మళ్లీ రిజిస్ట్రేషన్ల భారం... పన్ను పోటు!

ABN , First Publish Date - 2022-01-22T05:45:39+05:30 IST

ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం మరొకసారి రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచి ఏడాది గడవకముందే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా మరింత ఆదాయం రాబట్టేందుకు స్టాంప్‌ డ్యూటీని పెంచాలని నిర్ణయించడంతో ఆస్తుల విక్రయదారులు ఆందోళన చెందుతుండగా, ఈ ప్రభావం రియల్‌ఎస్టేట్‌ రంగంపై పడనుంది.

మళ్లీ రిజిస్ట్రేషన్ల భారం... పన్ను పోటు!

ఏడాదిలోపే మరొకసారి పెరగనున్న భూముల మార్కెట్‌ విలువ

25 శాతం నుంచి 50 శాతం మేర..

ఫిబ్రవరి మొదటి వారంలో అమలులోకి వచ్చే అవకాశం

రియల్టీపై ప్రభావం

నూతన మునిసిపాలిటీల్లో పెరుగునున్న ఇంటిపన్ను 

కసరత్తు చేస్తున్న అధికారులు


(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, నల్లగొండ): ఖజానాను నింపుకునేందుకు ప్రభుత్వం మరొకసారి రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచేందుకు సన్నాహాలు చేస్తోంది. రిజిస్ట్రేషన్‌ చార్జీలను పెంచి ఏడాది గడవకముందే స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ ద్వారా మరింత ఆదాయం రాబట్టేందుకు స్టాంప్‌ డ్యూటీని పెంచాలని నిర్ణయించడంతో ఆస్తుల విక్రయదారులు ఆందోళన చెందుతుండగా, ఈ ప్రభావం రియల్‌ఎస్టేట్‌ రంగంపై పడనుంది. రెండేళ్లుగా కరోనా, వరుస వర్షాలతో దెబ్బతిన్న పంటల కారణంగా రైతులు నష్టపోవడంతో అన్ని వ్యాపారాలతోపాటు రియల్‌ఎస్టేట్‌ రంగం సైతం ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఇప్పుడిప్పుడే ఈ రంగం కోలుకుంటుండగా, ప్రభుత్వ నిర్ణయంతో ఇబ్బందులు ఎదురుకానుండగా, సామాన్యుడు భూమి కొనుగోలుపై ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 15 సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో స్థిర, చరాస్థుల రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 71 మండలాల్లోని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి వెబ్‌సైట్‌ ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. భువనగిరి, బీబీనగర్‌, చండూరు, చౌటుప్పల్‌, దేవరకొండ, హుజూర్‌నగర్‌, కోదాడ, మిర్యాలగూడ, మోత్కూరు, నకిరేకల్‌, నల్లగొండ, నిడమనూరు, రామన్నపేట, సూర్యాపేట, గుట్ట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు మొత్తం 1000కి పైగా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయంలో వ్యవసాయ భూములకు సంబంధించి మూడు నుంచి నాలుగు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. మార్కెట్‌లో భూముల ధరలు పెరుగుతుండగా, ప్రభుత్వం స్టాంప్‌డ్యూటీని పెంచాలని నిర్ణయించింది.ఆరేళ్ల క్రితం 200 గజాలస్థలం రిజిస్ట్రేషన్‌కు రూ.30వేల వరకు స్టాంప్‌ డ్యూటీ ఉంది. గతఏడాదే రిజిస్ట్రేషన్‌ చార్జీలను ప్రభుత్వం పెంచగా, ఏడాది గడవకముందే మళ్లీ పెంచేందుకు నిర్ణయించింది.


కసరత్తు పూర్తి చేసిన సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు

ప్రభుత్వ ఆదేశాలకనుగుణంగా ఉమ్మడి జిల్లాలోని సబ్‌రిజిస్ట్రార్లు, తహసీల్దార్లు వారి పరిధిలోని భూముల విలువ, పెంచాల్సిన స్టాంప్‌డ్యూటీకి సంబంధించిన నివేదికను ఉన్నతాధికారులు అందజేశారు. ఆ వివరాలన్నీ ప్రభుత్వానికి ఇప్పటికే చేరాయి. పెరిగే రిజిస్ట్రేషన్‌ చార్జీలు ఫిబ్రవరి మొద టివారంలో అమలులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రాథమిక సమాచారం మేరకు వ్యవసాయ భూముల మార్కెట్‌ విలువ 50శాతం,ఖాళీ స్థలాల విలువ 35శాతం, అపార్ట్‌మెం ట్ల విలువ 25శాతం మేర పెరగనున్నాయి.దీంతో పాటు బ హిరంగ మార్కెట్‌లో భూమి రేట్లు భారీగా ఉన్నచోట అవసరమైన మేర సవరించే అవకాశం కల్పించినట్లు తెలిసింది.


