గొప్పల, అప్పుల, నిష్ఫల బడ్జెట్

ABN , First Publish Date - 2020-06-24T05:56:54+05:30 IST

అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమగ్ర ప్రణాళికా లేదు. దారీతెన్నూ తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. రెండో బడ్జెట్‌లో కూడా మాకు అభివృద్ధి అవసరం లేదు ఓట్లు చాలు కోట్లు పోయినా ఫర్వాలేదని తేల్చేసింది వైసీపీ ప్రభుత్వం...

గొప్పల, అప్పుల, నిష్ఫల బడ్జెట్

ఆర్థిక నిర్వహణలో వైఫల్యాల వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోవడమే కాకుండా, సమాజంలో పేదరికం నిర్మూలనకు దోహదపడే ఆస్తుల కల్పనకు విఘాతం కలుగుతుంది. ఈ ద్రవ్య లోటుల కారణంగా ఆర్థిక మద్దతు కోసం, మార్కెట్ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యతతో చూడకుండా కేవలం ఓట్ల కోసం అభివృద్ధిని అటకెక్కించారు. దీని వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఆచరణాత్మక మైన, ఆచరణయోగ్యమైన బడ్జెట్ కాదు ఇది.


గత ఏడాది ఆర్థిక పరిస్థితి కొంత సజావుగా ఉన్నప్పుడే ఆశించిన ఆదాయం రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. ఆర్థిక సంక్షోభం వల్ల గత ఏడాది కేంద్ర పన్నుల నుండి, గ్రాంట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాష్ట్రానికి రాదు. రాష్ట్ర సొంత పన్నుల నుండి కూడా ఆశించిన ఆదాయం పొందడం సాధ్యం కాదు. 


అభివృద్ధికి ప్రభుత్వం వద్ద ఎటువంటి సమగ్ర ప్రణాళికా లేదు. దారీతెన్నూ తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతుంది. రెండో బడ్జెట్‌లో కూడా మాకు అభివృద్ధి అవసరం లేదు ఓట్లు చాలు కోట్లు పోయినా ఫర్వాలేదని తేల్చేసింది వైసీపీ ప్రభుత్వం. ఈ బడ్జెట్ వైసీపీ నాయకుల, కార్యకర్తల ప్రాధాన్యతలకు అనుగుణంగా వుంది తప్ప ప్రజల ప్రాధాన్యతలకు అనుగుణంగా లేదు. సంక్షేమ పథకాలు కూడా దగా చేసేవే తప్ప సుస్థిర సంక్షేమాన్ని అందించేవి కావు. సంపద సృష్టించే సమగ్రాభివృద్ధిని గాలికి వదిలేసి రాష్ట్రాన్ని ఎలా ముందుకు నడిపిస్తారో ప్రభుత్వమే చెప్పాలి. సంక్షేమ పథకాలు సామాన్యులకు కొంత ఉపశమనాన్ని కల్పిస్తాయి. కానీ అవి మాత్రమే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో మౌలిక మార్పులు తీసుకు రాలేవు. వైసీపీ ప్రభుత్వం 2020–-2021 ఆర్థిక సంవత్సరానికి రెండవ బడ్జెట్టును రూ.2.24లక్షల కోట్లతో ప్రవేశపెట్టింది. 2019–-20 సవరించిన బడ్జెట్ కంటే ఈ ఏడాది బడ్జెట్‌కి రూ.50 వేల కోట్లు అదనంగా వస్తుందని అంచనా. కానీ వాస్తవ పరిస్థితికి అనుగుణంగా ఈ అంచనాలు లేవు. గత ఏడాది ఆర్థిక పరిస్థితి కొంత సజావుగా వున్నప్పుడే ఆశించిన ఆదాయం రాలేదు. ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తీవ్ర సంక్షోభంలోకి నెట్టబడింది. జనజీవనం పూర్తిగా స్తంభించింది. 2020–-2021 బడ్జెట్‍లో అంకెలన్నీ నేల విడిచి సాము చేసినట్లుగా ఉన్నాయి. వాటికి ఎటువంటి వాస్తవిక ప్రాతిపదిక లేదు. ఆర్థిక సంక్షోభం వల్ల గత ఏడాది కేంద్ర పన్నుల నుండి, గ్రాంట్ల నుండి వచ్చిన ఆదాయం కూడా ఈ ఏడాది రాష్ట్రానికి రాదు. రాష్ట్ర సొంత పన్నుల నుండి కూడా ఆశించిన ఆదాయం పొందడం సాధ్యం కాదు. గత ఏడాది కేంద్రం నుండి వచ్చే గ్రాంట్ ఇన్ ఎయిడ్ కింద అవాస్తవాలు చెప్పారు. ఈ పద్దు కింద రూ.61వేలకోట్లు వస్తాయని అంచనా వేశారు. కానీ వచ్చింది మాత్రం రూ.21,875 కోట్లు మాత్రమే. ఈ బడ్జెట్టులో కేంద్రం నుండి గ్రాంటు నిధులు రూ.53,175కోట్లు వస్తాయని ఆశలు కల్పించారు. 


