నిర్మించారు.. వదిలేశారు !

ABN , First Publish Date - 2021-10-25T05:02:48+05:30 IST

పేద విద్యార్థులకు విద్యతోపాటు వసతి కల్పించాలన్న

నిర్మించారు.. వదిలేశారు !
శిథిలావస్థలో మొయినాబాద్‌ వసతిగృహం

  • మొయినాబాద్‌లో నిరుపయోగంగా బీసీ బాలికల వసతి గృహం..
  • పెద్దమంగళారంలోని ఎస్సీ బాలుర వసతి గృహానిది ఇదే పరిస్థితి..
  • ఇలాగైతే విద్యార్థులకు వసతి ఎలా?


మొయినాబాద్‌ రూరల్‌: పేద విద్యార్థులకు విద్యతోపాటు వసతి కల్పించాలన్న తలం పుతో నిర్మించిన వసతి గృహాలు వృథాగా దర్శనమిస్తున్నాయి. అధికారుల ముందుచూపు లేని కారణంగా ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనాలు నిరుపయోగంగా మారాయి. దీంతో ఈ భవనాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. స్థానిక ప్రజా ప్రతినిధులు వీటి వైపు కన్నెత్తి కూడా చూడకపోవడంతో అవి కలహీనంగా మిగిలాయి. అధికారులు అద్దె భవనాలపై చూపుతున్న ప్రేమ సొంత వాటిపై చూపడం లేదు. 

మొయినాబాద్‌ మండల కేంద్రంలో బీసీ బాలికల వసతిగృహం మొదట అద్దెభవనంలో కొనసాగేది. పదేళ్ల క్రితం సురంగల్‌ వెళ్లే దారిలో ఎకరం స్థలంలో రూ.39 లక్షలతో నిర్మించారు. కానీ అక్కడికి విద్యార్థులు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. 6సంవత్సరాల క్రితం కేవలం నలుగురు విద్యార్థినులు మిగలడంతో.. అధికారులు నజీబ్‌ నగర్‌లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయానికి తరలించారు. దీంతో ప్రభుత్వ వసతిగృహం భవనం వృథాగా మారింది. ప్రస్తుతం ఆ భవనం శిథిలావస్థకు చేరింది. పెద్దమంగళారం రెవెన్యూ పరిధిలోని ఎస్సీ బాలుర వసతి గృహానిది ఇదే పరిస్థితి. ఐదేళ్ల క్రితం మూతపడటంతో ఆ భవనాన్ని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు అప్పగించగా భవనం సరిపోవడం లేదని ప్రైవేటు భవనంలోకి మార్చారు. దీంతో భవనం వృథాగా మారింది. 


ఇదో వింత పరిస్థితి.. 

మండలంలోని హిమాయత్‌నగర్‌లో 16ఏళ్ల క్రితం ప్రాథమిక పాఠశాలలో మూడు అదనపు గదుల నిర్మాణానికి రూ.10లక్షలు మంజూరయ్యాయి. గదులను పాఠశాలకు దూరంగా నిర్మించడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆ గదులను ఉపయోగించుకోలేని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం వీటిని దివ్యాంగ విద్యార్థుల కోసం ఉపయోగిస్తున్నారు. మిగిలిన గదులు వృథాగా ఉన్నాయి. సురంగల్‌లోనూ పదేళ్లక్రితం రూ.5లక్షలతో అంగన్‌ వాడీ భవనాన్ని నిర్మించగా.. గ్రామానికి దూరంగా నిర్మించడంతో ఉపయోగించడం లేదు. పెద్దమంగళారం, ఆమ్డాపూర్‌, చందానగర్‌, రెడ్డిపల్లి, కాశీంబౌళీ, శ్రీరాంనగర్‌, నాగిరెడ్డిగూడ, నక్కలపల్లి, తోలుకట్ట, కేతిరెడ్డిపల్లి, చిన్నషాపుర్‌, అప్పారెడ్డిగూడ, గ్రామాల్లో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో శిథిలావస్థకు చేరిన గదుల్లో తరగతులు కొనసాగుతున్నాయి. పెద్దమంగళారం ప్రభుత్వ పాఠశాలలో విద్యా ర్థులకు అనుగుణంగా తరగతిగదులు లేకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. 


ప్రభుత్వ నిధులను వృథా చేస్తున్నారు..

మొయినాబాద్‌ మండలంలో అధికారుల ముందుచూపు చొరవ లేకపోవడంతో కోట్ల రూపాయల ప్రభుత్వ నిధు లను వృథా చేస్తున్నారు. అవరమున్న చోట ఖర్చు చేయ కుండా తమకు ఇష్టంవచ్చినట్లు వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ సొమ్ము వృథాగా పోతోంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి వెంటనే వసతిగృహాలు, పాఠశాలల్లోని తరగతి గదులను అందు బాటులోకి తీసుకువచ్చి విద్యార్థులకు ఇబ్బందులు లేకుండా చూడాలి. 

- ఎల్గని వెంకటేష్‌ గౌడ్‌, ఓబీసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు



Updated Date - 2021-10-25T05:02:48+05:30 IST