ఏడాది గడవకముందే

వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తుల మార్కెట్‌ విలువల తో పాటు రిజిస్ట్రేషన్‌ చార్జీలు, స్టాంపు డ్యూటీని ప్రభుత్వం ఏడేళ్ల అనంతరం 2021లో పెంచింది. సుమారు 20శాతం మేర విలువలను సవరించింది. తాజాగా, మరోమారు విలు వ పెంపునకు నిర్ణయించి, ఈ నెల 20న రాష్ట్రస్థాయిలో రిజిస్ట్రేషన్‌శాఖ కీలక సమావేశం నిర్వహించి జిల్లా రిజిస్ట్రార్లకు దిశానిర్దేశం చేసింది. మార్కెట్‌ విలువలను ఏ మేరకు సవరించాలనే విషయంపై ఈ సమావేశంలో తుది కసరత్తు నిర్వహించారు. రెండు, మూడు రోజుల్లో ఈ ప్రతిపాదనల కు తుది రూపం ఇచ్చి ప్రభుత్వానికి నివేదించనున్నారు. ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వగానే కొత్త ధరలు అమలులోకి రానున్నాయి. గత ఏడాది వ్యవసాయ భూముల కనీస ధర ఎకరానికి రూ.75వేలుగా నిర్ణయించారు. ఖాళీ స్థలాల కనీసం ధర చదరపు గజానికి రూ.200, అపార్ట్‌మెంట్ల ధర చదరపు అడుగుకు కనీసం రూ.1000గా నిర్ణయించి 20 నుంచి 50శాతం మేర గతంలో ధర పెంచారు.


సామాన్యుడు భూమి కొనే పరిస్థితి లేదు : గుండెబోయిన వెంకన్న, రియల్టర్‌

కరోనాతో రెండేళ్లుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. రైతులు ఆర్థికంగా బాగుంటేనే భూముల క్రయ, విక్రయాలుంటాయి. రైతులు ఈఏడాది వ్యవసాయపరంగా నష్టాలు ఎదుర్కొన్నారు. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ల చార్జీలు పెంచితే మరింత భారం కానుంది.కోట్లల్లో పెట్టుబడులు పెట్టి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారికి ఇబ్బంది ఉండదు. కానీ, సామాన్యుడు భూమి కొనుక్కోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో రియల్‌ఎస్టేట్‌ రంగం పడిపోయే అవకాశం ఉంది.


సమాచారం ఇచ్చాం : బి. ప్రవీణ్‌కుమార్‌, ఉమ్మడి జిల్లా రిజిస్ట్రార్‌

ప్రభుత్వం ఆదేశాలకనుగుణంగా భూముల మార్కెట్‌ ధర విషయంపై సమాచారాన్ని అందజేశాం. మార్గదర్శకాల ఆదేశాల మేరకు జిల్లాలోని సబ్‌ రిజిస్టార్లకు సమాచారాన్ని బదిలీ చేశాం.పెరిగే మార్కెట్‌రేట్‌ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందో మాకు సమాచారం లేదు.


వీధిన పడటమే : ఎం.శ్యాంసుందర్‌, డాక్యుమెంట్‌ రైటర్‌, నల్లగొండ

రిజిస్ట్రేషన్‌ చార్జీలు తక్కువగా ఉంటే భూమి అమ్మకం, కొనుగోళ్లు ఉంటాయి. తక్కువ ధరకు భూమి దొరికినప్పుడు కొని రిజిస్ట్రేషన్‌ చేసుకుంటారు. రేటు రాగానే విక్రయిస్తారు. దీని ద్వారా డాక్యుమెంట్‌ రైటర్లకు ఉపాధి లభిస్తుంది. మాపై ఆధారపడి కంప్యూటర్‌ ఆపరేటర్‌, మరో ముగ్గురు ఉపా ధి పొందుతున్నారు. రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచితే భూ క్రయ, విక్రయాలు తగ్గుతాయి. 





చౌటుప్పల్‌ : కొత్త మునిసిపాలిటీల్లో త్వరలో ఆస్తిపన్ను పెంచేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. పన్నులు పెంచాలని మూడే ళ్ల తరువాత ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా కార్యాచరణ ప్రారంభమైంది. ఈ విధా నం అమలులోకి వస్తే ప్రజలపై పన్ను భారం పడనుండగా కొత్త మునిసిపాలిటీలకు భారీగా ఆదాయం పెరగనుంది.