గత ఏడాది కరోనా లేకపోయినా బడ్జెట్ ఖర్చుపెట్టలేకపోయింది ప్రభుత్వం. ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాల కోసం రూ.42,000 కోట్లు ఖర్చు, కొన్ని బిల్లులు చెల్లింపులు మినహా రాష్ట్ర అభివృద్ధికి గత బడ్జెట్టులో ఖర్చు చేసింది ఏమీ లేదు. అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పనకు 2019–-20లో తెలుగుదేశం ప్రభుత్వం రూ.19,976 కోట్లు ఖర్చు చేయగా ఇదే పద్దు కింద వైసీపీ ప్రభుత్వం మొదటి ఏడాది పెట్టిన ఖర్చు రూ.12,845 కోట్లు మాత్రమే. అవి కూడా గత ప్రభుత్వం హయాంలో విదేశీ ఋణ సౌకర్యంతో ప్రారంభమైనవి, పురోగతిలో ఉన్న ప్రాజెక్టులే వున్నాయి. గత ఏడాదిలో ఒక్క కొత్త ప్రాజెక్టు కూడా ప్రభుత్వం చేపట్టలేదు. సొంతంగా ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు. ఈ ఏడాది కూడా మూల ధనం వ్యయం కింద రూ.29,907కోట్లు ఖర్చుచేస్తామంటూ భారీ అంచనాలు చూపించారు. గత ఏడాది వ్యవసాయ రంగానికి రూ.12,341 కోట్లు; విద్యా రంగానికి రూ.128,840కోట్లు; వైద్యానికి రూ.7,408 కోట్లు; గృహనిర్మాణానికి రూ.2,654 కోట్లు; సాగు నీటి రంగానికి రూ.7,794 కోట్లు; గ్రామీణాభివృద్ధికి రూ.19,909 కోట్లు; రోడ్లు రవాణాకు రూ.3,159కోట్లు కోత పెట్టారు. ఈ ఏడాది కేటాయింపుల్లోనూ భారీగా కోతలు పడనున్నాయి. ఈ బడ్జెట్టులో కీలక రంగాలను విస్మరించింది ప్రభుత్వం. వ్యవసాయం, సాగునీరు, పరిశ్రమలు, విద్య, మౌలిక రంగాలకు బడ్జెట్‍లో కోతలు పెట్టారు. ఆర్థికాభివృద్ధికై రాష్ట్ర ప్రభుత్వానికి దీర్ఘకాలిక విజన్ అంటూ లేదు. ఏదో ప్రజలు అధికారం ఇచ్చారు, గుడ్డి ఎద్దు చేలో మేసినట్లు పరిపాలన చేస్తున్నారు. ప్రభుత్వం తీరులో బాధ్యత, ప్రజా దృక్పథం కనపడటం లేదు.


జగన్ ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల్లో దారుణంగా విఫలమైంది. ఆర్థిక పురోగతిలో, ద్రవ్య నిర్వహణలో తిరోగమనం. రెండంకెల వృద్ధి నుంచి 8.16%కు దిగజారిందని ప్రభుత్వ లెక్కలే చెప్పాయి. వాస్తవంగా చూస్తే అందులో సగమే వృద్ధిరేటు వుంటుంది. పైగా ఆర్థిక మంత్రి గత ప్రభుత్వం సాధించిన వృద్ధి రేటును విమర్శించడం విడ్డూరంగా వుంది. దురుద్దేశ పూర్వకంగానే సోషియో ఎకనామిక్ సర్వే లెక్కలన్నీ తప్పుల తడకలని చూపినట్లు అర్థం అవుతుంది. రిజర్వు బ్యాంకు అంచనాల ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలపై ఎక్కువ మొత్తం ఖర్చు పెట్టే రాష్ట్రాల్లో 2018-–2019 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ మొదటి మూడు స్థానాల్లో నిలిచింది. విభజన హామీలు అమలు కాకపోయినా ఆంధ్రప్రదేశ్ మడమ తిప్పలేదు. గత ప్రభుత్వం ఏ ప్రాజెక్టునూ ఆపలేదు. వినూత్న విధానాలతో ఆదాయ వనరులను పెంచుకుంది. ఆర్థిక క్రమశిక్షణ పాటించింది. అప్పులు తెచ్చి సంపదసృష్టికి ఖర్చుపెట్టింది. దుబారా అరికట్టింది.


