నిరుద్యోగులతో మాంసం అమ్మించడమా?: బుద్దా వెంకన్న

ABN , First Publish Date - 2021-09-12T18:30:46+05:30 IST

ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని...

నిరుద్యోగులతో మాంసం అమ్మించడమా?: బుద్దా వెంకన్న

విజయవాడ: ఉపాధ్యాయులతో మద్యం అమ్మించిన సీఎం జగన్మోహన్ రెడ్డి, తాజాగా నిరుద్యోగులతో మాంసం అమ్మించబోతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఉత్తరాంధ్ర ప్రాంత పార్టీ ఇన్ ఛార్జ్ బుద్దా వెంకన్న విమర్శించారు. డిగ్రీలు, పీజీలు చదివిన వారికి, తగిన ఉద్యోగాలు ఇవ్వలేని అసమర్థ ముఖ్యమంత్రి.. చివరకు వారికి మాంసం కొట్లలో కొలువులివ్వడానికి సిద్ధమయ్యారని ఆరోపించారు. మాంసం, చేపలు, రొయ్యలు అమ్మే బడుగు, బలహీనవర్గాల కడుపు కొట్టడానికే ముఖ్యమంత్రి ఈ కొత్త పథకానికి శ్రీకారం చుట్టారని విమర్శించారు. గతంలో ఇసుక అమ్మకాల పేరుతో 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారని, ఇప్పుడు మాంసం విక్రయాల పేరుతో లక్షల మందికి తిండిలేకుండా చేయబోతున్నారన్నారు.


జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మాంసం అమ్మడం మొదలెడితే, చెప్పిన ధరకే వినియోగదారుడు కొనాలని, లేకపోతే బెదిరించైనా మాంసాన్ని ప్రజలకు అంటగడతారని బుద్దా వెంకన్న అన్నారు. విజయసాయిరెడ్డి సలహాతోనే ముఖ్యమంత్రి మటన్ మార్టుల ఏర్పాటుకు సిద్ధమయ్యారనిపిస్తోందన్నారు. సీఎం, విజయసాయిరెడ్డిల ఆలోచనలన్నీ అంతిమంగా వారి ఖజానా నిండటానికే పనికొస్తాయి తప్ప, ప్రజలకు మేలుచేయవన్నారు. మాంసం అమ్మకాలు చేపట్టాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే బడుగు, బలహీనవర్గాల వారితో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతామని బుద్దా వెంకన్న స్పష్టం చేశారు.

Updated Date - 2021-09-12T18:30:46+05:30 IST