శిథిలావస్థలో భవనాలు

ABN , First Publish Date - 2020-12-03T06:10:38+05:30 IST

శిథిలావస్థలో భవనాలు

శిథిలావస్థలో భవనాలు
పెచ్చులూడుతున్న పాఠశాల భవనం పైకప్పు

జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌నర్సాపూర్‌లో శిథిలావస్థకు చేరుకున్న పాఠశాల భవనాలు

 ఉరుస్తున్న గ్రామ పంచాయతీ భవనం

 ఇబ్బందులు పడుతున్న ప్రజలు, విద్యార్థులు


జగదేవ్‌పూర్‌, డిసెంబరు 2 : కరోనా వల్ల ఇంతకాలం పాఠశాలలు తెరుచుకోలేదు. ఇప్పుడిప్పుడే కొవిడ్‌ తగ్గుతున్న క్రమంలో పాఠశాలలు తిరిగి పున:ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే కొన్ని పాఠశాలలు శిథిలావస్థకు చేరుకున్నాయి. చిన్నపాటి వర్షానికి కూడా ఉరుస్తున్నాయి. మరికొన్ని కూలేదశకు చేరుకున్నాయి. ప్రస్తుతం తరగతులు కొనసాగడం లేదు కాబట్టి పాఠశాల భవనాలకు మరమ్మతులు చేయడం, కూలగొట్టి పున:నిర్మించే అవకాశం ఉన్నా కూడా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఒక్క పాఠశాలలనే కాదు ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామ పంచాయతీ కార్యాలయాల శిథిలావస్థకు చేరినా కూడా ఎవరూ పట్టించుకోవడం లేదు. జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌నర్సాపూర్‌ గ్రామ ప్రాఽథమిక పాఠశాల భవనం శిథిలావస్థకు చేరింది. అలాగే గ్రామపంచాయతీ భవనం కూడా కూలేందుకు సిద్ధంగా ఉంది. 

జగదేవ్‌పూర్‌ మండలం తిగుల్‌నర్సాపూర్‌ మండలానికి సరిహద్దు గ్రామం. గ్రామసమీపంలో తెలంగాణ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కొండపోచమ్మ ఆలయం ఉండడంతో గ్రామానికి పేరు ప్రత్యేకతలున్నాయి. ఊరు చిన్నదైనా చరిత్ర గల గ్రామంగా పేరు గాంచింది. ప్రజాప్రతినిధులు, ప్రజలు కూర్చునే గ్రామపంచాయతీ భవనం, పిల్లలు చదువుకునే పాఠశాల భవనం బాగాలేక అటు గ్రామస్థులు, ఇటు విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం లో 2, 3 దశాబ్దాల క్రితం పాఠశాల భవనం, గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించారు. ప్రస్తుతం ఆ భవనాలు కూలేస్థాయికి చేరుకుని ప్రమాదకరంగా మారాయి. 


 ప్రమాదకరంగా పాఠశాల భవనాలు

గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 40 మంది పిల్లలు విద్యను అభ్యసిస్తున్నారు. మొదట్లో ఒకటే భవనం ఉండడంతో పిల్లలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఐదు తరగతులు ఒకే గదిలో నిర్వహించేవారు. గత ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో మ రో భవనాన్ని నిర్మించారు. పిల్లలకు భవనాల కొరత లేకుండాపోయింది. ఏళ్ల క్రితం భవనాలు నిర్మించడంతో ప్రస్తుతం భవనం పైకప్పు పెచ్చులూడి ప్రమాదకంగా మారింది. వర్షం వస్తే గోడలు తడిచి ఉరుస్తున్నాయని ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితంలేకుండాపోయిందని గ్రామస్థులు వాపోతున్నారు. రెండేళ్ల క్రితం సర్పంచ్‌ రజిత రమేష్‌ ఆధ్వర్యంలో మన ఊరు, మనబడి దిశ గా గ్రామానికి చెందిన ఐదో తరగతి పిల్లలంతా ప్రభుత్వపాఠశాలలో చేర్పించారు. పాఠశాల భవనాలు ప్రమాదకరంగా ఉండడంతో కొంతమంది పిల్లలు మళ్లీ తిరిగి ప్రయివేట్‌ పాఠశాల బాట పట్టారని గ్రామస్థులు చెబుతున్నారు. 


 శిథిలావస్థలో పంచాయతీ భవనం

25 ఏళ్ల క్రితం నిర్మించిన తిగుల్‌నర్సాపూర్‌ గ్రామపంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది. వానొస్తే రెండు గదులు కురుస్తున్నాయి. గోడలు బీటలు వారి పెచ్చులూడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త పంచాయతీలకు గ్రామపంచాయతీ భవనాలకు నిధులు ఇస్తున్నప్పటికీ పాత గ్రామ పంచాయతీ భవనాలను పట్టించుకోవడం లేదు. గ్రామస్థులు పలుమార్లు గడా ప్రత్యేకాధికారి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకపోయారు. అయినప్పటికీ నేటికి నూతన భవనం మంజూరు కాకపోవడంతో గ్రామప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి కొత్త గ్రామపంచాయతీ భవనానికి నిధులు మంజూరు చేయాలని కోరుతున్నారు.


కొత్త భవనాలు కట్టించాలి

- సత్యనారాయణ, ఎస్‌ఎంసీ చైర్మన్‌

మా ఊరి పాఠశాల భవనాలు పూర్తిగా శిథిలావస్థకు చేరాయి. రెండు గదు లు వానొస్తే ఉరుస్తున్నాయి. గోడలు బీటలు బారి ప్రమాదకరంగా మారా యి. ప్రహరీ కూలిపోయింది. అధికారులు స్పందించి కొత్త భవనాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి.



Updated Date - 2020-12-03T06:10:38+05:30 IST