నిర్మలమ్మ బడ్జెట్‌.. నిరాశాజనకం

ABN , First Publish Date - 2021-02-02T06:11:32+05:30 IST

బడ్జెట్‌లో అమరావతి రాజధానికి సాయం అందించాలన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది.

నిర్మలమ్మ బడ్జెట్‌.. నిరాశాజనకం

కనీస ప్రస్తావనకు రాని ప్రాజెక్టులు

అమరావతి రాజధానికి మొండిచెయ్యి


లోక్‌సభలో సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ జిల్లా ప్రజలను నిరాశకు గురిచేసింది. జిల్లాకు మేలు చేసే ఒక్క ప్రాజెక్టు కూడా బడ్జెట్‌లో ప్రస్తావనకు నోచుకోలేదు. అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే, అమరావతి రాజధాని నూతన రైలుమార్గం, అమరావతి మెట్రోరైల్‌, జలరవాణా, నిజాంపట్నం ఫిష్షింగ్‌ హార్బర్‌ వంటివి ఏవీ బడ్జెట్‌ ప్రసంగంలో లేకుండా పోయాయి. అమరావతి రాజధాని నిర్మాణానికి నిధుల కేటాయింపు కూడా జరపలేదు. ప్రతిపాదించిన రెండు ఫ్రైట్‌ కారిడార్‌లు విజయవాడ వరకే పరిమితం చేశారు. కనీసం వాటిల్లో ఒక్కటి జిల్లా వరకు పొడిగించినా కొంత మేలు జరిగేది. బడ్జెట్‌ జిల్లాకు ఏ కోణంలో నుంచి చూసినా ఎలాంటి మేలు చేయదని రాజకీయ నాయకులు తెలిపారు.


గుంటూరు, ఫిబ్రవరి 1 (ఆంధ్రజ్యోతి): బడ్జెట్‌లో అమరావతి రాజధానికి సాయం అందించాలన్న విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దేశ వ్యాప్తంగా కొత్త ఎక్స్‌ప్రెస్‌ హైవేలు, మెట్రో రైల్‌ ప్రాజెక్టులకు నిధులు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం గతంలో మంజూరు చేసిన అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేకి మొండిచెయ్యి చూపించారు. అమరావతి మెట్రో రైల్‌ ప్రాజెక్టుకి చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. విభజన ఆంధ్రప్రదేశ్‌ని అన్ని విధాల ఆదుకొంటామని, అలానే ఢిల్లీ కంటే మిన్నగా అమరావతి రాజధానిని నిర్మిస్తామని ప్రధానమంత్రి మోదీ చేసిన వాగ్దానాన్ని ఆర్థిక మంత్రి పూర్తిగా విస్మరించారు. అమరావతి రాజధాని ఇక్కడే ఉంటుందని పదేపదే చెప్పే బీజేపీ నాయకులు అందుకు ఊతమిచ్చేలా కనీసం ఒక్క ప్రాజెక్టుని కూడా ఈ ప్రాంతానికి ప్రకటింప చేయలేకపోయారు. 2023 డిసెంబరు కల్లా బ్రాడ్‌గేజ్‌ రైలుమార్గంలో విద్యుద్దీకరణ పూర్తి చేస్తామనడం వల్ల   ప్రస్తుతం నిర్మాణదశలో ఉన్న తెనాలి - రేపల్లె లైన్‌ పూర్తి కావడానికి మార్గం సుగమమైంది. కొత్తగా ఏడు టెక్స్‌టైల్‌ పార్కులు ఏర్పాటు చేస్తామన్న నేపథ్యంలో జిల్లాలో జౌళి రంగం మిత్ర ప్రాజెక్టుపై ఆశలు పెట్టుకొంటోన్నది.  

పింక్‌బుక్‌ వస్తే రైల్వేకి నిధుల కేటాయింపుపై స్పష్టత


రైల్వే ప్రాజెక్టులకు ఈ ఏడాది బడ్జెట్‌లో ఎంత మొత్తం నిధులు కేటాయించారనేది రెండు, మూడు రోజుల్లో తేలిపోనుంది. రైల్వేబోర్డు విడుదల చేసే పింక్‌బుక్‌లో గుంటూరు డివిజన్‌కి సంబంధించి నడికుడి - శ్రీకాళహస్తి నూతన రైలుమార్గం, అమరావతి కొత్త రైలుమార్గం, గుంటూరు - గుంతకల్లు, నల్లపాడు - పగిడిపల్లి డబ్లింగ్‌ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు తెలిపాయి. 

ఫ్రైట్‌ కారిడార్‌లు గుంటూరు వరకు పొడిగిస్తే మేలు


ఖరగ్‌పూర్‌ - విజయవాడ, ఇటార్సి - విజయవాడ మధ్య రెండు ఫ్రైట్‌ కారిడార్లను కేంద్ర ఆర్థిక మంత్రి ప్రతిపాదించారు. వాటి వల్ల సరుకు రవాణా రంగం లాభపడుతుంది. గుంటూరు పరిసరాల్లో పత్తి, జొన్న, మిర్చి, సిమెంట్‌ ఉత్పత్తులు ఇతర ప్రాంతాలకు రవాణా జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో రెండు ఫ్రైట్‌ కారిడార్లలో కనీసం ఒకదానిని అయినా గుంటూరు వరకు పొడిగించేలా జిల్లా ఎంపీలు డిమాండ్‌ చేయాలని ఇక్కడి వర్తకులు కోరుతున్నారు. 

Updated Date - 2021-02-02T06:11:32+05:30 IST