Abn logo
Oct 16 2021 @ 23:43PM

హై వోల్టేజీతో విద్యుత్‌ ఉపకరణాలు దగ్ధం

దగ్ధమైన ప్యానల్‌ బోర్డును పరిశీలిస్తున్న నాయకులు

భువనగిరి టౌన్‌, అక్టోబరు 16: విత్యుత్‌ సరఫరాలో ఏర్పడిన అవాంతరాలతో భువనగిరి మీనానగర్‌లో శనివారం పలుగృహాల్లో విద్యుత్‌ ఉపకరణాలు దగ్ధమయ్యాయి. అకస్మాత్తుగా సరఫరా అయిన హైవోల్టేజీతో వినియోగంలో ఉన్న ఫ్రిజ్‌లు, ఫ్యాన్లు, లైట్లు, టీవీలు కాలిపోయాయి. దీంతో పెద్దమొత్తంలో ఆస్తినష్టం సంభవించింది. రాత్రివేళ సంభవించిన ఈ ఘటనతో ప్రజలు భయకంపితులై రహదారులపైకి పరుగులుతీశారు. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో సిబ్బంది విద్యుత్‌ సరఫరాను నిలిపివేయడంతో పెనుప్రమాదం తప్పింది. బీజేపీ, కాంగ్రెస్‌ మునిసిపల్‌ ఫ్లోర్‌ లీడర్లు మాయ దశరథ, పోత్నక్‌ ప్రమోద్‌కుమార్‌, కౌన్సిలర్లు కైరంకొండ వెంకటేష్‌, ఈరపాక నర్సింహ, తదితరులు విద్యుత్‌ ప్రమాదం జరిగిన గృహాలను పరిశీలించి బాధితులకు ట్రాన్స్‌కో నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు.