పసిడి పంచ్!

ABN , First Publish Date - 2020-08-06T07:14:22+05:30 IST

బంగారం, వెండి ధరలు మిడిసిపడుతున్నాయి. బుధవారం నాడు పసిడి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం మేలిమి (24క్యారెట్లు) బంగారం రూ.58,000కు...

పసిడి పంచ్!

  • బులియన్‌ మార్కెట్లో రికార్డుల మోత  
  • రూ.58 వేలకు చేరువలో తులం బంగారం   
  • రూ.70,000 ఎగువకు కిలో వెండి 
  • అంతర్జాతీయ మార్కెట్లో  2,000 డాలర్లు దాటిన ఔన్స్‌ గోల్డ్‌ 


న్యూఢిల్లీ/ముంబై/హైదరాబాద్‌: బంగారం, వెండి ధరలు మిడిసిపడుతున్నాయి. బుధవారం నాడు పసిడి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసుకుంది. హైదరాబాద్‌ మార్కెట్లో తులం మేలిమి (24క్యారెట్లు) బంగారం రూ.58,000కు చేరువైంది. ఒక్కరోజే రూ.1,010 పెరిగి రూ.57,820కి చేరుకుంది. 22 క్యారెట్ల రేటు రూ.930 పెరుగుదలతో రూ.53,010కి ఎగబాకింది. వెండి రేటు భారీగా పెరిగి రూ.70,000 మైలురాయిని దాటేసింది. ఒక్కరోజే రూ.6,450 ఎగబాకి రూ.71,500కు చేరుకుంది. అంతర్జాతీయంగా ధరల పెరుగుదలే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ కమోడిటీ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ తొలిసారిగా 2,000 డాలర్ల మార్క్‌ను అధిగమించింది. ఒక దశలో 2,060 డాలర్ల వద్ద ట్రేడైంది. ఔన్స్‌ వెండి రేటు 27.20 డాలర్ల వరకూ పెరిగింది.




ఏడాదిన్నరలో 3,000 డాలర్లకు గోల్డ్‌ 

బలహీనపడుతున్న డాలర్‌, ప్రపంచ ఆర్థిక వృద్ధి పుంజుకోవడంపై నెలకొన్న అనిశ్చితి, కరో నా నుంచి ఊరట కల్పించేందుకు అగ్రరాజ్యాలు ప్రకటిస్తున్న భారీ ఉద్దీపన ప్యాకేజీలు బులియ న్‌ ర్యాలీకి ఆజ్యం పోస్తున్నాయని కమోడిటీ విశ్లేషకులు అన్నారు. ధరల పెరుగుదల మున్ముం దూ కొనసాగనుందని, ఈనెలలో ఔన్స్‌ గోల్డ్‌ 2,150 డాలర్లు, వెండి 30 డాలర్లకు చేరుకోవచ్చని వారు భావిస్తున్నారు. వచ్చే 18 నెలల్లో ఔన్స్‌ గోల్డ్‌ 3,000 డాలర్ల మైలురాయికి చేరుకోవచ్చని బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా (బొఫా) గ్లోబల్‌ రీసెర్చ్‌ అంచనా వేసింది. 




ఈ ఏడాదిలో మదుపర్లకు బంగారం, వెండి అత్యధిక ప్రతిఫలాలు అందించాయి. ఇప్పటివరకు గోల్డ్‌ 40 శాతం, సిల్వర్‌ 50 శాతం రిటర్నులు పంచాయి. వీటి ధరల్లో అప్‌ట్రెండ్‌ మున్ముందూ కొనసాగవచ్చు. ఎందుకంటే, కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు మార్కెట్లో ద్రవ్య లభ్యతను అసాధారణ స్థాయిలో పెంచుతున్నాయి. అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, మరో విడత కరోనా వ్యాప్తి భయాలతో విలువైన ధరలు మరింత ఎగబాకనున్నాయి. 

- కిశోర్‌ నార్నే, మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ 

Updated Date - 2020-08-06T07:14:22+05:30 IST