పలు రాష్ట్రల్లో బస్సు సర్వీసులు ప్రారంభం

ABN , First Publish Date - 2020-06-01T21:58:57+05:30 IST

దేశంలో 'అన్‌లాక్ 1' సోమవారం నుంచి ప్రారంభం కావడంతో పలు రాష్ట్రల్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు..

పలు రాష్ట్రల్లో బస్సు సర్వీసులు ప్రారంభం

లక్నో: దేశంలో 'అన్‌లాక్ 1' సోమవారం నుంచి ప్రారంభం కావడంతో పలు రాష్ట్రల్లో బస్సు సర్వీసులను పునరుద్ధరించారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో బస్సులు రోడ్లపైకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (యూపీఎస్ఆర్‌టీసీ) ఆంక్షలు తొలగించడంతో కైసెర్‌బాగ్, ఛార్‌బాగ్, అలంబాక్ బస్ స్టేషన్ల నుంచి బస్ సర్వీసులను ప్రారంభించారు. ప్రయాణికులకు ఫేస్ మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. 50 శాతం సీట్ల సామర్థ్యంలో బస్సులు నడిపారు. లాక్‌డౌన్ నేపథ్యంలో దాదాపు రెండున్నర మాసాల తర్వాత తొలిసారిగా బస్సు నడుపుతున్నట్టు డ్రైవర్ మొహమ్మద్ అక్రం తెలిపారు.


మరోవైపు, గుజరాత్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సైతం సోమవారం నుంచి బస్సు సర్వీసులను తిరిగి పునరుద్ధరించింది. అంతరాష్ట్ర రైళ్లు, రాష్ట్ర బస్సు సర్వీసులు తిరువనంతపురంలోనూ ప్రారంభమయ్యాయి. తమిళనాడు ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సు సర్వీసులు, అహ్మదాబాద్ మున్సిపల్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసులు కూడా దాదాపు రెండున్నర మాసాల తర్వాత తిరిగి ప్రారంభమయ్యాయి.

Updated Date - 2020-06-01T21:58:57+05:30 IST