బుల్లెట్‌ప్రూఫ్ పెయింట్.. ఒక్కసారి వేశామంటే!

ABN , First Publish Date - 2020-10-01T01:45:58+05:30 IST

కోడిగుడ్డు.. పొరబాటున మన చెయ్యిజారి కింద పడిందంటే టప్పున పగిలిపోతుంది. కానీ ఈ పెయింట్ వేస్తే బంతిలా ఎగిరిపడుతుంది.

బుల్లెట్‌ప్రూఫ్ పెయింట్.. ఒక్కసారి వేశామంటే!

సూరత్: కోడిగుడ్డు.. పొరబాటున మన చెయ్యిజారి కింద పడిందంటే టప్పున పగిలిపోతుంది. కానీ ఈ పెయింట్ వేస్తే బంతిలా ఎగిరిపడుతుంది. గుమ్మడికాయ.. దీనిపై ఓ కారును ఎక్కిస్తే పచ్చడైపోతుంది. కానీ ఈ పెయింట్ కోటింగ్ వేస్తే చెక్కు చెదరదు. ఇంకా గట్టిగా మాట్లాడితే సరైన మోతాదులో ఈ పెయింట్ వేస్తే తుపాకీ గుళ్లు, చిన్నసైజు బాంబులు కూడా మనల్నేం చేయలేవు.


ఇళ్లను, వస్తువులను అందంగా మార్చడానికి మనం చేసే పని.. రంగులేయడం. ఈ రంగులు సదరు వస్తువులకు అందాన్నివ్వడమే కాదు, మనసుకు ఆహ్లాదాన్ని కూడా ఇస్తాయి. మరి ఇలాంటి పెయింట్‌ను రక్షణకు ఎందుకు ఉపయోగించుకోకూడదు? అని ఆలోచన వచ్చిందో వ్యాపారికి. వెంటనే ఈ ఇండస్ట్రీలో తనకు తెలిసిన వారిని, యువకులను సంప్రదించాడు. అప్పుడే అతనికి తెలిసింది బుల్లెట్‌ప్రూఫ్ పెయింట్ గురించి.


బుల్లెట్‌ప్రూఫ్ పెయింట్‌ ఉంటుందని తెలుసుకున్న ఈ ఉత్తరప్రదేశ్‌ వ్యాపారికి కాలు నిలవలేదు. తను కూడా అలాంటి పెయింట్‌ టెక్నాలజీ ఉపయోగించాలని, కుదిరితే దాంతో వ్యాపారం చేయాలని డిసైడైపోయాడు. అంతే తండ్రితో విషయం చర్చించి ఈ పెయింట్ పరిశ్రమ ఏర్పాటుకు కావలసిన టెక్నాలజీని దిగుమతి చేసుకున్నాడు. సూరత్‌లో తన పరిశ్రమను స్థాపించాడు. దేశంలో ఈ రకం పెయింట్ అందించే తొలి పరిశ్రమ తమదేనని కంపెనీ యజమాని వకుల్ గోయల్ చెప్తున్నారు.


ఈ పెయింట్ ఏ ఉపరితలంపై అయినా చాలా త్వరగా అతుక్కుపోతుందని వకుల్ చెప్పారు. అలాగే 7-8 సెంటీమీటర్ల మందంగా పెయింట్ వేస్తే బుల్లెట్లు కూడా ఈ పెయింట్‌ను దాటి లోపలకు దిగలేవని వెల్లడించారు. ఈ మాట తాము చెప్పడం లేదని, అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో జరిగిన పరిశోధనల్లో తేలిందని వకుల్ తండ్రి వివరించారు. యూఎస్‌, యూకేలకు చెందిన ల్యాబులు ఈ పెయింట్ పనితనాన్ని ధ్రువీకరించాయని, ఈ మేరకు సర్టిఫికెట్ ఇవ్వడానికి కూడా ఆ ల్యాబులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు.


సాధారణ ప్రమాదాల నుంచి రక్షణ పొందడానికి 7-9 సెంటీమీటర్ల మందాన పెయింట్ వేస్తే సరిపోతుందన్న ఈ తండ్రీకొడుకులు.. బుల్లెట్‌ప్రూఫ్ కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొని పెయింట్ వేస్తామని చెప్పారు. దీన్ని అవసరమైతే ఆర్మీ, పోలీసు శాఖల్లో కూడా ఉపయోగించుకోవచ్చని, అధికారుల డ్రెస్సులపై పెయింట్ వేస్తే అవి బుల్లెట్‌ప్రూఫ్ అయిపోతాయని తెలిపారు. ఇలా చేస్తే ఆయా డిపార్టుమెంటుల్లో బుల్లెట్‌ప్రూఫ్ కోట్‌ల కొరత అనేదే ఉండదన్నారు. పెయింట్ పనితీరును చూపించేందుకు గుడ్డు, గుమ్మడికాయ, పుచ్చకాయ, ధర్మాకోల్‌ తదితర వస్తువులపై పెయింట్ వేసిమరీ చూపించారు.

Updated Date - 2020-10-01T01:45:58+05:30 IST