బడ్జెట్, భిన్నకోణాలు

ABN , First Publish Date - 2021-02-02T08:29:52+05:30 IST

బడ్జెట్ ప్రతిపాదనలకు స్టాక్ మార్కెట్ పరవశించిందంటే, కార్పొరేట్, సంపన్న శ్రేణులకు, ఆర్థిక రంగ ప్రాబల్య శక్తులకు అది ఆమోదయోగ్యంగా...

బడ్జెట్, భిన్నకోణాలు

బడ్జెట్ ప్రతిపాదనలకు స్టాక్ మార్కెట్ పరవశించిందంటే, కార్పొరేట్, సంపన్న శ్రేణులకు, ఆర్థిక రంగ ప్రాబల్య శక్తులకు అది ఆమోదయోగ్యంగా ఉన్నదని భావించవచ్చు. ప్రాథమిక సదుపాయాల కల్పన రంగంలో అధిక పెట్టుబడులను వాగ్దానం చేసిన కేంద్ర ప్రభుత్వం, జనరంజకంగా వ్యవహరించే ప్రయత్నం ఏ విషయంలోనూ చేయలేదు. ప్రస్తుత కేంద్రప్రభుత్వానికి అభిమానులు పెద్దసంఖ్యలో ఉండే మధ్యతరగతికి పన్ను రాయితీలు ఏవీ దక్కలేదు. పైగా, అనేక నిత్యావసరాలకు ఇక ముందు ఎక్కువ ఖర్చు పెట్టవలసివచ్చే దీర్ఘకాలిక చర్యలు  నివురు కప్పిన నిప్పులాగా ప్రతిపాదనల వెనక దాగి ఉన్నాయి. ఇక బీమా సంస్థల్లో విదేశీపెట్టుబడి శాతాన్ని పెంచడం, జీవితబీమా సంస్థ ప్రైవేటీకరణకు నాంది పలకడం, రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులలో పెట్టుబడుల ఉపసంహరణ, చమురు కంపెనీల అమ్మకం ఉధృతం చేయడం-...ఇటువంటివన్నీ కొందరికి ఆనందంగా ఉంటే, దేశీయతను, స్వావలంబనను ఇష్టపడేవారికి బాధాకరంగా ఉండే నిర్ణయాలు.


ఈ ఏటి బడ్జెట్ నేపథ్యం తెలిసిందే. 2020 సంవత్సరం మార్చి నుంచి, ప్రపంచ స్థితిగతులే మారిపోయాయి. భారత్ కూడా కొన్ని నెలల పాటు స్తంభించిపోయింది. వ్యవసాయం మినహా అనేక ఆర్థిక, ఉత్పాదక రంగాలు నిలిచిపోవడమో, నామమాత్రపు నడకలు నడవడమో జరిగింది. కోట్లాది మంది శ్రామికులు పట్టణాలను వదిలి స్వస్థలాలకు ప్రయాణమయ్యారు. ఉపాధి సంక్షోభం, ఆర్థికస్తబ్దత పర్యవసానాలు ఇంకా అనుభవిస్తూనే ఉన్నాము. జనజీవనరంగాలు పూర్తిస్థాయికి పునరుద్ధరణ జరగనేలేదు. ఇంకా ప్రపంచంలోని అనేక దేశాలు కరోనావైరస్ ఉధృతిలో సతమతమవుతున్నాయి. ఈ పరిస్థితుల మధ్య కొత్త బడ్జెట్ సహజంగానే, ఆరోగ్యరంగం మీద, ఆర్థికరంగ పునరుజ్జీవం మీద దృష్టి కేంద్రీకరించింది. మౌలిక సదుపాయాల కల్పన రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహింపజేయడం, నిర్మాణాది రంగాల పరిశ్రమలను స్వస్థ పరుస్తుంది. ఆరోగ్యరంగానికి అదనపు పెట్టుబడులు ప్రస్తుతం కొనసాగుతున్న టీకా కార్యక్రమానికి మాత్రమే కాక, వైద్యసేవల వ్యవస్థలను మెరుగుపరచడానికి కూడా అవసరం. 


