Madhya Pradesh: డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలు...లేఖలో ఏం రాశారంటే...

ABN , First Publish Date - 2021-10-11T13:47:13+05:30 IST

మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన దొంగతనం ఘటన జరిగింది...

Madhya Pradesh: డిప్యూటీ కలెక్టర్ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలు...లేఖలో ఏం రాశారంటే...

భోపాల్ (మధ్యప్రదేశ్): మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ విచిత్రమైన దొంగతనం ఘటన జరిగింది. సాక్షాత్తూ ఓ డిప్యూటీ కలెక్టరు ఇంట్లో చోరీకి వచ్చిన దొంగలు ఇంట్లో డబ్బులు లేకపోవడంతో ఇంటి యజమానికి లేఖ రాసిన ఘటన తాజాగా సంచలనం రేపింది. మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్ నుంచి 2.5 గంటల ప్రయాణంలో దేవాస్ సివిల్ లైన్స్ ప్రాంతంలో డిప్యూటీ కలెక్టర్ త్రిలోచన్ గౌర్ అధికారిక నివాసంలో చోరీ జరిగింది.‘‘ఇంట్లో డబ్బులు లేనట్లయితే, తాళం ఎందుకు వేశారు...అని ఇంటి యజమాని డిప్యూటీ కలెక్టరును ప్రశ్నిస్తూ దొంగలు లేఖ రాసి వదిలి వెళ్లారు.చోరీ జరిగిన డిప్యూటీ కలెక్టరు ఇల్లు దేవాస్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ప్రదీప్ సోని, జిల్లా పోలీసు సూరింటెండెంట్ నివాసాలకు కేవలం 100 మీటర్ల దూరంలో ఉంది. 


ఖతేగావ్ తహసీల్‌లో డిప్యూటీ కలెక్టరుగా పనిచేస్తున్న త్రిలోచన్ గౌర్ గత 20 రోజులుగా ఇంట్లో లేరు. ఊరి నుంచి వచ్చాక చూస్తే ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం, కొంత నగదు, వెండి ఆభరణాలు కనిపించకపోవడంతో త్రిలోచన్ గౌర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. త్రిలోచన్ గౌర్ ప్రభుత్వ నివాసం నుంచి దొంగలు రూ. 30,000 నగదు,కొన్ని ఆభరణాలు దొంగిలించారు.ఇంట్లో దొంగలు లేఖ వదిలివెళ్లారని, దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని  పోలీసు ఇన్‌స్పెక్టరు ఉమ్రావ్ సింగ్ చెప్పారు.


Updated Date - 2021-10-11T13:47:13+05:30 IST