పొలాల్లో భవనాశి వ్యర్థాలు

ABN , First Publish Date - 2020-09-18T11:22:11+05:30 IST

పట్టణ శివార్లలో భవనాశి నదీ పరిసర పంట పొలాల్లో వ్యర్థాలు చేరాయి. వరదలకు పంట దెబ్బతినడంతో పాటు ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తాచెదారం పొలాల్లో పేరు

పొలాల్లో భవనాశి వ్యర్థాలు

వరదలకు కొట్టుకొచ్చిన చెత్త

మున్సిపల్‌ అధికారులపై రైతుల ఆగ్రహం


ఆత్మకూరు, సెప్టెంబరు 17: పట్టణ శివార్లలో భవనాశి నదీ పరిసర పంట పొలాల్లో వ్యర్థాలు చేరాయి. వరదలకు పంట దెబ్బతినడంతో పాటు ప్లాస్టిక్‌ కవర్లు, చెత్తాచెదారం పొలాల్లో పేరుకుపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఆత్మకూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి. పట్టణంలోని లోతట్టు కాలనీలన్ని జలమయం అయ్యాయి. భవనాశి నది, పడేవాగు ఉప్పొంగి ప్రవహించాయి.


మున్సిపాలిటీకి డంపింగ్‌ యార్డు లేకపోవడంతో పట్టణంలో సేకరించిన చెత్తని వాగులు, వంకల్లో వేస్తూ వచ్చారు. ఆరు నెలల క్రితం మున్సిపల్‌ అధికారులు ట్రాక్టర్ల ద్వారా చెత్తను భవనాశిలో డంపింగ్‌ చేశారు. ఇప్పుడు అదే చెత్త వరద నీటిలో పొలాల్లోకి కొట్టుకొచ్చింది. మున్సిపల్‌ అధికారుల అనాలోచి నిర్ణయాల వల్ల తమ పంటలు దెబ్బతింటున్నాయని రైతులు మండిపడుతున్నారు. పంటలో చేరిన వ్యర్థాలను తొలగించడం కష్టంగా ఉందని, మున్సిపల్‌ అధికారులు సహకరించాలని కోరుతున్నారు. భవనాశి ఒడ్డున ఉన్న వ్యర్థాలను కూడా తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నారు. 


అనాలోచిత నిర్ణయాలతోనే..

మున్సిపల్‌ అధికారుల అనాలోచిత నిర్ణయాలతోనే భవనాశి పరిసర పొలాల్లోకి వ్యర్థాలు చేరాయి. బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు నదిలో చెత్త డంపింగ్‌ చేశారు. నది ఒడ్డున పేరుకుపోయిన వ్యర్థాలను తొలగించి నదిని ప్రక్షాళన చేయాలి. పొలాల్లోకి చేరిన వ్యర్థాలను తొలగించేందుకు మున్సిపల్‌ అధికారులు రైతులకు సహకారం అందించాలి.

                                         శివరామకృష్ణ, భవనాశి పరిరక్షణ సమితి                                                             సమన్వయకర్త, ఆత్మకూరు

Updated Date - 2020-09-18T11:22:11+05:30 IST