గ్రామీణ అభివృద్ధిలో భాగంగా మేజర్‌ పంచాయతీలను సైతం పట్టణాలకు ధీటుగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వ సంకల్పించి మూడేళ్ల క్రితం కొత్త మునిసిపాలిటీలు ఏర్పాటు చేసింది. ఈ మునిసిపాలిటీల్లో పంచాయతీల తర హా పన్నుల వసూలు మూడేళ్ల వరకు ఉంటుందని స్పష్టం చేసింది. ఆ మేరకు గడువు పూర్తికావడంతో మునిసిపల్‌ నూతన చట్టం ప్రకారం ఇంటి పన్నులు పెరగనున్నాయి. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 19 మునిసిపాలిటీలు ఉన్నాయి. అందులో 13 మునిసిపాలిటీలు కొత్తవి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 201,136 నివాస గృహాలు ఉన్నాయి. యా దాద్రి జిల్లాలోని ఆరు మునిసిపాలిటీల్లో 39,683 గృహాలు ఉన్నాయి. చౌటుప్పల్‌లో 7488, ఆలేరులో 4571, భువనగిరి లో 14045, మోత్కూర్‌లో 4574, భూదాన్‌పోచంపల్లిలో 4553, యాదగిరిగుట్టలో 4452 నివాస గృహాలు ఉన్నాయి. నల్లగొండ జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపాలిటీల్లో 92, 987 నివాస గృహాలు ఉన్నాయి. చండూరు మునిసిపాలిటీ లో 3292, చిట్యాలలో 3183, దేవరకొండలో 6891, హాలియాలో 5113, మిర్యాలగూడలో 23,814, నకిరేకల్‌లో 8278, నల్లగొండలో 36,411, నందికొండలో 6000 నివాస గృహాలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో 68,466 నివాస గృహాలు ఉన్నాయి. అందులో హుజూర్‌నగర్‌లో 7084, కోదాడలో 15,305, సూర్యాపేటలో 31,402, తిరుమలగిరిలో 5252, నేరేడుచర్లలో 34,021 నివాస గృహాలు ఉన్నాయి. యాదాద్రి జిల్లాలో మొత్తం ఆరు మునిసిపాలిటీలు ఉండగా, అందులో భువనగిరి మినహా మిగతావన్నీ కొత్తవే. నల్లగొండ జిల్లాలో మొత్తం ఎనిమిది మునిసిపాలిటీల్లో నల్లగొండ, మిర్యాలగూడ మినహా ఆరు, సూర్యాపేట జిల్లాలోని ఐదింటిలో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌ మినహా రెండు కొత్త మునిసిపాలిటీలు.


మొదలైన కసరత్తు 

ప్రభుత్వం 2018 ఆగస్టులో కొత్త మునిసిపాలిటీలను ఏర్పాటు చేసింది. ఈ మునిసిపాలిటీల్లో సమీపంలోని గ్రామాలను విలీనం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటి వరకు కొత్త మునిసిపాలిటీలలో పంచాయతీల మాదిరిగా పన్నులు వసూలుచేశారు. కాగా, ప్రభుత్వం విధించిన మూడేళ్ల గడువు పూర్తికావడంతో పన్నుల పెంపునకు మునిసిపల్‌ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పన్నులు విలీన గ్రామాలకు సైతం వర్తిస్తాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా భువన్‌ యాప్‌ ద్వారా భవనాల కొలతలను జియో ట్యాగింగ్‌ చేశారు. ఆ కొలతల ఆధారంగా పన్నులు వసూలు చేయనున్నారు. దీంతో కొత్త మునిసిపాలిటీలకు భారీగా ఆదాయం సమకూరనుంది.


ఆదాయం రెండింతలు పెరిగే అవకాశం

ఆస్తి పన్నులు పంచాయతీలకు, మునిసిపాలిటీలకు వ్యత్యాసం ఉంటుంది. మునిసిపాలిటీల్లో పన్ను ఎక్కువగా ఉంటుంది. మురికివాడలు ఇతర ప్రాంతాల్లో సైతం వ్యత్యాసం ఉంటుంది. అందుకు కాలనీలను ప్రత్యేక జోన్లు వారీగా విభజిస్తారు. నిర్మాణాల ఆధారంగా ఆర్డినరీ, రేకుల షెడ్డు, పెంకుటిల్లు, వాణిజ్య సముదాయాలకు వేర్వేరుగా ధరలు నిర్ణయిస్తారు. ప్రస్తుతం విలీన గ్రామాల్లో ఇళ్లతోపాటు వాణిజ్య సముదాయాలు ఉన్నాయి. దీంతో పన్నుల రూపంలో మునిసిపాలిటీలకు ఆదాయం పెరగనుంది. మునిసిపాలిటీలో ఒక ఇంటి పన్ను రూ.1200 ఉంటే, కొత్త చట్టం ప్రకారం రూ.2,600 వరకు పెరిగే అవకాశం ఉంది.


ప్రభుత్వ ఆదేశాలు లేవు : కోమటిరెడ్డి నర్సింహారెడ్డి, చౌటుప్పల్‌ మునిసిపల్‌ కమిషనర్‌

నూతన మునిసిపాలిటీలు, విలీన గ్రామాల్లో ఆస్తి పన్ను పెంపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు. మునిసిపల్‌ నూతన చట్టం ప్రకారం మునిసిపాలిటీ ఏర్పడిన మూడేళ్ల తరువాత ఆస్తి పన్ను పెంచవచ్చని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. కొత్త మునిసిపాలిటీ ఏర్పడి మూడేళ్లు పూర్తయింది. ఇప్పటికే మునిసిపాలిటీ పరిధిలోని ఆస్తులను భువన్‌ యాప్‌ ద్వారా వివరాలు సేకరించాం. అయితే పన్ను పెంపునకు సంబంధించి ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవు.


Updated Date - 2022-01-22T05:45:39+05:30 IST