Abn logo
Aug 14 2020 @ 10:03AM

శ్మశానవాటిక దారిలో తవ్వకాలు.. చర్యలు తీసుకోవాలంటూ విజ్ఞప్తి

చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల విజ్ఞప్తి


సరూర్‌నగర్‌, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి) : కొవిడ్‌తో మృతి చెందిన క్రిస్టియన్‌ మైనారిటీ వర్గాలకు చెందిన వారిని ఖననం చేయడానికి ప్రభుత్వం బాలాపూర్‌ మండలం కుర్మల్‌గూడలో తాత్కాలిక ప్రాతిపదికన ఎకరం స్థలం కేటాయించింది. ఆ స్థలంలోకి ఎవరూ వెళ్లకుండా కబ్జాదారులు, రియల్‌ వ్యాపారులు కలిసి రోడ్డుకు అడ్డంగా పెద్ద కాలువ తవ్వారు. దీనిపై క్రైస్తవ సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.


సర్వే నంబర్‌.80/3లో..

కుర్మల్‌గూడలో ఇప్పటికే ముస్లిం మైనారిటీల శ్మశానవాటికకు 42 ఎకరాల స్థలం ఉంది. ప్రస్తుతం ఆ వర్గానికి చెందిన కొవిడ్‌ మృతులను ఇక్కడ ఖననం చేస్తున్నారు. క్రైస్తవ సంఘాలు చేసిన విజ్ఞప్తి మేరకు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ నెల రోజుల క్రితం ఇక్కడి సర్వే నంబర్‌.80/3లో ఎకరం స్థలాన్ని ఖననం కోసం కేటాయించారు. హిందువుల కోసం మరో ఎకరం స్థలాన్ని కేటాయించారు. ఇటీవల బాలాపూర్‌ రెవెన్యూ అధికారులు సదరు స్థలాలకు హద్దులు నిర్ణయించి ఆయా వర్గాలకు అప్పగించారు.


వెళ్లే దారి లేక...

క్రిస్టియన్‌ వర్గానికి చెందిన ఓ కరోనా బాధితుడు బుధవారం ఈఎస్‌ఐ ఆస్పత్రిలో మరణించగా, కుర్మల్‌గూడలోని శ్మశానవాటికలో ఖననం చేయాలని క్రైస్తవ సంఘాలు భావించాయి. సంఘాల ప్రతినిధులు జెరూసలేం మత్తయ్య, విజయ్‌ అక్కడకు వెళ్లగా శ్మశానానికి వెళ్లే మార్గాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేసినట్టు కనిపించింది. శ్మశానవాటిక లోపల సైతం అడ్డదిడ్డంగా తవ్వకాలు జరిపారు. చేసేది లేక మృతదేహాన్ని దుండిగల్‌లోని మరో శ్మశానవాటికకు తరలించామని వారు చెప్పారు.


దుండగులపై చర్యలు తీసుకోవాలి..

ఈ చర్యలకు పాల్పడిన దుండగులపై కఠిన చర్యలు తీసుకోవాలని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జెరూసలేం మత్తయ్య, బి.విజయ్‌ డిమాండ్‌ చేశారు. ఈ మేరకు గురువారం బాలాపూర్‌ తహసీల్దార్‌, బడంగ్‌పేట్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌, మీర్‌పేట్‌, ఆదిభట్ల ఇన్‌స్పెక్టర్లు తదితరులకు ఫిర్యాదులు అందజేశారు. 


క్రిమినల్‌ కేసులు : తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి..

శ్మశానవాటిక వద్ద అడ్డంకులు సృష్టించిన దుండగులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయిస్తామని బాలాపూర్‌ తహసీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించడం తమ బాధ్యత అని, తగిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement