Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొత్త పంచాయతీలకు భవనాలెన్నడో?

సంస్థాన్‌నారాయణపురం మండలం కడపగండి తండాలో అద్దె గుడిసెలో కొనసాగుతున్న పంచాయతీ కార్యాలయం

మూడేళ్లు దాటినా అద్దె భవనాలే దిక్కు

చెట్ల కిందనే పాలకవర్గ సమావేశాలు


చౌటుప్పల్‌: గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం నూతన పంచాయతీరాజ్‌ చట్టాన్ని అమలులోకి తెచ్చింది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామా లు, డంపింగ్‌యార్డులు నిర్మించింది. పల్లె ప్రగతి కింద చేపట్టిన పనులతో గ్రామాల రూపురేఖలు ఇప్పుడిప్పుడే కొంతమేర మారుతున్నాయి. అయితే కొత్త పంచాయతీలకు పాలనాపర నిర్ణయాలు తీసుకునేందుకు సరైన వేదిక లేదు. కొన్ని పంచాయతీల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, మరికొన్ని చెట్లకిందే పాలకవర్గ సమావేశాలునిర్వహిస్తున్నాయి. 


ఉమ్మడి జిల్లాలో మొత్తం 1740 గ్రామపంచాయతీలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో 421, నల్లగొండ జిల్లాలో 844, సూర్యాపేట జిల్లాల్లో 475 పంచాయతీలు ఉన్నాయి. అందులో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 561 కొత్త పంచాయతీలు ఉన్నాయి.కొత్త పంచాయతీలతో కలిపి ఉమ్మడి జిల్లాలో మొత్తం 673పంచాయతీలు ప్రస్తుతం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. యాదాద్రి జిల్లాలో 67 కొత్త గ్రామపంచాయతీలు ఏర్పాటయ్యాయి. ఇక్కడ 84పంచాయతీలకు సొంత భవనాలు లేవు. నల్లగొండ జిల్లాలో 342 కొత్త పంచాయతీలు ఏర్పాటుకాగా, 349 పంచాయతీలు అద్దెభవనాల్లో కొనసాగుతున్నాయి. సూర్యాపేటజిల్లాలో 152 కొత్త పం చాయతీలు ఏర్పాటు కాగా, 210పంచాయతీలకు సొంత భవనాలు లేవు.


మూడేళ్లుగా అద్దె భవనాల్లోనే ..

ప్రభుత్వం 2018 ఆగస్టు 2న ఉమ్మడి జిల్లాలో కొత్త గ్రామపంచాయతీలను ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గిరిజనతండాలు గూడేలను కలిపి 561 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యా యి. ఇవి ఏర్పడి మూడేళ్లయినా పక్కా భవనాలు నిర్మించలేదు. దీంతో అద్దె భవనాలు, ఇరుకైన గదుల్లో పంచాయతీలు కాలం వెళ్లదీస్తున్నాయి. కొత్తగా ఏర్పాటైన పంచాయతీల్లో రూ.20లక్షలతో నూతన భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు ప్రభుత్వంవద్దే మూలుగుతున్నాయి. మూడేళ్లుగా ఈ ఫైలు ముందుకు కదలడం లేదు. దీంతో నూతన పంచాయతీలకు సొంత భవనం కలగానే మిగిలింది.


చెట్ల కిందే పాలకవర్గ సమావేశాలు 

నూతన పంచాయతీలు అద్దె భవనాల్లో కొనసాగుతుండగా, ఇరుకు గదులు కావడం, సమావేశాలకు ప్రత్యేక గది లేకపోవడంతో కొన్నిచోట్ల పాలకవర్గ సమావేశాలు ఆరుబయట చెట్ల కిందే నిర్వహిస్తున్నారు. చాలా పంచాయతీలు పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో ఒకే గదిలో కొనసాగుతున్నాయి. పాలకవర్గ సమావేశానికి స్థలం సరిపోక సభ్యులు ఏదో ఒక ప్రాంతంలో కూర్చొని సమావేశాన్ని మమా అనిపిస్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి నూతన గ్రామపంచాయతీల్లో సొంత భవనాలు నిర్మించాలని సర్పంచ్‌లు కోరుతున్నారు.


సొంత భవనం లేక ఇబ్బందులు: భానోత్‌ విజయ, పల్లగుట్టతండా సర్పంచ్‌

ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయడం మంచి పరిణామమే. అయితే పంచాయతీలు ఏర్పడి మూడేళ్లవుతున్నా నేటికీ సొంత భవనాలు కరువయ్యాయి. అద్దె భవనాల్లో కార్యకలాపాలు నిర్వహించాల్సి వస్తోంది. అద్దె భవనాల్లో కనీస సౌకర్యాలు లేక పాలకవర్గ సమావేశాన్ని ఆరు బయట చెట్ల కింద నిర్వహిస్తున్నాం. అంతేగాక సొంత భవనం లేక పాలనకు ఆటంకం కలుగుతోంది. ప్రభుత్వం వెంటనే పక్కా భవనాలు నిర్మించాలి.


Advertisement
Advertisement