కేంద్రబడ్జెట్‌ను జాతీయదృక్పథంతో చూడాలి తప్ప, సంకుచిత విమర్శ చేయకూడదని అనుకూల మేధావులు వ్యాఖ్యానిస్తున్నారు. కానీ, కళ్లెదురుగా కనిపిస్తున్న లోపాలను, పాక్షికతను ఎట్లా విస్మరించగలం? రెండు తెలుగు రాష్ట్రాలకు కొత్త బడ్జెట్ ఏమీ ఒరగబెట్టలేదని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కేంద్రం అంటే ఉభయ అధికారపార్టీలకు ఉన్న జడుపు జ్వరం కారణంగా, సన్నాయి నొక్కులే తప్ప సమరశంఖారావాలు ఏవీ వినిపించవు. ఒక అంతర్ రాష్ట్ర పారిశ్రామిక కారిడార్‌ను ప్రకటించారు కానీ, దానివల్ల ఆంధ్రప్రదేశ్‌కు పెద్ద ప్రయోజనం ఏమీ సమకూరదని అంటున్నారు. ఇక తెలంగాణకు ఆ మాత్రం కూడా ఉన్నట్టు లేదు. కేంద్రప్రభుత్వం దృష్టి అంతా త్వరలో ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల మీదనే ఉన్నది. 


అయితే, ఏ బడ్జెట్ కూడా దాని రూపకర్తలు చెప్పినట్టు మాత్రమే ఉండదు. ప్రభుత్వాలు కొన్ని అంశాలలో తమ ఉద్దేశ్యాలను, లక్ష్యాలను ప్రకటించుకుంటాయి, మరికొన్నిటిలో మరుగుపరుస్తాయి. అంకెల గారడీలు, అసత్యాలేమోననిపించే మారేడుకాయ లెక్కలు బడ్జెట్‌లలో ఉండడం కొత్తేమీ కాదు. పైగా నరేంద్రమోదీ ప్రభుత్వం గత ఆరేళ్లుగా, ఎటువంటి శషభిషలు లేకుండా, తమ అసలు ఉద్దేశ్యాలను ఏమంతగా కప్పిపుచ్చుకోకుండానే బడ్జెట్‌లను సమర్పించింది. తమకున్న జనామోదం స్థాయిని బట్టి దేనికీ వెనుకాడనక్కరలేదన్నది ప్రభుత్వం ఉద్దేశ్యం కావచ్చు. తాజా బడ్జెట్ కూడా కొన్నిటిని భూతద్దంలో చూపింది. కొన్ని పక్షపాతాలను దాచుకోలేదు. కొన్ని కేటాయింపుల కోతలను పట్టికలు, గణాంకాల వెనుక మరుగుపరిచింది. 


