మనిషిని అతని వ్యక్తిగత శీలం తప్ప మరెవ్వరూ కాపాడలేరనే పరమ సత్యాన్ని ఈ ప్రపంచానికి కరోనా చూపిస్తోంది.

బుద్ధ వచనం... ఉక్కు కవచం

మనిషిని అతని వ్యక్తిగత శీలం తప్ప మరెవ్వరూ కాపాడలేరనే పరమ సత్యాన్ని ఈ ప్రపంచానికి కరోనా చూపిస్తోంది. లాక్‌డౌన్‌ల వల్ల కరోనాను కట్టడి చేయలేమని తెలిశాక, ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలన్నీ చేతులు ఎత్తేశాయి. లాకులు వదిలేశాయి. ‘ఎవరో వస్తారని, ఏదో చేస్తారని ఎదురు చూసి మోపోకుమా’ అనే శ్రీశ్రీ గీతం మనల్ని వెన్నుతట్టి హెచ్చరిస్తోంది. నిజానికి ఈ గీత సందేశమే బౌద్ధం! విచ్చలవిడితనం ఉన్న సమాజానికి... ఆ విచ్చలవిడితనంతో తనను తాను దుఃఖసాగరంలో ముంచేసుకుంటున్న సమాజానికి మొట్టమొదటిసారిగా బుద్ధుడు ఒక దివ్య ఔషధాన్ని అందించాడు. అదే వ్యక్తిని పరిపూర్ణుడిగా తీర్చిదిద్దే ‘పంచశీల’. 


జీవహింస చేయకపోవడం, అబద్ధాలు చెప్పకపోవడం, ఇతరుల వస్తువులను దొంగిలించకపోవడం, వ్యభిచరించకపోవడం, మత్తు పదార్థాలు సేవించకపోవడం - ఈ అయిదూ బుద్ధుడు చెప్పిన ‘పంచశీల’. వీటిలో అన్ని విషయాలూ సమాజంలో నైతికతను పెంచేవి మాత్రమే కాదు, మనిషి మానసిక ఆరోగ్యాన్ని కాపాడేవి కూడా!

సమాజం ఒప్పుకోని పనులను మనం చేసినప్పుడు, ఆ పని వల్ల మనకు వ్యక్తిగతంగా ఎంతో కొంత ఆర్థిక లాభం కలిగినా, అంతకుమించి మానసిక క్షోభ పెరుగుతుంది. అలాంటి పనులకు పాల్పడిన వ్యక్తి మనసు నిరంతరం సంఘర్షణకు లోనవుతుంది. ‘నేను చేసింది తప్పు, అది ఎవరికీ తెలియకూడదు’ అనే ఆలోచన వల్ల మనసు సంకుచితం అవుతుంది. దానిలోంచీ సంక్షోభం పుడుతుంది. మనసు బలహీనం అవుతుంది. ఆ ప్రభావం శరీరం మీద కూడా పడుతుంది. దానికి త్వరగా అలసట, వృద్ధాప్యం వస్తుంది. మానసిక సంక్షోభం వల్ల మనలో పుట్టకూడని రసాయనాలు పుట్టి, శరీరాన్ని శిథిలం చేస్తాయి. ‘పంచశీల’లో మొదటి నాలుగూ పాటిస్తే మనో దౌర్బల్యం నుంచి మనం బయటపడతాం. అప్పుడు కరోనా లాంటి ఉపద్రవాల నుంచి మనల్ని మనం సగం రక్షించుకున్నట్టే!


ఇక ‘పంచశీల’లో అయిదవది - ‘కల్లు, సారాయి లాంటి సురలు, గంజాయి, గుట్కాలాంటి మాదక ద్రవ్యాలు, చుట్టా, బీడీ, సిగరెట్‌ లాంటి పొగ తాగడాలు, జూదం లాంటి వ్యసనాలు కూడదు’ అని ఈ ప్రపంచంలో మొట్టమొదట చెప్పిన వ్యక్తి గౌతమ బుద్ధుడు. కొన్ని ధార్మికతల్లో భాగంగా ఇవి చెలామణి అవుతున్న కాలంలో ‘ఇవన్నీ దురలవాట్లే!’ అని ప్రకటించాడు. సమాజాన్ని ఈ అలవాట్ల నుంచి రక్షించాలని అహరహం శ్రమించాడు. ఇప్పటికీ ఆధ్యాత్మికత పేరిట సాగించే కొన్ని కార్యక్రమాల్లో మద్యం ఏరులై పారుతూనే ఉంది. అయితే సురాపానం ఆధ్యాత్మిక హక్కుగా కొనసాగే కాలంలో ‘అది తప్పు, అనైతికం’ అని చెప్పాడు బుద్ధుడు. నిజానికి ఈ దురలవాట్లు మనిషిని శారీరకంగా, ఆర్థికంగా కుంగదీస్తాయి. ఈ విషయం కరోనా కుండబద్దలు కొట్టి మరీ చెప్పింది. కరోనా వైరస్‌ సోకినవారందరూ మంచాన పడరు, మరణించరు. ఈ దురలవాట్లు ఉన్నవారు మాత్రం బతికి బట్టకట్టరు. 


‘పంచశీల’ను పాటిస్తే అది మనకు మానసిక శక్తినీ, శరీర దారుఢ్యాన్నీ ప్రసాదిస్తుంది. మంచి మనుషులుగా మనం బతుకుతాం. ఆ మంచితనమే కొండంత బలాన్నీ, ధైర్యాన్నీ ఇస్తుంది. ఆ ధైర్యం మన శరీరంలో విషరసాయనాలు ఉత్పత్తి అయినా శరీరం శిథిలం కాదు. మంచి ఆహారం తీసుకుంటూ, పంచశీలను పాటిస్తే కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోగలిగినట్టే! మనిషి కరోనాపై చేసే యుద్ధంలో ‘పంచశీల’పాలనే ఉక్కు కవచం! సదా శరణం బుద్ధ వచనం!! - బొర్రా గోవర్ధన్‌

Updated Date - 2020-07-31T04:49:25+05:30 IST