కానీ వైసీపీ ప్రభుత్వం హయాంలో రెవెన్యూ రాబడులు పడిపోయి, వ్యయం పెరిగిపోయింది. కేపిటల్ ఎక్స్‌పెండిచర్ మూడింటా రెండు వంతులు కోతపెట్టి, ద్రవ్యలోటును అమాంతం పెంచేశారు. అభివృద్ధిపథంలో దూసుకుపోతున్న రాష్ట్రాన్ని అప్పులాంధ్రప్రదేశ్‌గా మార్చారు. రెవెన్యూ రాబడులు 2019–-2020లో 37.9% పడిపోయాయి. రూ.67,826 కోట్లు తగ్గిపోయాయి. రెవిన్యూ వ్యయం 6.96% పెరిగిపోయింది. రూ.8,949కోట్లు రెవిన్యూ వ్యయం పెరిగింది. కేపిటల్ ఎక్స్‌పెండిచర్ (మూలధన వ్యయం) 35% పడిపోయింది. రూ.7,131కోట్లు మూలధన వ్యయం పడిపోవడం ప్రభుత్వం దారుణ వైఫల్యం అనే చెప్పుకోవాలి. 2019-–20లో మొత్తం బడ్జెట్ వ్యయం 6.6% (రూ.10,798కోట్లు) పడిపోవడం ఆందోళనకరం. తెలుగుదేశం హయాంలో ఐదేళ్ళలో సగటున మొత్తం బడ్జెట్ వ్యయం 100% చేయడం జరిగింది. ఈ ఏడాదిలోనే కేపిటల్ ఎక్స్‌పెండిచర్ 35% తగ్గిపోవడం చేతగానితనమే. కేపిటల్ ఎక్స్‌పెండిచర్ 35% పడిపోయిందంటే, గత ఏడాదిగా రాష్ట్రంలో వైసీపీ చేసిన అభివృద్ధి నిల్ అనేది రూఢీ అయ్యింది. రెవిన్యూ డెఫిసిట్ 91% (రూ.12,748కోట్లు) పెరిగిపోయింది. అనుత్పాదక వ్యయానికి చేసిన అత్యధిక ఖర్చుల వల్లే రెవిన్యూ డెఫిసిట్ పెరిగిపోయింది. ద్రవ్యలోటు 14% (రూ.5,053కోట్లు) పెరిగిపోయింది. వడ్డీ చెల్లింపులు + ప్రజారుణం రీపేమెంట్ 20.9% (రూ.5,501కోట్లు) పెరిగిపోయింది.