ఆరోగ్యరంగం మీద కేటాయింపులను విపరీతంగా పెంచినట్టు ఆర్థికమంత్రి చెప్పినది పూర్తి సత్యం కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. గత ఏడాది కంటె గణనీయంగానే పెంచారు, కానీ, ఆ పెంపు 137 శాతం కాదు. గత ఏడాది 94,452 కోట్లు ఆరోగ్యరంగానికి కేటాయించగా, ఈ ఏడు అది 2,23,846 కోట్లకు పెంచామని ఆర్థికమంత్రి చెప్పారు. ఆయుష్, తాగునీరు, పారిశుద్ధ్యం, పోషకాహారం -వంటి వాటికి చేసే కేటాయింపులను కూడా ఈ మధ్య ‘సమగ్రతా సరళి’ పేరుతో కలిపేసి, ఆరోగ్య కేటాయింపులను పెంచామంటున్నారు. అట్లాగే, ప్రధానమంత్రి స్వస్థ భారత్ యోజన పేరుతో చేస్తున్న కేటాయింపులు 64,180 కోట్లు ఆరేళ్ల కాలానికి వర్తించేవి. టీకా పంపిణీ కార్యక్రమానికి ఉద్దేశించిన 35 వేల కోట్ల కేటాయింపు కూడా ఈ రెండుంబావు లక్షల కోట్లలో ఉన్నది. ఈ కేటాయింపు ఈ ఒక్క ఏటికి అత్యవసర ప్రాతిపదిక మీద ఇస్తున్నది. ఇంతా చేసి ఆరోగ్యరంగానికి ఇస్తున్నది స్థూల జాతీయ ఉత్పత్తి విలువలో 0.35 మాత్రమేనట! ఆరోగ్యానికి పెంచారు కానీ, సంక్షేమానికి తగ్గించారు. విద్యారంగాన్నీ అరకొరగానే చూశారు. వ్యవసాయ ప్రాథమిక సదుపాయాల కల్పన సెస్ పేరుతో కొత్తగా ఒక సుంకాన్ని ప్రారంభించారు కానీ, వ్యవసాయానికి మాత్రం కేటాయింపులు తగ్గించారు. పెట్రోల్, డీజిల్, పండ్లు మొదలైన వాటి మీద ఈ సుంకాన్ని విధించారు కానీ, వెంటనే ఆ భారం అనుభవంలోకి రాకుండా, ఎక్సైజ్ సుంకాల సర్దుబాటు చేశారు. కాని, తరువాతి విడతల్లో ఆ సెస్సు ప్రత్యేకంగా తెలిసివస్తుంది. అట్లాగే, గ్రామీణ ఉపాధి పథకానికి ఇచ్చిన కేటాయింపు గత ఏడాది కంటె అధికంగా కనిపిస్తుంది కానీ, గత ఆర్థిక సంవత్సరంలో వాస్తవంగా వ్యయమైనదాని కంటె కొత్త కేటాయింపు బాగా తక్కువ. గ్రామాలకు తరలిన శ్రామికులు ఇంకా పెద్దసంఖ్యలో అక్కడే ఉన్నప్పుడు, వారికి మరి కొంతకాలం ఉపాధి కల్పించడం బాధ్యత. కోవిడ్ 19 ఫలితంగా ఉత్పన్నమయిన సంక్షోభానికి బాధితులు అట్టడుగు వర్గాలలోనే అధికంగా ఉన్నారు. కానీ, ప్రభుత్వ దృష్టి మాత్రం కార్పొరేట్, సంపన్న వర్గాలు మాత్రమే బాధితులు అన్నట్టుగా కనిపిస్తున్నది. 


తమిళనాడులో, బెంగాల్‌లో, అస్సాంలో రోడ్లకు, ఇతర ప్రాథమిక వ్యవస్థలకు చేసిన కేటాయింపులు చూసినప్పుడు, వాటి అంతరార్థం ఏమిటో సులువుగానే తెలిసిపోతోంది. 2015 బిహార్ ఎన్నికలకు ముందు లక్షా ఇరవై అయిదువేల కోట్ల ప్యాకేజి ఒకటి ప్రధాని ప్రకటించారు. అయినా, అప్పుడు గెలవలేదు. మధ్యలో జరిగిన పరిణామాలతో అధికారం ఎన్‌డిఎ చేతికి వచ్చింది. 2020 ఎన్నికలలో కూడా అదే కూటమి గెలిచింది. ఇప్పటికీ, ఆ ప్యాకేజి వాస్తవరూపం ధరించింది లేదు. ఇప్పుడు ఎన్నికలకు పోతున్న రాష్ట్రాలకు ఇస్తున్న ప్రాజెక్టుల భవిష్యత్తు ఏమిటో వేచి చూడాలి. 

Updated Date - 2021-02-02T08:29:52+05:30 IST