Abn logo
Jan 14 2021 @ 02:50AM

బరి తెగింది

  • పందెంలో పండగ కోడే గెలిచింది
  • ఉదయం కొంతసేపు ఊగిసలాడినా..
  • సాయంత్రం నుంచి ఊగిన బరులు
  • కట్టడికి పోలీసుల ప్రయత్నాలు..
  • అయినా, ఎక్కడికక్కడ ఢీకొట్టిన కోళ్లు
  • రాష్ట్రమంతటా ‘కట్టలు’తెగిన పందేలు
  • ఒక్క తూర్పులోనే రూ.25 కోట్ల వసూలు
  • సొంతూళ్లలో ఎమ్మెల్యేల స్వీయ బరులు
  • కొన్నిచోట్ల వైసీపీ వేర్వేరు శిబిరాలు
  • మద్యం ఏరులు..జోరుగా గుండాట, పేకాట


‘కోడి’ కాలు దువ్వుతుందా? సంక్రాంతి బరులు తెగుతాయా? అసలు పందేలు జరుగుతాయా? అనే ఉత్కంఠను భోగి తీర్చేసింది. జరుగుతాయో లేదో అని ఉదయమంతా ఊగిసలాట! మధ్యాహ్నం నుంచి ఊపందుకొని సాయంత్రానికి కోడి పందేలు ఉర్రూతలూగించాయి. 

‘భోగి’ కోడి బరిలో రేగిపోయింది. పండగ తొలిరోజే కోట్లు కురిపించింది. 


(ఏలూరు, విజయవాడ, అమలాపురం- ఆంధ్రజ్యోతి): పోలీసులు మూడు వారాలపాటు ఊరూవాడా తిరిగి వార్నింగ్‌ ఇచ్చినా, బరులను ధ్వంసంచేసినా, వేలాది కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నా, అంతిమంగా పందెంలో పండుగ కోడి నిలిచింది. పోలీసులు, తహసీల్దార్ల భయంతో బరులను ఆలస్యంగా తెరిచినా, కోడి జోరు ఏ మాత్రం తగ్గలేదు. తెరిచిన ప్రతిచోటా కోడిపందాలే కాదు... గుండాట, పేకాట యథేచ్ఛగా జరిగాయి. ఒక్కో కోడిపందెం రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకు పలికింది. దాదాపు అన్ని బరుల వద్ద అధికార వైసీపీ నేతల హడావుడే కనిపించింది.


కొన్ని ప్రత్యేక గ్రామాల్లో కోడిపందాల బరులను ఎవరు నిర్వహించాలనే దానిపై వైసీపీ నేతల మధ్యే వివాదాలు రాజుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గం నారాయణపురంలో ఇద్దరు నేతలు విడివిడిగా కోడిపందాలు వేసేందుకు సిద్ధమవగా, ఒకరినే పోలీసులు అనుమతించారు. ఈ వ్యవహారం కాస్తా ఎమ్మెల్యే వరకు వెళ్లింది. ఉభయ గోదావరి జిల్లాల్లో అధికార నేతలు, ముఖ్య నాయకుల నుంచి ఫోన్లు రావడంతో పోలీసులు, అధికారులు చాలావరకు బరులకు దూరంగానే ఉండిపోయారు. ‘హైకోర్టు ఆదేశాల మేరకు కోడి పందేలు, పేకాట, గుండాటలు నిషేధించడమైంది’ అని పలుచోట్ల ఫ్లెక్సీలు కనిపించాయి. అయితే, ఆ ఫ్లెక్సీలు కట్టిన ప్రాంతంలోనే ఆ ఆటలను యథేచ్ఛగా నిర్వహింంచడం గమనార్హం. 

సరదా వేదికలపైనా దర్పమేనా!

పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో ఫత్తేపురంలో కోడిపందాలు సాగేవి. అయితే, వైసీపీకి చెందిన ఓ ప్రముఖ నేత అక్కడ కాదని మందలపర్రుకి బరిని మార్చారు. ఈ జిల్లాలో ఎమ్మెల్యేలు అనేకచోట్ల పందాల్లో పాలుపంచుకున్నారు. దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి సొంత గ్రామం కొండలరావుపాలెంలో జరిగిన పందేల్లో పాల్గొన్నారు. టీడీపీ ఎమ్మెల్యే రామరాజు డింకీ కోడిపందాలను (కత్తులు కట్టకుండా) బుధవారం నిర్వహించారు. నరసాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు సొంత గ్రామం కలగంపూడిలో ఆర్భాటంగా కోడిపందాలను నిర్వహించారు. మంత్రి ఆళ్లనాని, తానేటి వనిత ప్రాతినిథ్యం వహిస్తున్న ఏలూరు, కొవ్వూరు నియోజకవర్గాల్లో కోళ్లు సందడి చేశాయి. మంత్రి రంగనాథరాజు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆచంటలో బరులు తెగాయి. 


కోడి మస్తు.. భలే కిక్కు..

రూ.యాభై వేలు దగ్గర పందెం ఆరంభమైంది. రాత్రి పొద్దుపోయేనాటికి ఇది కాస్తా రూ.పది లక్షలకు చేరింది. దీనికి తోడు బరుల బయట పైపందాలు ఒక్కోదానికి పదిహేను లక్షల రూపాయల చొప్పున చేతులు మారాయి. 