బహిరంగ మార్కెట్‍లో అప్పులు ఒక్క ఏడాదిలోనే 72.6% (రూ.25,243కోట్లు) పెంచేశారు. హాఫ్ బడ్జెట్ బారోయింగ్స్ దీనికి అదనం. ఏడాదికి రూ.60వేల కోట్ల అప్పుల చొప్పున పెరిగితే, 2023-24నాటికి మొత్తం అప్పులు రూ.3,02,202కోట్ల నుంచి రూ.6,50,000 కోట్లకు పెరగనున్నాయి. రాబోయే ఐదు ఏళ్లలో అదనంగా రూ.3,47,790కోట్లకు (115%) రుణభారం పెరగనుంది. అంటే ఈ రుణాలపై వడ్డీ చెల్లింపుల భారం కూడా ఏడాదికి రూ.34వేలకోట్ల చొప్పున పెరగనుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాబోయే ఐదు ఏళ్లలో (2019–-24) మొత్తం అప్పులపై వడ్డీ చెల్లింపులకే రూ.1,60,000కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. 1956నుంచి ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత మొత్తం 64ఏళ్ల చరిత్రలో చేసిన అప్పులు రూ.3లక్షల కోట్లు ఉంటే, రాబోయే ఐదు ఏళ్లలోనే రూ.మూడున్నర లక్షల కోట్ల అప్పులు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. 64ఏళ్లలో ఏడాదికి సగటున అప్పుల భారం రూ.5వేల కోట్లు ఉంటే, ఈ ఒక్క ఏడాదే వైసీపీ ప్రభుత్వం రూ.60వేల కోట్ల పైబడి అప్పులు చేశారంటే ఏ స్థాయిలో రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకు పోబోతుందో అర్థం అవుతుంది. జిఎస్‌డిపిలో అప్పుల నిష్పత్తిని 27% నుంచి 34.5%కు పెంచేశారు. వ్యవసాయరంగాన్ని సంక్షోభం నుండి బైట పడవేసే చర్యలు లేవు. నీటిపారుదల ప్రాజెక్టులపై 2018-19లో రూ.14వేల కోట్లు టీడీపీ ప్రభుత్వం ఖర్చుపెడితే, గత ఏడాది రూ4వేల కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. వ్యవసాయానికి పెట్టిన రూ.29వేల కోట్ల బడ్జెట్ కూడా అంకెల గారడీయే తప్ప వ్యవసాయానికి ప్రత్యేకంగా నిధులు పెంచిందేమీ లేదు. నరేగా నిధులు, విపత్తు నిధి, స్థిరీకరణ నిధి, విద్యుత్ సబ్సిడీ అన్నింటినీ వ్యవసాయ బడ్జెట్‍లో కలిపేశారు. పారిశ్రామికీకరణను దారుణంగా నిర్లక్ష్యం చేశారు. పెట్టుబడుల వ్యతిరేక వాతావరణం రాష్ట్రంలో కల్పించారు. దీనితో యువత ఉపాధి కోల్పోయింది, నిరుద్యోగం పెరిగిపోతోంది. ‘హోదా తెస్తాను పెద్ద ఎత్తున ఉద్యోగాలు వస్తాయ’ని ఎన్నికల్లో నిరుద్యోగ యువతని నమ్మించి ఓట్లు వేయించుకొని వారి గొంతు కోశారు. ప్రభుత్వానికి రెవిన్యూ లేకుండా పోయింది. రహదారులు, ప్రాజెక్టులు లేవు. గత ఏడాది సబ్ ప్లాన్ నిధుల్లో సగానికి పైగా ఖర్చు చేయలేదు. అందరికీ కలిపి ఇచ్చే సంక్షేమ పథకాల నిధులనే సబ్ ప్లానుల్లో చూపి ఈ ఏడాది బడ్జెట్టులో బిసి, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం మైనారిటీలను మోసం చేశారు. సబ్ ప్లాన్ నిధుల లక్ష్యం ఆయా వర్గాల జనావాసాల్లో అభివృద్ధి పనులు చేపట్టడం, మౌలిక వసతులు కల్పించడం, అదనపు సంక్షేమం అందించడం. అలాంటిది సబ్ ప్లాన్ లక్ష్యాన్నే వైసీపీ నాయకులు దొంగదెబ్బ తీశారు. పేదల కోసం తెలుగు దేశం ప్రభుత్వం తెచ్చిన 34 పథకాలను రద్దు చేసి సంక్షేమానికి తూట్లు పొడిచారు. అప్పులు చేసినా సంపద సృష్టించగలిగితే తప్పులేదు. సంపద సృష్టించి అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా పనిచేసింది తెలుగుదేశం ప్రభుత్వం. పోలవరం, రాజధాని అమరావతి నిర్మాణం వంటి భారీ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చెయ్యడానికి కృషి చేసింది తెలుగుదేశం ప్రభుత్వం.


 ఏది ఏమైనా ఆర్థిక నిర్వహణలో ఈ విధమైన వైఫల్యాల వల్ల భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోవడమే కాకుండా, సమాజంలో పేదరికం నిర్మూలనకు దోహదపడే ఆస్తుల కల్పనకు విఘాతం కలుగుతుంది. అంతేగాక, ఈ ద్రవ్య లోటుల కారణంగా ఆర్థిక మద్దతు కోసం, మార్కెట్ అప్పుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించి దారిలో పెట్టాల్సిన బాధ్యత కేంద్రంపై వుంది. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతుల్యతతో చూడకుండా కేవలం ఓట్ల కోసం అభివృద్ధిని అటకెక్కించారు. దీని వల్ల రాబోయే రోజుల్లో రాష్ట్రం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది. ఇది ఆచరణాత్మకమైన, ఆచరణ యోగ్యమైన బడ్జెట్ కాదు. గొప్పల, అప్పుల, నిష్పల బడ్జెట్ అని చెప్పక తప్పదు.


యనమల రామకృష్ణుడు

ప్రధాన ప్రతిపక్ష నేత, శాసన మండలి

Updated Date - 2020-06-24T05:56:54+05:30 IST