మట్టి మింగేస్తున్నారు!

ABN , First Publish Date - 2021-05-19T07:04:32+05:30 IST

బుడమేరు ఆధునీకరణ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి. కరకట్టల పటిష్టతకు ఉపయోగించాల్సిన మట్టి అక్రమంగా బయటకు తరలిపోతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో సదరు కాంట్రాక్టర్‌ యథేచ్ఛగా మట్టిని బయటి వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు

మట్టి మింగేస్తున్నారు!
తరిగొప్పల వద్ద బుడమేరు నుంచి మట్టి తరలింపు

  బుడమేరు ఆధునీకరణ పనుల్లో కాంట్రాక్టర్‌ కక్కుర్తి

మట్టిని అమ్ముకుంటున్న వైనం 

ఉంగుటూరు, మే 18 :  బుడమేరు ఆధునీకరణ పనుల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయి.  కరకట్టల పటిష్టతకు ఉపయోగించాల్సిన మట్టి అక్రమంగా బయటకు తరలిపోతోంది. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరించడంతో సదరు కాంట్రాక్టర్‌ యథేచ్ఛగా మట్టిని బయటి వ్యక్తులకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నాడు. బుడమేరు ముంపు నుంచి పంట భూములను కాపాడేందుకు,  29,600క్యూసెక్కుల నీటి నిల్వ సామర్ధ్యాన్ని పెంచి సుమారు లక్ష ఎకరాల ఆయకట్టును స్థిరీకరించేందుకు గత ప్రభుత్వం నాలుగేళ ్లక్రితం ప్రణాళికలు రూపొందించి బుడమేరు ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది సుమారు రూ.80కోట్ల వ్యయంతో బుడమేరు వెడల్పు, లోతు పెంచటంతో పాటు రెండు వైపులావున్న గట్లను మెరక చేసి పటిష్టపరిచే పనులను వేగవంతం చేసింది. ఇందులోభాగంగా రైతుల నుంచి సుమారు 600 ఎకరాల భూమి  సేకరించి పరిహారం సొమ్మును నేరుగా రైతుల బ్యాంకుఖాతాల్లో జమచేసింది. అనంతరం ప్రభుత్వం మారటంతో తరిగొప్పల, తరిగొప్పల కండ్రిక, వేంపాడు, వెల్దిపాడు, ఎలుకపాడు తదితర గ్రామాల రైతులకు పరిహారం అందటంలో తీవ్రజాప్యం జరిగింది. గన్నవరం ఎమ్మెల్యే వంశీ చొరవతో ఇటీవల వారికి కూడా పరిహారం అందింది.  తరిగొప్పల గ్రామంలో బుడమేరు ఆధునీకరణ మిగులు పనులు కొనసాగుతున్నాయి. బుడమేటిలోని మట్టిని కరకట్టల పటిష్టతకు వినియోగించకుండా కాంట్రాక్టర్‌ కాసులకు కక్కుర్తిపడి పరిసర గ్రామాలకు తరలిస్తుండడంతో  గ్రామస్ధులు, రైతులు మండిపడుతున్నారు. దీనిపై సైట్‌ ఇంజనీర్‌ నరే్‌షని  వివరణ కోరగా,  మట్టి రెండువైపులా గట్లు పటిష్టపరిచేందుకే పూర్తిస్ధాయిలో వినియోగిస్తున్నామన్నారు. మరో రెండు రోజుల్లో  మిగులు పనులు పూర్తయిపోతాయన్న తరుణంలో ఇద్దరు ట్రాక్టర్ల డ్రైవర్లు తనకు తెలియకుండా పక్క గ్రామానికి రెండు ట్రక్కుల మట్టిని తరలిస్తుండగా చూసి ఆపామని చెప్పారు.  వీఆర్‌వో రామారావుని వివరణ కోరగా బయటకు మట్టి తోలుతున్నారన్న సమాచారం అందిన వెంటనే సదరు మట్టితోలకాన్ని నిలుపుదల చేయించామని, మట్టి బయటకు తోలేందుకు వీల్లేదని కాంట్రాక్టర్‌ని హెచ్చరించామని తెలిపారు.  

Updated Date - 2021-05-19T07:04:32+05:30 IST