ఒక అంచనా ప్రకారం పశ్చిమగోదావరి జిల్లాలోనే తొలినాడే రూ.20 కోట్లకుపైగా పందెం సాగింది. దీనికితోడు మద్యం ఏరులైపారింది.  చేలల్లో, తోటల్లో  మద్యం సేవించి పందేలలకు దిగారు. కొందరైతే ఎవరికి తెలియకుండా తోటల్లో ప్రత్యేకంగా వేసిన పేకాట డెన్లలోకి చేరారు. ఇక్కడ ఆడేవారందరికీ మద్యం, కోడిపకోడి ఫ్రీగా అందించారు. 


వెనుకబడ్డ భీమవరం.. 

కోడి పందెం చూడాలంటే.. భీమవరం పోవాల్సిందేనని పేరు! అలాంటిది భీమవరం ఈసారి బరిలో వెనుకబడింది. తొలిరోజు ఎక్కడా పందేలు జరగలేదు. 


‘తూర్పు’ ఊగింది..

తూర్పుగోదావరి జిల్లాలో 150కు పైగా జరిగిన పందెం బరుల్లో సుమారు రూ.25కోట్లు పైనే చేతులు మారినట్టు అంచనా. గుండాటల బోర్డులు సైతం ఎక్కడికక్కడ వందలసంఖ్యలో వెలిశాయి. కోడిపందేల కంటే గుండాటలకు యువత ఆకర్షితులై వేలకు వేలు పణంగా పెట్టి జూదక్రీడల్లో పాల్గొన్నారు. పందేల నిర్వాహకులపై కేసులు పెట్టేందుకు సమాయత్తమవుతున్న తహశీల్దార్లకు వైసీపీకి చెందిన కీలక మంత్రి నుంచి ఫోన్లు వెళ్లినట్టు చెబుతున్నారు. 


సీఐ కార్యాలయం వద్దే ‘కూత’!

తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గస్థాయిలోని వివిధ ప్రాంతాల్లో ప్రారంబించిన బరుల వద్ద ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హుషారుగా గడిపారు. అందులో ఒకదాన్ని రావులపాలెం సీఐ కార్యాలయానికి కూతవేటు దూరంలోనే ఏర్పాటుచేయడం గమనార్హం. ఈ బరి వద్ద ఎమ్మెల్యే జగ్గిరెడ్డి, ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్‌ పందేలను చూశారు. చాలా ప్రాంతాల్లో పోలీసులు స్టేషన్లకే పరిమితమయ్యారు. పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని రోజులుగా పోలీసులు పడిన కష్టం అంతా ఇంతా కాదు. యువతకు క్రీడలను నిర్వహించారు. క్రికెట్‌ టోర్నమెంట్లు పెట్టి పది రోజులపాటు తమ విధులను పక్కన బెట్టి తమ ఇంట్లో శుభకార్యంలా శ్రమించారు. వేలాది రూపాయలు టోర్నమెంటు బహుమతులు ఇప్పించారు. యువత అంతా కోడి పందేలకు దూరంగానే ఉందని భావించారు. కానీ వారి పడిన శ్రమకు ఫలితం లేకపోయింది. బుధవారం ఉదయం వరకూ పోలీసులు తమ ప్రయత్నాలు యథావిధిగానే కొనసాగించారు. అయితే, పై నుంచి ఆదేశాలు రావడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి. ఏలూరు రూరల్‌ సర్కిల్‌ పరిధిలో బుధవారం ఉదయం ఉంచి భారీ బరులతో కోడి పందేలు నిర్వహిస్తున్నారు. ఒక్కడుగు ముందుకేసి దెందులూరు నియోజకవర్గంలో మంగళవారం అర్ధరాత్రి నుంచే పందాలను ప్రారంభించేశారు. పోలీస్‌ స్టేషన్లలో రైటర్లు కొంతమంది వసూళ్లబాట పట్టారు.


కృష్ణాలో పెరిగిన బరులు

కృష్ణాజిల్లా వ్యాప్తంగా కోడి పుంజులు బస్తీ మే సవాల్‌ అంటూ బరుల్లోకి దిగాయి. బంటుమిల్లి, మచిలీపట్నం, కైకలూరు, కలిదిండి, గుడివాడ, నందివాడ, జగ్గయ్యపేట, వీరులపాడు, అంపాపురం ప్రాంతాల్లో బరులు తెరుచుకున్నాయి. గత ఏడాదికి మించి జిల్లాలో బరులు ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. విజయవాడ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో పెనమలూరు మండలం ఈడ్పుగల్లులో భారీస్థాయిలో కోడి పందాలు జరుగుతాయి. హనుమాన్‌ జంక్షన్‌ దాటిన తర్వాత ఉన్న అంపాపురంలో బరులు మినీ స్టేడియంను తలపిస్తున్నాయి. అన్ని కార్యకలాపాలపై కరోనా ప్రభావం పడినప్పటికీ కోడి పందాలపై మాత్రం అది ఉన్నట్టు కనిపించడం లేదు. పందాలపై బెట్టింగ్‌లు లక్షల్లో సాగాయి.

Advertisement
Advertisement
Advertisement